Telangana | కోడ్‌ ముగిశాక కొలువుల పండుగ!

కోడ్‌ ముగిశాక రాష్ట్రంలో కొలువుల పండుగ మొదలుకానున్నది. కోడ్‌ కారణంగా ఇంతకాలం నిలిచిపోయిన పలు నోటిఫికేషన్ల ఫలితాలు వెల్లడితో పాటు ఇప్పటికే నియామకపత్రాలు అందుకున్న అభ్యర్థులకు పోస్టింగ్‌లు ఇవ్వనున్నారు

  • Publish Date - June 2, 2024 / 06:46 PM IST

రెండు నెలల్లో గ్రూప్‌ – 4 భర్తీ ప్రక్రియ పూర్తి?
ఏర్పాట్లు చేస్తున్న తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌

(విధాత ప్రత్యేకం)

కోడ్‌ ముగిశాక రాష్ట్రంలో కొలువుల పండుగ మొదలుకానున్నది. కోడ్‌ కారణంగా ఇంతకాలం నిలిచిపోయిన పలు నోటిఫికేషన్ల ఫలితాలు వెల్లడితో పాటు ఇప్పటికే నియామకపత్రాలు అందుకున్న అభ్యర్థులకు పోస్టింగ్‌లు ఇవ్వనున్నారు. గురుకుల, పోలీస్‌ నియామకబోర్డుల పరిధిలో నియామకాలు పూర్తికాగా, టీజీపీఎస్సీ పరిధిలో భారీ ఎత్తున పలు నోటిపికేషన్లకు ఫలితాలు వెల్లడికానున్నాయి. టీజీపీఎస్సీ పరిధిలోనే సుమారు 13 వేలకు పైగా పోస్టులకు సంబంధించి తుది ఫలితాల వెల్లడి, ధృవీకరణ పత్రాల పరిశీలన దశలో ఉన్నాయి. పరిశీలనలు పూర్తయిన నోటిఫికేషన్లకు త్వరలో తుది ఫలితాలు ప్రకటించనున్నది. టీజీపీఎస్సీ జారీ చేసిన ఉద్యోగ ప్రకటనల్లో అత్యధికంగా గ్రూప్‌-4 కింద 8,180 పోస్టులున్నాయి. రాత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా జనరల్‌ ర్యాకింగ్‌ లిస్ట్‌ ఇప్పటికే సర్వీస్‌ కమిషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా స్పోర్ట్స్‌ కేటగిరీలో 1,569 మంది సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ పూర్తయింది. మిగిలిన అభ్యర్థుల పరిశీలన ఈ నెలలో ప్రారంభించి సాధ్యమైనంత త్వరగా రెండు నెలల్లోనే గ్రూప్‌-4 పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేయాలని కమిషన్‌ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

పకడ్బందీగా గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష లీకేజీతో ఒకసారి, సర్వీస్‌ కమిషన్‌ పరీక్ష నిర్వహణలో నిబంధనలు పాటించని కారణంగా రెండోసారి రద్దైంది. దీంతోసారి మరోసారి జూన్‌ 9న నిర్వహించనున్న పరీక్షకు టీజీపీఎస్సీ ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నది. ఇందులో భాగంగా శనివారం హాల్‌టికెట్‌లను విడుదల చేసింది. జూన్ 9న ఉదయం 10.30గంటల నుంచి మధ్యాహ్నం 1గంట జరిగే ఈ పరీక్ష రాసే అభ్యర్థులు కమిషన్ వెబ్‌సైట్‌ నుంచి నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపింది.

రాష్ట్రంలో 563 గ్రూప్-1 పోస్టుల భర్తీ కోసం ఫిబ్రవరి 23 నుంచి మార్చి 16 వరకు ఆన్ లైన్‌లో దరఖాస్తులు స్వీకరించగా.. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4.03 లక్షల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. పరీక్ష రోజు ఉదయం 9గంటల నుంచే పరీక్ష కేంద్రాల్లోకి అభ్యర్థుల్ని అనుమతించనున్నారు. పది దాటితే పరీక్ష కేంద్రం గేట్లు మూసివేస్తామని.. ఆ తర్వాత ఎవరినీ లోపలికి అనుమతించేది లేదని అధికారులు స్పష్టంచేశారు. ఈసారి పరీక్ష నిర్వహణ కోసం పకడ్బందీ చర్యలు చేపడుతున్నది. నిబంధనలు పాటించడంలో అభ్యర్థులు, సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.

బయోమెట్రిక్‌ తప్పనిసరి

ప్రిలిమ్స్ రాసే అభ్యర్థులకు టీజీపీఎస్సీ కొన్ని సూచనలు చేసింది. అభ్యర్థులకు వ్యక్తిగత వివరాలతో కూడిన ఓఎంఆర్ పత్రాలు అందజేస్తామని వెల్లడించింది. పరీక్ష సమయంలో వేలిముద్ర, ఫొటో బయోమెట్రిక్ తప్పనిసరిగా ఇవ్వాలని, ఇవ్వనివారిని అనర్హులుగా ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ఈ బయోమెట్రిక్ ను నియామక ప్రక్రియ వివిధ దశల్లో ధృవీకరించుకుంటామని పేర్కొన్నది.

టీజీపీఎస్సీ “కీ”లక నిర్ణయం

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నిర్వహించే పోటీపరీక్షల ‘కీ’ (జవాబుల) సమస్యలకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) చెక్ పెట్టనున్నది. ప్రాథమిక కీ వెలువడినప్పటి నుంచి తుది కీ ఖరారయ్యే నాటికి అభ్యర్థుల్లో తలెత్తుతున్న సందేహాలు, గందరగోళ పరిస్థితులనుదూరం చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. అభ్యర్థులకు మానసిక ఆందోళనను దూరం చేసేందుకు గత కొన్నేళ్లుగా అనుసరిస్తున్న విధానంలో సంస్కరణలు చేపట్టింది.

నిపుణుల కమిటీ ఆధ్వర్యంలోనే ప్రాథమిక కీ వెల్లడించనున్నది. ఇక నుంచి ప్రాథమిక కీ విడుదల సమయంలోనే సమాధానాల్లో ప్రాధమిక తప్పులను గుర్తించి వాటిని సరిచేస్తూ సరైన సమాధానాలతో కీ ప్రక టించాలని నిర్ణయించింది. తద్వారా పరీక్ష రాసిన అభ్యర్థులకు ప్రాధమిక కీ సమ యంలోనే ఎన్ని మార్కులు వస్తాయి? మెరిట్ సాధిస్తామా? లేదా వంటి అంశాలపై ముందుగానే స్పష్టత రానున్నది. భవిష్యత్తులో నిర్వహించే పోటీ పరీక్షలన్నింటిలోనూ ఇదే విధానాన్ని కమిషన్ అనుసరించనున్నది.

జూన్‌ నుంచి ఆగస్టు వరకు వరుస పరీక్షలు

జూన్‌ నెలలో ఉద్యోగార్థులు గ్రూప్‌ ప్రిలిమ్స్ తో పాటు హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్స్‌ పరీక్ష ఇదే నెలలో 24వ తేదీన నిర్వహించనున్నది. అలాగే పేపర్‌ లీకేజీ కారణంగా రద్దైన డివిజినల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్స్‌ (డీఏవో) పరీక్షను సర్వీస్‌ కమిషన్‌ ఇప్పటికే ప్రకటించింది. జూన్‌ 30న డీఏవో పరీక్ష జరగనున్నది. 783 గ్రూప్-2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడిన విషయం తెలిసిందే. ఖాళీలను రిజర్వు కేటగిరీల వారీగా వెల్లడించిందిఆ పరీక్ష అనేకసార్లు వాయిదా పడిన గ్రూప్‌-2 పరీక్ష ఆగస్టు 7, 8 వ తేదీలలో నిర్వహిస్తామని కమిషన్‌ ప్రకటించింది. వీటికి తోడు గతంలో ప్రకటించిన డీఎస్సీలో తక్కువ పోస్టులు ఉన్నాయని అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు రేవంత్‌ ప్రభుత్వం దాన్ని రద్దు చేసి 11,062 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ ను విడుదల చేసింది.

డీఎస్సీ కంటే ముందు టెట్‌ నిర్వహించాలని అభ్యర్థుల కోరడంతో ఆ పరీక్షలు నిన్నటితో పూర్తయ్యాయి. ప్రభుత్వం విడుదల చేసిన కొత్త నోటిఫికేషన్‌ప్రకటన ప్రకారం గతంలో డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్న వారు మరోసారి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. మార్చి 4 నుంచి ఏప్రిల్ 2 వరకూ డీఎస్సీ పరీక్షకు దరఖాస్తులు స్వీకరించింది. పూర్తిగా ఆన్ లైన్ విధానంలోనే డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తామని గతంలోనే విద్యాశాఖ వెల్లడించింది. పరీక్షల తేదీల్ని త్వరలో ప్రకటించనున్నది.

గ్రూప్-3 రివైజ్డ్ ఖాళీల వివరాలు వెల్లడి

మహిళలకు సమాంతర రిజర్వేషన్లను అమలు చేస్తున్నందున గ్రూప్-3 నోటిఫికేషన్లో ఖాళీల వివరాల రివైజ్డ్ బ్రేకప్ ను టీజీపీఎస్సీ ఇప్పటికే ప్రకటించింది. ఈ రివైజ్డ్ ఖాళీల బ్రేకప్ లో మహిళలకు రోస్టర్‌పాయింట్‌ తొలిగించి, అన్ని ఖాళీలను రిజర్వు కేటగిరీల వారీగా వెల్లడించింది. తెలంగాణలో గ్రూప్-3 సర్వీసుకు సంబంధించి 1,388 ఉద్యోగాల భర్తీకి 2022 డిసెంబర్లో టీజీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం విదితమే. ఈ ఉద్యోగ రాత పరీక్షలు నవంబర్ 17, 18 తేదీల్లో నిర్వహించనున్నారు.

ఈ లెక్కన ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్‌ అయ్యే వారికి జూన్‌ నెల నుంచి నవంబర్‌ వరకు గ్రూప్‌ 1, 2, 3 పరీక్షలతో పాటు డీఎస్సీ,హాస్టల్‌ వెల్ఫేర్‌, డీఏవో వంటి పోస్టులకు పరీక్షలు జరగనున్నాయి. కాబట్టి సార్వత్రిక ఎన్నికలతో మూడు నెలలుగా ప్రిపరేషన్‌పై దృష్టి సారించని వాళ్లంతా మళ్లీ స్టడీహాల్‌లలో చేరిపోయారు. లైబ్రరీ లలో గంటల తరబడి చదువుతున్నారు. నిపుణులు కూడా అప్లై చేసిన గ్రూప్స్‌ పరీక్షల సిలబస్‌ అనుగుణంగా నోట్స్‌ తయారు చేసుకుని అన్నింటిలో కామన్‌ గా ఉండే వాటిని వదిలిపెట్టి మిగిలిన వాటిని చదువుకోవాలని సూచిస్తున్నారు. సమయం తక్కువగా ఉన్నందున ఆందోళన చెందకుండా ఇప్పటికే చదివిన వాటిని రివైజ్‌ చేసుకోవాలి సూచిస్తున్నారు.

Latest News