Adulterated Toddy Deaths | తెలంగాణ రాష్ట్రంలో కల్తీ కల్లు సమస్య మరోసారి చర్చల్లోకి వచ్చింది. కల్తీ కల్లు.. తాగిన వారి ప్రాణాలు హరిస్తున్నది. మహబూబ్ నగర్, నల్లగొండ, కామారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో వరుసగా చోటు చేసుకున్న కల్తీ కల్లు మరణాలు.. దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి. కల్తీ కల్లు కారణంగా ఎందరో మానసిక రోగులుగా మారుతున్నారు. అయినప్పటికీ ప్రభుత్వాలు కల్తీ కల్లు మాఫియాను నియంత్రించడంలో విఫలమవుతున్నది. ఈ కల్తీ కల్లు కాటుకు కష్టజీవులే ప్రధానంగా బలవుతున్నారు. తాజాగా హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లిలో కల్తీ కల్లు తాగి నలుగురు చనిపోవడం, మరో 22 మంది హాస్పటళ్ల పాలవడంతో కల్తీ కల్లు వ్యవహారం మళ్లీ చర్చలోకి వచ్చింది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయాంలో కల్తీ కల్లును నివారించే క్రమంలో కల్లు కాంపౌండ్లను నిషేధించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కల్లుగీత కార్మికుల మేలు కోసం కేసీఆర్ ప్రభుత్వం పునరుద్ధరించింది. ప్రస్తుతం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కూడా వాటిని కొనసాగిస్తున్నది. అయితే.. కల్లుడిపోలు, కాంపౌండ్లకు సరఫరా అవుతున్న కల్లులో నాణ్యత ప్రమాణాలపై సరైన నిఘా.. తనిఖీలు కొరవడటంతో కల్తీకల్లు మాఫియా రెచ్చిపోతున్నదనే అభిప్రాయాలు ఉన్నాయి. కల్తీ కల్లును అరికట్టాల్సిన ఎక్సెజ్ శాఖ మాముళ్ల మత్తులో జోగుతుండటంతో పట్టణాలు, గ్రామాల్లో కల్తీ కల్లు విచ్చలవిడిగా ప్రవహిస్తూ శ్రమజీవుల ప్రాణాలను హరించి వేస్తున్నదని సామాజిక కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నీడలో అక్రమార్కులు రెచ్చిపోతున్నారని, కల్లుకు అలవాటు పడిన ప్రజల ప్రాణాలతో ఆటలాడుకుంటున్నారని పేర్కొంటున్నారు. ఆరోగ్యకరమైనదిగా చెప్పే కల్లు పేరిట కాసులకు కక్కుర్తిపడి కాలకూట విషాన్ని పేదల శరీరాల్లోకి నింపుతున్నారు. గ్రామాల్లోనే కాదు.. నగర ప్రాంతాల్లో సైతం కల్తీ కల్లు మాఫియా రెచ్చిపోతున్నా ఎక్సైజ్‌శాఖ పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. కల్తీ కల్లు కేసుల్లో ఎక్సైజ్, పోలీసు శాఖల మధ్య సమన్వయం కూడా సమస్యగా తయారైందని అంటున్నారు. క్లోరోహైడ్రేట్‌గా తేలితేనే తమ పాత్ర ఉంటుందని ఆబ్కారీ శాఖ చెబుతున్నది. మిగిలిన మత్తు పదార్థాలతో తమకు సంబంధం లేదని, అదంతా పోలీసులే చూసుకుంటారని వదిలేస్తున్నారని సామాజిక కార్యకర్తలు చెబుతున్నారు.
కల్తీ కాటుకు వరుస మరణాలు
ఈ ఏడాది ఏప్రిల్లో కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు తాగి ఏకంగా 58 మంది అస్వస్థతకు గురయ్యారు. నస్రుల్లా బాద్ మండలం అంకోల్, అంకోల్ తండా, దుర్కి, బీర్కూర్ దామరంచ గ్రామాల్లో కల్తీ కల్లు తాగిన బాధితులు అనారోగ్యానికి గురయ్యారు. కల్తీ కల్లు ప్రభావంతో మతిస్థిమితం కోల్పోయి వింతగా ప్రవర్తిస్తుండటంతో వారిని వెంటనే హాస్పిటల్కు తరలించారు. గాంధారి మండలంలోని గౌరారం గ్రామంలో కుస్తీ పోటీల ఉత్సవాల్లో కల్లు తాగిన 30 మంది అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఆరుగురు తీవ్ర అనారోగ్యానికి లోనయ్యారు. ఈ ఘటనలపై అప్పటి సబ్ కలెక్టర్ కిరణ్మయి విచారణ జరిపి కల్లు దుకాణాల లైసెన్స్‌లు రద్దు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత షరా మామూలే అన్నట్టు పరిస్థితి కొనసాగుతున్నదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2024 ఆక్టోబర్‌లో మహబూబ్ నగర్ జిల్లాలోని బల్మూర్ మండల పరిధిలోని కొండనాగులపల్లి గ్రామంలో కల్తీ కల్లు తాగి ఓ యువకుడు మృతి చెందాడు. అంతకుముందు భూత్పూర్ మండలం అమిస్తాపూర్ గ్రామం అంబేద్కర్‌నగర్‌కు చెందిన పోస్టల్‌శాఖలో ఏబీపీఎం ఉద్యోగి విష్ణుప్రకాష్.. కల్తీ కల్లు తాగి పిచ్చి లేసి ఐసీయూలో చికిత్స పొందుతూ చనిపోయాడు. 2024 డిసెంబర్లో నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం పెర్కకొండారంలో కల్తీ కల్లు తాగిన ఆరుగురు అస్వస్థతకు గురయ్యారు.
కాదేది కల్తీకి అనర్హం
స్వచ్ఛమైన ప్రకృతి ఒడిలో తాటి.. ఈత చెట్ల నుంచి వచ్చే కల్లు తాగుతున్నామన్న భావన క్రమంగా పట్టణాలే కాదు.. పల్లెల్లోనూ మామమవుతున్నది. చెట్టు కాడికి వెళ్లి కల్లు తాగినా కూడా అక్కడ పోసే కల్లు స్వచ్ఛమైనదో కాదోననే సందేహీ పట్టి పీడిస్తూ ఉంటుందని గ్రామీణులు వాపోతున్నారు. అలాంటిది.. పట్టణాల్లో కల్లు కంపౌండ్లలో దొరికే కల్లు నాణ్యతపై నమ్మకం నేతి బీరకాయలో నెయ్యి సామెత వంటిదేనని అంటున్నారు. గ్రామాల నుంచి కల్లు సేకరించి సీసాల్లో నింపి అబ్కారీ అనుమతులతో కల్లు కాంపౌండ్లు నిర్వహిస్తుంటారు. ఇక్కడ లభించే కల్లు స్వచ్ఛమైనదేననే భావనతోనే శ్రమజీవులు తమ ఒంటి కష్టం మర్చిపోయేందుకు కల్లును ఆశ్రయిస్తూ ఉంటారు. అటువంటి కష్టజీవులనే లక్ష్యంగా చేసుకుని కల్తీ మాఫియా మత్తు పదార్ధాలు కలిపిన కల్లు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్కసారి రసాయనాలు కలిపిన ఈ కల్లు తాగితే దానికే బానిసై పొద్దంతా తాగుతుంటారని వైద్య నిపుణులు చెబుతున్నారు. మత్తుపదార్థాలు కలిపిన కల్లు లభించనివారిలో వింత ప్రవర్తనలు చోటుచేసుకుంటున్నాయి. కల్తీ కల్లు తాగడం వల్ల నాలిక మొద్దు బారడం, కాళ్లు, చేతులు వంకర్లు పోవడంతోపాటు వింతగా ప్రవర్తిస్తున్నారు. నిబంధనల ప్రకారం ఎక్సైజ్ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు కల్లు దుకాణాలు తనిఖీ చేయాలి. నమూనాలను ప్రాథమికంగా పరీక్షించడానికి అధికారుల వద్ద మినీ కిట్లు ఉంటాయి. కానీ, ఎక్కడా నమూనాల ఫలితాలను బయటకు వెల్లడించడం లేదన్న విమర్శలున్నాయి. కల్తీ కల్లు అస్వస్థత ఘటనలు బయటపడినప్పుడే హడావుడి చేసి మళ్లీ వ్యాపారులకు అనుమతులిస్తున్నారనే వాదనలు బలంగానే ఉన్నాయి.
అమ్మినోడికి కోట్ల ఆదాయం.. తాగినోడికి సమాధి
రియల్ ఎస్టేట్తోపాటు సాగు భూమి విస్తీర్ణం పెరిగిన నేపథ్యంలో సహజ సిద్ధమైన చెట్ల కల్లు విక్రయాలు తక్కువయిపోయాయనే అభిప్రాయాలు ఉన్నాయి. తాగే వారి సంఖ్య అధికంగా ఉండటంతో ఉన్న కల్లులోనే ఆల్ఫ్రాజోలం, డైజోఫాం, క్లోరోహైడ్రేట్ వంటి మత్తు పదార్థాలను కలిపి కృత్రిమ కల్తీ కల్లు తయారు చేస్తున్నారన్న ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించాలనే ఆశతో రసాయనాలతో కల్తీ కల్లు తయారు చేసేవారు కోట్లు ఆర్జిస్తుండగా.. తాగిన వాళ్లకు చావే గతి అవుతున్నది. కల్తీ కల్లు మాఫియా రాజకీయ పార్టీల్లో ప్రాబల్యం పెంచుకుంటూ, అధికారులను మచ్చిక చేసుకుని తమ దందా నిరాటకంగా కొనసాగిస్తున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సుమారు 10 లీటర్ల సహజ సిద్ధమైన కల్లులో పదిరెట్లకు మించి నీళ్లు కలిపి అందులో మోతాదుకు మించి మత్తు పదార్థాన్ని కలుపడం వల్ల కల్లు ప్రియులు రోగాల బారిన పడుతున్నారు. మహారాష్ట్ర నుంచి ఎక్కువగా కల్తీ కల్లు రసాయనాలు వస్తున్నాయని సమాచారం. కల్తీ కల్లు దందాను నియంత్రించాల్సిన ఎక్సైజ్ అధికారులు ఆడపాదడపా అక్కడక్కడ దాడులు చేసి, ఒకటో, రెండో కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారని, దీంతో కల్లు డిపోలు, షాపుల్లోనే కాకుండా ఎక్కడ పడితే అక్కడ కల్తీ కల్లును అమ్ముతున్నారని తెలుస్తున్నది. అచ్చంగా కల్లు మాదిరిగానే కనిపించే కృత్రిమ కల్లుకు అలవాటు పడిన వారు స్వచ్ఛమైన కల్లు తాగినా.. మత్తు ఎక్కడం లేదని గోల చేస్తుంటారు. మద్యం ధరలు ఎక్కువగా ఉండటంతో పేదలు, రోజువారీ కూలీలు ఈ కల్లు వైపే మొగ్గు చూపుతున్నారు. కానీ.. అదే వారికి కొన్ని సందర్భాల్లో శాపంగా పరిణమిస్తున్నది.