Site icon vidhaatha

BRS MLC Kavitha | హెచ్‌ఎంఎస్‌లోకి కవిత? దానికి గౌరవ అధ్యక్షురాలి బాధ్యత?

హైదరాబాద్‌, ఆగస్ట్‌ 25 (విధాత):

BRS MLC Kavitha | మొన్నటిదాకా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం తనదేనని ఎమ్మెల్సీ కవిత అజమాయిషీ చెలాయించారు. కానీ.. బీఆరెస్‌లో రాజుకున్న కుటుంబ రాజకీయాల కుంపటితో ఆమెను పార్టీ అధినాయకత్వం ఆ బాధ్యతల నుంచి తప్పించి.. కొప్పుల ఈశ్వర్‌కు అప్పగించింది. అప్పటికే పార్టీ తన విషయంలో వ్యవహరిస్తున్న వైఖరితో తీవ్ర మస్తాపానికి గురైన కవితకు.. తాజా పరిణామం అవమానకరంగా పరిణమించింది. దీంతో సింగరేణిలో ఏదో ఒకటి చేసి తన ఉనికి చాటుకునే ప్రయత్నాల్లో ఉన్నారని తెలుస్తున్నది. ఈ క్రమంలోనే హిందూస్థాన్‌ మజ్దూర్‌ సంఘ్‌ను ఆమె ఎంచుకున్నట్టు సమాచారం. ఆగస్టు నెలాఖరులో హెచ్‌ఎంఎస్‌ మహాసభలు జరుగనున్నాయి. వీటిలో కవితను సంఘం గౌరవాధ్యక్షురాలిగా ఎన్నుకొనే అవకాశం ఉందని తెలుస్తున్నది. ఇదే సంఘానికి ఉన్న అనుబంధ యూనియన్‌తో మళ్లీ సింగరేణిలో అడుగుపెట్టాలనే యోచనలో ఉన్నట్టు సమాచారం.

హెచ్ఎంఎస్‌తో కలిసి కవిత ప్రయాణం

ఈ నెల 10న హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్‌తోపాటు ఇతర ముఖ్య నాయకులు హైదరాబాద్‌లో కవితతో సమావేశమయ్యారు. సింగరేణి కార్మికుల సమస్యలపై చర్చించారు. హెచ్ఎంఎస్ కు అనుబంధంగా సింగరేణి మైనర్స్ అండ్ ఇంజినీరింగ్ వర్కర్స్ యూనియన్ ఉంది. అయితే.. కార్మికుల్లో దీనిపై పెద్దగా గురి లేదు. అయినప్పటికీ.. ఈ సంస్థ, తెలంగాణ జాగృతి సంయుక్తంగా కార్యక్రమాలు నిర్వహించనున్నాయని తెలుస్తున్నది. ఈ నెల 30, 31 తేదీల్లో శ్రీరాంపూర్‌లో హెచ్ఎంఎస్ 42 మహాసభలు జరగనున్నాయి. ఈ సభల్లో హెచ్ఎంఎస్ గౌరవ అధ్యక్షురాలిగా కవితను ఎన్నుకుంటారని తెలుస్తున్నది. సింగరేణిలో వామపక్ష యూనియన్‌లు ఇప్పటికే బలంగా ఉన్నాయి. వాటితో కలిసి కవిత భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని సమాచారం.

Exit mobile version