బాబోయ్​..! ఇలా అయితే కష్టం.. : తెలుగు యువకుడికి ₹240 కోట్ల జాక్​పాట్​.!

దుబాయ్‌లో నివసిస్తున్న తెలుగు యువకుడు **అనిల్‌కుమార్‌ బొల్లా (29)**కు అదృష్టం కలిసివచ్చింది. ఆయన యూఏఈ లాటరీ చరిత్రలోనే అతిపెద్ద జాక్‌పాట్‌ ₹240 కోట్లు (AED 100 మిలియన్) గెలుచుకున్నారు. తల్లి పుట్టిన రోజైన “11” సంఖ్యను లాటరీ నంబర్‌గా ఎంచుకోవడం ఆయనకు అద్భుత అదృష్టాన్ని తీసుకొచ్చింది. దీపావళికి ముందు ఈ గెలుపు ఆయన జీవితంలో ముందుగానే కళ్లుమిరుమిట్లు గొలిపే కాంతిని విరజిమ్మింది.

Telugu Man Wins ₹240 Crore UAE Lottery — Mother’s Birthday Number Turns Into Record-Breaking Luck

Telugu Man Wins ₹240 Crore UAE Lottery — Mother’s Birthday Number Turns Lucky!

విధాత ( వైరల్​ న్యూస్​ డెస్క్​)

దుబాయ్‌: అదృష్టం ఎప్పుడు తలుపుతడుతుందో ఎవరూ ఊహించలేరు. అబుదాబిలో నివసిస్తున్న ఒక తెలుగు యువకుడిపై అదృష్టం ఒక్కసారిగా గెరిల్లా దాడి చేసింది. ఆ యువకుడి పేరు అనిల్‌కుమార్ బొల్లా (29). ఆయన యూఏఈ లాటరీ చరిత్రలోనే అతిపెద్ద జాక్‌పాట్‌ ₹240 కోట్లు (AED 100 మిలియన్) గెలుచుకున్నాడు. యూఏఈ లాటరీలో ఇప్పటివరకు ఎవరూ ఇంత పెద్ద మొత్తాన్ని గెలుచుకోలేదు. ఈ గెలుపు ఆయన జీవితాన్ని ఒక్క రాత్రిలో మార్చేసింది.

ఇది నా తల్లి దీవెన : అనిల్​కుమార్​

అనిల్‌కుమార్ చెప్పినట్టు, తల్లి పుట్టిన తేదీ అయిన “11” సంఖ్య ఆయనకు అదృష్టాన్ని తెచ్చిందట. లాటరీ టికెట్‌లో మిగిలిన నంబర్లు “ఈజీ పిక్‌” ద్వారా వచ్చినా, చివరి నంబర్‌ను తానే ఎంచుకున్నానని చెప్పారు. అదే నంబర్‌ విజేతగా తేలడంతో ఆనందంతో ఆయన కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. “ఇదేం మాయ కాదు… నా తల్లి దీవెన మాత్రమే” అని చిరునవ్వుతో అన్నారు. అనిల్​ కొన్న 12 టికెట్లలో గెలిచిన టికెట్​ కూడా ఒకటి. అక్టోబర్‌ 18న జరిగిన 23వ “లక్కీ డే డ్రా”లో ఆయన నంబర్‌కు జాక్​పాట్​ తగిలింది. గెలిచిన విషయం తెలిసిన క్షణంలోనే ఆయన షాక్‌కు గురయ్యారని చెప్పారు. “నేను సోఫాపై కూర్చొని ఉండగా ఫోన్‌ వచ్చింది… మొదట నమ్మలేకపోయా. కానీ తర్వాత నిజమని తెలుసుకున్నప్పుడు కళ్లలో నీళ్లు తిరిగాయి,” అని భావోద్వేగంగా చెప్పారు.

ఇప్పుడు ఈ భారీ మొత్తాన్ని ఎలా ఉపయోగించాలో ఆలోచిస్తున్నానని అనిల్‌ చెప్పారు. “ఇది డబ్బు మాత్రమే కాదు, ఆలోచన మార్చే అవకాశం కూడా. తల్లిదండ్రుల చిన్న చిన్న కలలన్నీ నెరవేర్చాలనుకుంటున్నా. ఒక సూపర్‌కార్ కొనుగోలు చేసి, లగ్జరీ హోటల్‌లో సెలబ్రేట్‌ చేస్తా. అలాగే నా కుటుంబాన్ని యూఏఈకి తీసుకువచ్చి ఇక్కడే స్థిరపడతా,” అని తెలిపారు. తనకు వచ్చిన ఈ అదృష్టంలో కొంత భాగాన్ని దానధర్మాలకూ ఇవ్వాలన్న సంకల్పం ఉందని చెప్పారు. “నా దగ్గర ఉన్న దానితో కొంతమంది జీవితాల్లో వెలుగు రాకపోతే ఆ డబ్బుకి అర్ధం లేదు” అని ఆయన అన్నారు.

యూఏఈ లాటరీ నిర్వాహకులు ఆయన గెలుపు గురించి మాట్లాడుతూ, “ఇది యూఏఈ లాటరీ చరిత్రలో నిలిచిపోయే విజయం. అనిల్‌కుమార్ గెలుపు కొత్త రికార్డులు సృష్టించింది” అని పేర్కొన్నారు.

పన్నులు, లాటరీ నిబంధనలు ఎలా ఉంటాయి?

యూఏఈలో గెలిచిన లాటరీపై ఎటువంటి స్థానిక పన్నులు లేవు. అంటే అనిల్‌కుమార్‌ గెలుచుకున్న మొత్తం మొత్తం AED 100 మిలియన్‌ — పూర్తిగా ఆయన బ్యాంక్‌ ఖాతాలోనే జమ అవుతుంది.

కానీ భారత్‌ పన్ను చట్టాల ప్రకారం, లాటరీ గెలుచుకున్నవారికి 30% పన్ను, దానిపై 15% సర్‌చార్జ్, అలాగే 4% హెల్త్‌ & ఎడ్యుకేషన్‌ సెస్‌ వసూలు చేస్తారు. అయితే, ఈ పన్ను భారత నివాసులకే వర్తిస్తుంది. అనిల్‌కుమార్‌ యూఏఈలో ఏడాదిన్నరగా నివసిస్తున్నారు, కాబట్టి ఆయనకు NRI (Non-Resident Indian) హోదా ఉంటుంది. అర్థం — ఆయనకు భారతదేశంలో ఈ లాటరీపై ఏ పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.

లాటరీ డబ్బులు భారత్​కు రాలేవు

కానీ, అసలు విషయమేమిటంటే, ఈ లాటరీ గెలుపు మొత్తాన్ని భారత్‌కు పంపించడం పూర్తిగా నిషేధం. భారత రిజర్వ్‌ బ్యాంక్‌ (RBI) మరియు ఫారిన్‌ ఎక్స్చేంజ్‌ మేనేజ్‌మెంట్‌ చట్టం (FEMA) ప్రకారం, లాటరీ గెలుపు లేదా జూదం ద్వారా వచ్చిన డబ్బును భారత్‌కు పంపడం నిషేధం. అందువల్ల అనిల్‌కుమార్‌ తన గెలుపు మొత్తాన్ని యూఏఈలోనే ఖర్చుపెట్టాలి. ఆయన మాట్లాడుతూ — “ఇది పెద్ద మొత్తమేమో కానీ, దాన్ని తెలివిగా వాడితేనే దాని విలువ ఉంటుంది. నేను దానిలో కొంత భాగాన్ని సేవా కార్యక్రమాలకు కేటాయిస్తా” అని చెప్పారు.

యూఏఈ లాటరీ చట్టాలు – ఎవరికి అర్హత, ఎలా గెలవాలి

యూఏఈలో సాధారణంగా జూదం నిషేధితమే, కానీ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన కొన్ని లీగల్‌ రాఫిల్‌ డ్రాలు మరియు లాటరీలు మాత్రమే నడుస్తాయి. అవి పూర్తిగా కామర్స్‌ మంత్రిత్వ శాఖ మరియు జనరల్‌ కమర్షియల్‌ గేమింగ్‌ రెగ్యులేటరీ అథారిటీ (GCGRA) పర్యవేక్షణలో ఉంటాయి.

యూఏఈ లాటరీ (The UAE Lottery) — ఇది అధికారిక జాతీయ లాటరీ. ఇందులో పాల్గొనడానికి ఎమిరేట్స్‌ ఐడి తప్పనిసరి. కేవలం యూఏఈ నివాసితులు మాత్రమే ఈ లాటరీలో పాల్గొనగలరు.

ఇక బిగ్‌ టికెట్‌ అబుదాబి లేదా ఎమిరేట్స్‌ డ్రా వంటి ఇతర రాఫిల్‌ డ్రాల్లో మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా పాల్గొనవచ్చు. పర్యాటకులు కూడా ఆన్‌లైన్‌లో టికెట్లు కొనుగోలు చేయవచ్చు.

Latest News