Fourth Century Roman Bronze Coins | సముద్రంలో ఎప్పుడో మునిగిపోయిన వాటి గురించి ఔత్సాహిక డైవర్లు అన్వేషిస్తూ ఉంటారు. కొందరు లోతుల్లోకి వెళ్లి మరీ అక్కడ ఏళ్లుగా పడి ఉన్న అపురూపమైన వస్తువులను వెలికి తీయడం తెలిసిందే. తాజాగా ఇలానే ఒక ఔత్సాహిక డైవర్ ఇటలీలోని సార్డీనియా దీవికి తూర్పు ఈశాన్య తీరంలోని ఆర్జాచేనా (Arzachena) పట్టణం సమీపంలో అద్భుతమైన నిధిని వెలికితీశాడు. ఆ నిధిలో నాలుగో శతాబ్దానికి సంబంధించిన రాగి నాణేలు లభించాయి. బీచ్‌కి, సముద్రంలోని అండర్‌వాటర్ గడ్డి మధ్య కుప్పలు కుప్పలుగా, చెల్లాచెదురుగా ఇవి పడి ఉన్నాయి. ఇవన్నీ సుమారు 30వేల నుంచి 50వేల వరకూ ఉండొచ్చని అంచనా వేశారు. సముద్ర కెరటాలు ఎగసిపడుతున్న రెండు ప్రధాన ప్రాంతాల్లో వీటిని కనుగొన్నారు. ఈ ప్రాంతాల్లో సముద్ర తీరం లోతు తక్కువగా ఉన్నదని, దీంతో అవి ఇసుకలో పాతుకుపోకుండా.. విస్తరించి ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నాణేలు మాత్రమే కాదు.. వాటితో పాటు పురాతన కుండలకు సంబంధించిన పెంకులు కూడా లభించాయి. ఆఫ్రికా, ఆసియా ప్రాంతాల నుంచి ఇవి వచ్చి ఉంటాయని అంచనా వేస్తున్నారు. దీనిని బట్టి అప్పట్లో ఈ మార్గం ద్వారా వాణిజ్యం జరిగేదని స్పష్టమవుతున్నదని శాస్త్రవేత్తలు పేర్కొన్నారని Earth.comలో ప్రచురితమైన కథనం పేర్కొంటున్నది. నాణేలతోపాటు కుండలకు సంబంధించిన పెంకులు కూడా కనిపించడంతో ఉత్తర ఆఫ్రికా నుంచి తూర్పు ప్రావిన్స్‌ల నుంచి వచ్చే ఓడల్లో వ్యాపారులు ఒకే ప్రయాణంలో అనేక రకాల వస్తువులను అమ్మకాల కోసం తీసుకొచ్చేవారని అర్థమవుతున్నదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఏ నాణేలు దొరికాయి?
- వీటిలో ఎక్కువగా ఫోలిస్ (follis) అనే నాణేలు ఉన్నాయి. వీటిని 284 నుండి 305 వరకు రోమన్ చక్రవర్తిగా ఉన్న డయోక్లెటియన్ దేశంలో ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల్లో భాగంగా పరిచయం చేశాడు.
- అప్పట్లో వీటి బరువు సుమారు పది గ్రాముల వరకూ ఉండేది. దానికి స్పల్పంగా వెండిపూత కూడా ఉండేది.
- కాలక్రమంలో వెండి తగ్గిపోవడంతో నాణేల విలువ లోహపరంగా తగ్గినా.. రోజువారీ వాణిజ్య కార్యకలాపాల్లో మాత్రం పెద్ద ఎత్తునే వాడుకలో ఉండేవి.
ఇదీ నాణేల చరిత్ర
- ఈ ఫోలిస్ నాణేలు ఆనాటి రోమన్ సామ్రాజ్యంలో సాధారణ కరెన్సీగా ఉపయోగించారు.
- నావికులు తాము బస చేసిన చోట భోజనం బిల్లు చెల్లించేందుకు, రైతులు తమ ఉత్పత్తులను విక్రయించే సమయంలోనూ ఇవే మారకంగా ఉండేవి.
- ఆయా నాణేలపై ఉన్న నాటి రాజుల చిత్రాలు, శాసనాలు, అచ్చలు ఆనాటి రాజకీయ, ఆర్థిక పరిస్థితుల గురించి ఎన్నో సంగతులు వెల్లడిస్తాయి.
- నాణేల తయారీలో ఉపయోగించిన లోహాల కూర్పు, కరిగే ముద్రలు నాణేల తయారీలో (టంకశాల) ప్రాచీన విజ్ఞానానికి సంబంధించిన సమాచారం అందించేందుకు దోహదం చేస్తాయి.
అరుదైన ఆవిష్కరణ
అర్జాచెనా వద్ద లభించిన నాణేలు.. ఇటీవలి సంవత్సరాల్లో నాణేల ఆవిష్కరణలో కీలకమైనవని ఇటలీ సాంస్కృతిక శాఖకు చెందిన లూయిజీ లా రోక్కా చెప్పారు. ఇది కేవలం ఒక నిధి మాత్రమే కాదని, ఆనాటి రోమన్ పాలనలో అక్కడి ఆర్థిక వ్యవస్థ, వాణిజ్యానికి ఉపయోగించిన మార్గాలు, ఆ దేశంలో రాజకీయ మార్పులు గురించి స్పష్టమైన ఆధారమని నిపుణులు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Indians Shift Focus To 01 Visas | హెచ్-1 బీ వీసా ఫీజు పెంపు: ఓ-1 వీసాల వైపు అందరిచూపు
Dussehra Bumper Offers : దసరా ఆఫర్.. రూ.150కే మేక, బీరు పెట్టే!
Telangana Electricity Job Notification 2025 | గుడ్ న్యూస్..తెలంగాణ విద్యుత్ సంస్థలలో 3వేల ఉద్యోగాల భర్తీకి ఏర్పాట్లు