Site icon vidhaatha

Kiss fight | పెళ్లి మండపంలో ‘ముద్దు’ రేపిన కలకలం.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న వధూవరుల కుటుంబీకులు..!

Kiss fight : పెళ్లిమండపం సర్వాంగసుందరంగా ముస్తాబై ఉంది. బంధుమిత్రులు పెళ్లి వేడుకను కనులారా చూసి, వధూవరులను ఆశీర్వదించేందుకు భారీ సంఖ్యలో విచ్చేశారు. వధూవరులను ఒకరి తర్వాత ఒకరిని పెళ్లి వేదికపైకి తీసుకొచ్చారు. పెళ్లిమండపమంతా అనందోత్సాహాలతో సందడిసందడిగా ఉంది. వరుడి మెడలో వధువు, వధువు మెడలో వరుడు మాలలు వేసుకున్నారు. అంతవరకు బాగానే సాగింది. ఆ తర్వాత వరుడు చేసిన ఓ చిలిపి పని కళ్యాణమండపంలో ఒక్కసారిగా కలకలం రేపింది. వధూవరుల కుటుంబాలు పొట్టుపొట్టుగా కొట్టుకునే పరిస్థితి తీసుకొచ్చింది.

ఇంతకు వరుడు ఏం చేశాడంటే.. వధూవరులు పరస్పరం మాలలు మార్చుకున్న తర్వాత ఆమెను అమాంతం పట్టుకుని ముద్దుపెట్టాడు. ఇది వధువు కుటుంబసభ్యులకు ఆగ్రహం తెప్పించింది. పెళ్లిమండపంపై బహరిరంగంగా మా అమ్మాయికి ముద్దుపెట్టి పరువు తీశాడంటూ వధువు కుటుంబసభ్యులు గొడవకు దిగారు. దాంతో అందులో తప్పేముందంటూ వరుడు కుటుంబసభ్యులు కూడా ఎదరుతిరిగారు. మా అమ్మాయికి వారిస్తున్నా పెళ్లికొడుకు బలవంతంగా ముద్దుపెట్టాడని పెళ్లికూతురు కుటుంబసభ్యులు మండిపడ్డారు. పెళ్లికూతురు అంగీకారంతోనే తాను ముద్దుపెట్టానని వరుడు చెప్పాడు.

ఇలా రెండు కుటుంబాల మధ్య మాటమాటా పెరిగి కొట్టుకునే దాకా వెళ్లింది. ఒకరినొకరు గల్లలు పట్టుకుని తన్నుకున్నారు. రెండు కుటుంబాల పరస్పర దాడులతో అప్పటిదాకా కళకళలాడిన పెళ్లి మండపంలో ఒక్కసారిగా కలకలం రేగింది. పెళ్లి వేదిక రణరంగంగా మారిపోయింది. పిడిగుద్దులు గుద్దుకోవడంతో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనపై సమాచారం అందడంతో పోలీసులు రంగంలోకి దిగారు. గాయపడిన ఏడుగురిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

అయితే ఈ దాడికి సంబంధించి వధూవరుల కుటుంబసభ్యులు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోకపోవడం గమనార్హం. అయినా పోలీసులు మాత్రం బహిరంగంగా కొట్టుకుని ఇతరులను భయభ్రాంతులకు గురిచేసినందుకు ఆరుగురిపై కేసు నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం లక్నో జిల్లా హాపూర్‌ పట్టణంలోని అశోక్‌నగర్‌లో గత సోమవారం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Exit mobile version