- ఆ శాఖ నిర్వహిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డికీ పూర్తి స్థాయిలో చిక్కని పట్టు!
- ఎక్కడికక్కడ పేరుకుపోయిన సమస్యలు
- మొన్నటిదాకా గురుకులాల్లో మరణాలు
- తాజాగా ఫీజ్ రీయింబర్స్‌మెంట్ బకాయిలు
- రూ.8,000 కోట్లకు పేరుకుపోయిన చెల్లింపులు
- స్కాలర్ షిప్ చెల్లింపులూ పెండింగ్‌లో
- సకాలంలో జరుగని అడ్మిషన్ల ప్రక్రియ
- పరేషాన్ అవుతున్న తెలంగాణ స్టూడెంట్స్
Education Department | సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్న విద్యాశాఖ అనేక సమస్యలతో సతమతమవుతున్నది. ప్రత్యేక మంత్రి లేకపోవడంతోపాటు ఆ శాఖపై సీఎంకూ పూర్తి స్థాయి పట్టు చిక్కకపోవడం కూడా విద్యాశాఖలో సమస్యలు పేరుకుపోవడానికి కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి. గురుకులాల్లో సమస్యలు, విద్యార్థుల వరుస చావులతో విమర్శల పాలైన విద్యాశాఖ.. మళ్లీ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలతో విమర్శలు ఎదుర్కొంటున్నది. అయితే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం గత ప్రభుత్వంలో విద్యాశాఖ పనితీరును, తమ ప్రభుత్వ విద్యాశాఖ పనితీరును బేరీజు వేసుకుని చూడాలంటున్నారు. ఏదైనా పరీక్షలు నిర్వహించకుండా వదిలేసినమా? టెన్త్ క్లాస్, ఇంటర్మీడియట్, ఇంజినీరింగ్ పరీక్షలు నిర్వహించలేదా? పరీక్షల ఫలితాలు విడుదల చేయలేదా? గతంలో జరిగినట్టుగా ఏమైనా లోపాలు జరిగాయా?’ అని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు మంత్రివర్గ విస్తరణ చేసినా.. విద్యాశాఖ తన వద్దనే ఉంటుందని కూడా తేల్చేశారు. విద్యాశాఖలో నియామకాలు, బదిలీల సంగతి కొంత మెరుగ్గా ఉన్నా.. విద్యార్థులకు సంబంధించి ఫీజు రీఎంబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల బకాయిలు, ఫీజుల పెంపు సమస్యలు, పరీక్షల నిర్వహణ.. ఫలితాల వెల్లడి..అడ్మిషన్ల ప్రక్రయ సకాలంలో జరుగడం లేదన్న విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి.
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై రచ్చ
రాష్ట్రంలో ఇంటర్, ఇంజినీరింగ్, మెడిసిన్, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ, డిగ్రీ తదితర కోర్సులు చదువుతున్న 15లక్షల మంది విద్యార్థులు ప్రధానంగా స్కాలర్‌షిప్ బకాయిలు, ఫీజు రీఎంబర్స్‌మెంట్ సమస్యలతో సతమతవుతున్నారు. రాష్ట్రంలో దాదాపు రూ.8,000 కోట్లకు పెరిగిపోయిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణం చెల్లించాలంటూ గురువారం సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. కోర్సులు పూర్తి చేసిన విద్యార్ధులు సర్టిఫికెట్లు తీసుకోలేక.. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోలేక.. ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాలు పొందటానికి ఇబ్బంది పడుతున్నారు. సర్టిఫికెట్లు, ఫీజుల కోసం కళాశాల యజమాన్యాలకు విద్యార్థులకు మధ్య వివాదాలు సాగుతున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించని కారణంగా తెలంగాణలోని ఐదు యూనివర్సిటీల (పాలమూరు యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, మహాత్మా యూనివర్సిటీ ) పరిధిలోని దాదాపు 6 లక్షల మంది డిగ్రీ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకుండా తాత్సారం చేస్తున్నారు. దీంతో వారి విద్యాసంవత్సరం ప్రమాదంలో పడే పరిస్థితి నెలకొంది. ప్రైవేటు డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యాల సంఘం గత 40 రోజులుగా సమ్మె కొనసాగించి సీఎం రేవంత్ రెడ్డి హామీతో విరమించినప్పటికి బకాయిలు మాత్రం విడుదలకాలేదు. దీంతో పరీక్షల నిర్వహణ ప్రశ్నార్థకమవుతున్నది. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలతో సంక్షోభంలో చిక్కుకున్న ప్రైవేటు కాలేజీలు, అధ్యాపకులకు వేతనాలు చెల్లించలేని పరిస్థితుల్లో మూతపడే దుస్థితికి చేరాయి.
భయపెడుతున్న ఫీజుల పెంపు ప్రతిపానలు!
గత విద్యాసంవత్సరంలో ఇంజినీరింగ్ కళాశాలలు కంప్యూటర్ సైన్స్ కోర్సుల సీట్లను అడ్డగోలుగా పెంచుకునే విధానంపై యాజమాన్యాల వైఖరిని ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టు వరకు పోరాడి రేవంత్ ప్రభుత్వం బ్రేక్ వేయగలిగింది. కానీ.. ఇంజినీరింగ్ ఫీజుల పెంపు ప్రతిపాదనలపై నిర్ణయం మరో సవాల్ విసిరింది. మూడేళ్లకోసారి ఫీజులు పెంచాల్సిన నేపథ్యంలో ఇప్పటికే కాలేజీలు సమర్పించిన ఆడిటర్ నివేదికల ఆధారంగా ఫీజు నియంత్రణ కమిటీ(ఎఫ్‌ఆర్‌సీ) ఫీజుల పెంపు ప్రతిపాదనలను ఉన్నత విద్యాశాఖకు సమర్పించింది. ప్రస్తుతం ఉన్న రూ.1.5 లక్షల ఫీజును రూ.2.5 లక్షలకు పెంచాలని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనల వెనుక ఆడిటర్లకు, కళాశాలల యజమాన్యాలకు మధ్య కుమ్మక్కు వ్యవహారం ఉందని అనుమానించిన ప్రభుత్వం ఫీజుల పెంపు ప్రతిపాదనలపై నిర్ణయాన్ని వాయిదా వేసింది. ఎఫ్ఆర్సీ ఫీజుల పెంపు కు అమోదం తెలిపితే మూడేళ్ల తర్వాత ఏడాదికే రూ. 5లక్షలు ఫీజు కానుంది. ఈ నేపథ్యంలో 30శాతం పెంపుకు మించకుండా ప్రతిపాదనలతో రావాలని ప్రభుత్వం సూచించినట్లుగా తెలుస్తుంది. ఇంజనీరింగ్ కళాశాలల భారీ ఫీజుల దోపిడీ వ్యవహారానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కళ్లెం వేయాల్సిందేనంటున్నారు తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు.
తేలని కాంట్రాక్టు అధ్యాపకుల సమస్య..ఆగిన అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీ
రాష్ట్రంలోని 12 యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి ఇటీవల ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఇక నోటిఫికేషన్ తరువాయి అనుకున్న దశలో కాంట్రాక్టు అధ్యాపకుల ఆందోళన తెరపైకి వచ్చింది. దీంతో కొత్త నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా 1,588 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు మంజూరుకాగా, అందులో 1,121 ఖాళీగా ఉన్నాయి. వాటిని కొత్త నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాల్సి ఉన్నది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టు అధ్యాపకులకు ఇచ్చిన హామీని నెరవేర్చితే కొత్త నోటిఫికేషన్‌లో 402 పోస్టులు మాత్రమే మిగులుతాయి. వాటినే క్లియర్ వెకెన్సీగా చూపిస్తారు. రాష్ట్రంలో ప్రస్తుతం 869 మంది కాంట్రాక్టు అధ్యాపకులు పనిచేస్తున్నట్లుగా సమాచారం. వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. రాష్ట్రంలోని ఉన్నత విద్యాశాఖ పరిధిలో మహిళా వర్సిటీ సహా 12 విశ్వవిద్యాలయాల పరిధిలో ఆచార్యులు, సహ ఆచార్యులు, సహాయ ఆచార్యులు కలిపి మొత్తం 2,817 మంజూరు పోస్టులుండగా..అందులో 2,125 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిలో సహాయ ఆచార్యుల పోస్టులు 1,524. ప్రస్తుతం 463 మంది పనిచేస్తున్నారు. మిగిలిన 1,061 పోస్టులు ఖాళీ. ఇప్పటికైతే అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి మాత్రమే ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మరోవైపు ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీచేసే వీలున్న అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్ల పోస్టులు ఎందుకు భర్తీ చేయడం లేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
పాఠశాలలు తెరిచేలోగా పాఠ్యపుస్తకాలు..యూనిఫాంలు అందేనా..?
విద్యాసంవత్సరం ప్రారంభమై పాఠశాలలు తిరిగి తెరిచేలోగా లక్ష లాది మంది విద్యార్థులకు కావాల్సిన పాఠ్యపుస్తకాలు..యూనిఫాంలు అందేనా లేదా అన్నది కూడా ప్రధాన సమస్యగా మారింది. దీనిపై ప్రభుత్వ కసరత్తు ఎంతవరకు వచ్చిందన్నదానిపై స్పష్టత కరువైంది. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్ స్కూళ్లు, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీల నిర్మాణాలపై పెడుతున్న శ్రద్ద ప్రభుత్వ పాఠశాలల నిర్వాహణ, మౌలిక వసతుల కల్పన, సమస్యలపై కూడా చూపాలన్న డిమాండ్ వినిపిస్తుంది. ఫీజుల నియంత్రణ సహా విద్యారంగం సంస్కరణలకు సంబంధించి విద్యా కమిషన్ ఇచ్చిన సూచనలు రానున్న విద్యాసంవత్సరంలో ఎంతమేరకు అమలవుతాయన్నది సీఎం రేవంత్ రెడ్డి చొరవపైనే ఆధారపడి ఉంది.
ఇవి కూడా చదవండి..
South West Monsoon | మే 20 తర్వాత ఎండల నుంచి ఉపశమనం..!
Kalvakuntla Family | కల్వకుంట్ల ఫ్యామిలీ చలో అమెరికా! ఏంటీ విషయం?
Brain ‘Stent’ | బ్రెయిన్ ద్వారా ఐఫోన్‌ను కంట్రోల్ చేసే ప్రయత్నాల్లో యాపిల్!
ktr, harish: హరీశ్.. కేటీఆర్ భేటీ.. ఏం చర్చించారు?.. రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ
Solar Storm | 14వేల ఏళ్ల నాటి స్థాయిలో సౌర తుఫాను మళ్లీ వస్తుందా? శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు?