Site icon vidhaatha

Bhoodan lands | బీఆర్ఎస్ ఏలుబడిలో అధికారిక భూ దోపిడీ! ఈడీ కౌంటర్‌తో ఐఏఎస్, ఐపీఎస్‌లకు దడ

Bhoodan lands | ఒకప్పుడు ప్రభుత్వ భూములను, వివాదాస్పద భూములను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేయడానికి రెవెన్యూ అధికారులు ఏమాత్రం సాహసించేవారు కాదు. కానీ పదేళ్ల పాలనలో బీఆరెస్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి వెబ్‌ పోర్టల్‌ పుణ్యమాని వేల ఎకరాలు సంబంధం లేని వ్యక్తుల చేతిలోకి వెళ్లాయనే ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలు కాదని, అవి వాస్తవాలని చెబుతున్నది.. భూదాన్‌ భూముల వ్యవహారం. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని నాగారంలోని భూదాన్‌ భూములు.. ఇలానే సంబంధం లేని వ్యక్తుల చేతిలోకి వెళ్లిపోయాయి. ఈ భూముల బదిలీ వెనుక తహసీల్దార్‌ మొదలుకుని.. జిల్లా కలెక్టర్‌ వరకూ పాత్ర ఉందని స్వయానా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ చెబుతున్నదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కఠిన చట్టాలు లేకపోవడం, ఉన్నవాటిని ఉల్లంఘించడం మొదలుకుని.. అవినీతికి పాల్పడిన అధికారుల ఆస్తుల స్వాధీనానికి తగిన చట్టాలు లేకపోవడం కూడా ఇటువంటి పరిణామాలకు కారణాలని సామాజిక కార్యకర్తలు చెబుతున్నారు. ఈ వ్యవహారంలో ఈడీ రంగ ప్రవేశం చేసిన నేపథ్యంలో.. అప్పటికే సదరు సర్వేనంబర్లలో భూములను కొనుగోలు చేసిన ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల గుండెల్లో దడ మొదలైందని అంటున్నారు.

అనుకున్నది ఒకటి… అయ్యింది మరొకటి

నాగారం గ్రామంలో భూదాన్ భూములు ఉన్నాయి. సర్వే నంబర్లు 181, 182లలో వంద ఎకరాలకు పైబడి నవాబ్ హాజీ అలీఖాన్ భూములు ఉండగా, ఆయన 1956లో భూదాన్ బోర్డుకు యాభై ఎకరాల వరకు అప్పగించారు. ఈ భూములపై కన్నేసిన కొందరు.. వారసురాలు అంటూ ఖాదరున్నీసా అనే ఒక మహిళను తెరమీదికి తీసుకువచ్చి తతంగం నడిపించారు. ఆయనకు ఇద్దరు కుమారులు ఉండగా వారిని కాదని కుమార్తె వారసురాలు అంటూ నకిలీ డాక్యుమెంట్లు తయారు చేశారు. మహేశ్వరం మండలం తహశీల్దార్, ఖాదరున్నీసా కలిసి 2017 సంవత్సరంలో భూదాన్ బోర్డు భూములను మినహాయించిందంటూ తప్పుడు, నకిలీ పత్రాలను తయారు చేసి ధరణి పోర్టల్ లోకి ఎక్కించేశారు. తహశీల్దార్ నుంచి వచ్చిన భూదాన్ భూముల వివరాలను ఏమాత్రం పరిశీలించకుండా సీసీఎల్ఏ కార్యాలయం వరకు ఆమోదాలు లభించాయి. దీంతో వారసత్వ పత్రాలు, పాస్ పుస్తకాలు మంజూరు కావడం, ఆ వెంటనే మ్యూటేషన్ కావడం కూడా జరిగిపోయింది. వారసత్వ పత్రాల జారీలో అప్పటి తహశీల్దార్ జ్యోతి, జిల్లా కలెక్టర్ దుగ్యాల అమోయ్ కుమార్ పాత్ర స్పష్టంగా ఉందని తమ విచారణలో తేలిందని ఈడీ చెబుతున్నది. ఈడీ విచారణలో మరో రెండు సర్వే నంబర్ల బాగోతం కూడా వెలుగుచూసింది. పిటిషనర్ బీర్ల మల్లేశ్‌ను విచారించగా 194, 195 సర్వే నంబర్లు కూడా భూదాన్ బోర్డువేనని, అందులో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కొనుగోలు చేశారని, పాస్ పుస్తకాలు కూడా ఉన్నాయని తెలిపారు. అతను చెప్పిన వాంగ్మూలాన్ని నమోదు చేసుకుని, ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా ఈడీ తెలంగాణ డీజీపీని కోరింది. కాని ఇప్పటి వరకు ఉలుకు పలుకు లేదు. పిటిషనర్‌ బీర్ల మల్లేశ్ 194, 195 సర్వే నంబర్ భూదాన్ భూములను తెలంగాణ రాష్ట్రానికి చెందిన పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, వారి కుటుంబ సభ్యులు కొనుగోలు చేశారని తమ విచారణలో తెలిపారన్నారు. దీనిపై తాము విచారణ జరపలేదని, మల్లేశ్ వాంగ్మూలం ఆధారంగా తెలంగాణ డీజీపీకి లేఖ రాసి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరామని హైకోర్టుకు విన్నవించారు. సర్వే నెంబర్ 194 లోని నవాబ్ హాజీఖాన్ నుంచి 1992 లో అబ్ధుల్ షుకూర్ కొనుగోలు చేసినట్లు తెలియచేస్తున్నప్పటికీ, అప్పటికే ఆయన భూ ఆక్రమణ కేసులు నమోదు అయి ఉన్నాయి. షుకూర్ పై భూ ఆక్రమణ కేసులు నమోదు అయినందున, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు చేసిన కొనుగోళ్లు మోసపూరితమని ఈడీ తన కౌంటర్ సుస్పష్టంగా తెలిపింది. తాజాగా ఈడీ తెలంగాణ హైకోర్టు కు కౌంటర్ దాఖలు చేయడం, మున్ముందు మరిన్ని వివరాలు తెలియచేస్తామని చెప్పడంతో భూదాన్ భూములు కొనుగోలు చేసిన అధికారుల్లో దడ మొదలైంది. ఇప్పటికే దీనిపై వారు హైకోర్టుకు వెళ్లినప్పటికీ ఎటువంటి ఉపశమనం లభించలేదు. ఈడీ చర్యల మూలంగా మరింత ఇబ్బందుల్లోకి అధికారులు వెళ్లే ప్రమాదముందని రిటైర్డు రెవెన్యూ అధికారులు అంటున్నారు.

వేల కోట్లు పోగేసుకున్న జిల్లా కలెక్టర్

రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్‌గా పనిచేసిన దుగ్యాల అమోయ్ కుమార్ వేల కోట్ల రూపాయలు పోగేసుకున్నారని రెవెన్యూ శాఖలో చర్చ జరుగుతోంది. రెవెన్యూ ఉద్యోగులు చర్చించుకుంటున్న దాని ప్రకారం రూ.5వేల కోట్ల వరకు సంపాదించారని అంటున్నారు. మండల తహశీల్దార్లు, రెవెన్యూ డివిజనల్ అధికారులు, డీఆర్వోలుకూడా ఏమీ తక్కువ తినలేదని చెబుతున్నారు. వీళ్లు కూడా వందల కోట్లు కూడబెట్టుకున్నారంటున్నారనే చర్చలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే రెండు సంవత్సరాల ముందు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా కలెక్టర్లు తమ ల్యాప్‌టాప్‌లను వెంట తీసుకుని ప్రగతి భవన్‌కు వెళ్లేవారని, అక్కడే కూర్చుని రికార్డులను తారుమారు చేయడం, ఆమోదించడం వంటి పనులు చేసేవారని కొందరు రిటైర్డ్‌ అధికారులు చెబుతున్నారు. సచివాలయం నుంచి ప్రధాన కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారులు ఫోన్ చేసినా స్పందించేవారు కాదని అంటున్నారు. డ్రైవర్లు, అటెండర్లకు ఫోన్ ఇచ్చి, ప్రగతి భవన్‌లో బిజీగా ఉన్నారని చెప్పించేవారని ఉద్యోగులు కూడా అప్పట్లో చర్చించుకునేవారు. ఇలాంటి భూముల లావాదేవీల్లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబానికి 50 శాతం వాటాలు నేరుగా వెళ్లేవని, పదిశాతం వాటాలు అధికారులు పంచుకుని, మిగతా 40 శాతం వాటా మాత్రం దరఖాస్తు దారులకు లేదా భూములు పొందేవారికి దక్కేవని అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది. అక్రమాలకు పాల్పడిన ప్రభుత్వ అధికారుల ఆస్తుల స్వాధీనం చేసుకుని ఉద్యోగాల నుంచి బర్తరఫ్ చేసే చట్టాలు లేకపోడం కూడా బరితెగింపునకు కారణం అంటున్నారు మాజీ ప్రభుత్వ ఉద్యోగులు. ఇప్పటికైనా చట్టంలో మార్పులు తీసుకువచ్చి, మన్ముందు అవినీతి, అక్రమాలకు తావు లేకుండా చేయాలని కోరుతున్నారు.

Exit mobile version