విధాత: స్వలింగ సంపర్కుల వివాహాలకు సంబంధించి క్రైస్తవ మతాధిపతి పోప్ (Pope) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి రోమన్ క్యాథలిక్ పాస్టర్లు, ఫాదర్లు స్వలింగ సంపర్క జంటలకు ఆశీర్వాదం అందించొచ్చని అనుమతి ఇచ్చారు. అయితే సాధారణ చర్చి కార్యక్రమాల్లో, ప్రార్థనల్లో వీటిని కలపకూడదని సూచించారు.
ఈ మేరకు వాటికన్ సిటీ తాజాగా ఒక ప్రకటనను జారీ చేసింది. స్వలింగ సంపర్కులు, క్వీర్ అంశంపై ఎంతో వ్యతిరేకతతో ఉన్న వాటికన్.. ఈ నిర్ణయం తీసుకోవడం ఆయా వర్గాల్లో ఆనందానికి కారణమైంది. అయితే సాధారణ వివాహాలకు ఇచ్చే ఆశర్వాదం లాగ ఇది ఉండకూడదని వాటికన్ స్పష్టం చేసింది. ఫాదర్లు ఆ వచ్చిన జంట పూర్వాపరాలను బేరీజు వేసుకుని స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవాని.. దేవుణ్ని కావాలని వచ్చారు కాబట్టి సాధారణ ఆశీర్వాదాన్ని ఇవ్వాలని స్పష్టం చేసింది.
క్రైస్తవ మతాధికారుల సమావేశం సందర్భంగా స్వలింప సంపర్కుల వివాహాలపై త్వరలోనే తన నిర్ణయం చెబుతానని పోప్ అక్టోబరులోనే ప్రకటించారు. దానికి అనుగుణంగానే ఈ నిర్ణయం వెలువడింది. సుమారు 11 పేజీల సూచనలు నిబంధనలతో ఒక మార్గదర్శకాల పత్రాన్ని వాటికన్ విడుదల చేసింది. స్వలింగుల మధ్య ఆకర్షణను పాపంగా భావించనప్పటికీ.. వారి మధ్య సంబంధాలు పాపపూరితమైనవిగా చర్చి భావిస్తోంది.
అయితే ఎల్జీబీటీక్యూ సమూహాన్ని నిబంధనల పేరిట దూరం చేసుకోవడం కన్నా మధ్యే మార్గంగా వారిని తమతో పాటు కలుపుకోవడమే మంచిదన్నది పోప్ ఆలోచనగా తెలుస్తోంది. వాటికన్ తాజా నిర్ణయం ఒక గొప్ప మలుపని ఎల్జీబీటీక్యూ సమూహాలతో కలిసి పని చేస్తున్న అమెరికన్ ప్రసిద్ధ మత బోధకుడు ఫాదర్ జేమ్స్ మార్టిన్ అభివర్ణించారు. అయితే ఈ నిర్ణయంపై వ్యతిరేకత వచ్చే అవకాశం కూడా లేకపోలేదు.