సకలకార్యసిద్ధి శ్రీమద్ రామాయణ పారాయణం
విధాత:శ్రీవారి అనుగ్రహంతో సృష్టిలోని సకల జీవరాశులు సుభిక్షంగా ఉండాలని, అన్ని కార్యక్రమాలు సజావుగా సాగాలని కోరుకుంటూ జులై 25న తిరుమలలో సకలకార్యసిద్ధి శ్రీమద్ రామాయణ పారాయణ కార్యక్రమం ప్రారంభించాం.తిరుమల వసంత మండపం, ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో ఈ కార్యక్రమం ఆగస్టు 23వ తేదీ వరకు జరుగనుంది. 32 మంది ప్రముఖ పండితులు పాల్గొంటున్నారు.
రంగనాయకుల మండపంలో అధర్వణ వేదపారాయణం :
శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో అధర్వణ వేదపారాయణం జరుగుతోంది.లోక క్షేమం కోసం కరోనా వ్యాధిని మానవాళికి దూరం చేయాలని శ్రీవారిని ప్రార్థిస్తూ 2020, ఏప్రిల్ 13 నుండి టిటిడి చతుర్వేద పారాయణం నిర్వహిస్తోంది. ఇప్పటివరకు రుగ్వేదం, యజుర్వేదం, సామవేదంలోని శాఖలు పూర్తయ్యాయి.
సుందరకాండ పారాయణం ముగింపు
- కరోనా మహమ్మారిని దూరం చేయాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమల నాదనీరాజనం వేదికపై మొత్తం 68 సర్గల్లో గల 2,821 శ్లోకాలను 409 రోజులపాటు టిటిడి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సుందరకాండ పారాయణం జులై 24న ముగిసింది.అదేవిధంగా, జులై 25వ తేదీ నుండి బాలకాండ పారాయణం జరుగుతోంది.
కనకాంబర సహిత కోటి మల్లెపుష్ప మహాయాగం
కోవిడ్-19 కారణంగా ప్రపంచ మానవాళికి తలెత్తిన ఆర్థిక ఇబ్బందులను తొలగించాలని శ్రీమహాలక్ష్మి అవతారమైన శ్రీ పద్మావతి అమ్మవారిని ప్రార్థిస్తూ జులై 16 నుంచి 24వ తేదీ వరకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కనకాంబర సహిత కోటి మల్లెపుష్ప మహాయాగం నిర్వహించాం.
జ్యేష్ఠ మాసంలో విశేష పూజా కార్యక్రమాలు
లోక కల్యాణార్థం జ్యేష్ఠ మాసంలో పలు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించాం.కార్తీక, ధనుర్, మాఘ, ఫాల్గుణ, చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ, ఆషాడ మాస ఉత్సవాలకు భక్తుల నుండి విశేషాదరణ లభించింది. శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ఈ కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేసింది.జూన్ 22 నుంచి 24వ తేదీ వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో జ్యేష్టాభిషేకం నిర్వహించాం.
ఆషాడ మాసంలో…
ఆషాడ మాస శుక్ల ఏకాదశి సందర్భంగా జులై 20న తిరుమల వసంతమండపంలో విష్ణు అర్చనం ఆగమోక్తంగా నిర్వహించాం.
శ్రావణ మాసంలో…
ఆగస్టు 13న గరుడపంచమి, 20న వరలక్ష్మీ వ్రతం, 22న శ్రావణపౌర్ణమి పర్వదినాలను నిర్వహిస్తాం. కోవిడ్ పూర్తిగా తగ్గిపోయాక ప్రజలందరి భాగస్వామ్యంతో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించే ఆలోచన చేస్తున్నాం.