AP Elections | భారీగా పొలిటికల్ బెట్టింగ్‌లు.. ఎక్కడ చూసినా కాయ్ రాజా కాయ్

బెట్టింగ్‌లకు పెట్టింది పేరుగా మారిన ఐపీఎల్ క్రికెట్ పోటీలు ఒక వైపు ఆందోళనకరంగా మారగా తాజాగా దీనికి పార్లమెంటు ఎన్నికలు తోడై పరిస్థితిని విపరీతంగా మార్చివేశాయి.

  • Publish Date - May 16, 2024 / 10:07 AM IST

కోట్లకు పెరిగిన బెట్టింగ్‌ దందా
తెరలేపిన పార్లమెంటు ఎన్నికలు
తెలంగాణలో మెజార్టీపై లెక్కలు
పోటాపోటీ స్థానాలపై కేంద్రీకరణ
ఆంధ్రప్రదేశ్‌లో అధికారంపై పోటీ
మళ్ళీ జగనా? తిరిగి చంద్రాబాబా?
కేంద్రంలో అధికారంపై పందేలు
పవన్ కల్యాణ్ గెలుపుపైనా పందేలు
ఐపీఎల్ క్రికెట్‌తో బెట్టింగ్ అనుభవం
పోలీసులు, నిఘా వర్గాల ప్రేక్షపాత్ర!

విధాత ప్రత్యేక ప్రతినిధి: బెట్టింగ్‌లకు పెట్టింది పేరుగా మారిన ఐపీఎల్ క్రికెట్ పోటీలు ఒక వైపు ఆందోళనకరంగా మారగా తాజాగా దీనికి పార్లమెంటు ఎన్నికలు తోడై పరిస్థితిని విపరీతంగా మార్చివేశాయి. పొలిటికల్ బెట్టింగ్‌ బృందాలు ఈ నిప్పుల వాతావరణానికి కొంత ఉప్పేసి ఎగదోయడంతో ఎక్కడ చూసినా ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడుతారు? కేంద్రంలో ఈసారి అధికారంలోకి ఏ పార్టీ వస్తుంది? ఏ పార్లమెంటు సెగ్మెంటులో ఏ పార్టీ గెలుస్తుంది? అనే అంశాలు ప్రాతిపదికన ఎక్కడికక్కడ బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారని తెలుస్తున్నది. పేద, మధ్య తరగతి వర్గాలు ఈ బెట్టింగ్‌ ఉచ్చుకు చిక్కుకుని విలవిలాడుతున్నారని అంటున్నారు. పకడ్బందీగా మూడో కంటికి తెలువకుండా ఈ ముఠాల కార్యకలాపాలు సాగిపోతున్నాయని చర్చలు జరుగుతున్నాయి.

కేంద్రం, ఏపీ అధికారంపై బెట్టింగ్‌

పార్లమెంటు ఎన్నికల్లో ఎవరు మెజార్టీ సాధిస్తారనే అంశం చర్చకు దారితీయడంతో పాటు బెట్టింగ్‌ రాయుళ్ళకు వనరుగా మారింది. కేంద్రంలో ఈసారి బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తుందా? ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందా? అనే పందెంతో పాటు రాహూల్ ప్రధాని అయితారా? లేదా? అనేది ఒక అంశంగా అంశంగా మారిందని చెబుతున్నారు.

పదేండ్లు కేంద్రంలో పేరుకు ఎన్టీఏ సర్కారు అధికారంలో ఉన్నప్పటికీ బీజేపీదే పెత్తనం అనేది తెలిసిందే. మూడో బీజేపీ అధికారంలోకి వస్తుందా? ప్రధాని మోదీ ప్రభావం పనిచేస్తుందా? లేదా? అనే విషయంపై పందేలు సాగుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ లో జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తారా? ఈ సారి చంద్రబాబు అధికారంలోకి వస్తారా? అనేది జోరుగా చర్చ జరుగుతున్నది. ఏపీతో పాటు తెలంగాణలో కూడా ఈ అంశానికి ప్రాధాన్యం లభిస్తున్నదని అంటున్నారు. హైదరాబాద్‌లో పెద్ద సంఖ్యలో ఏపీ జనం ఉండటం, తెలంగాణలో కూడా ఏపీ రాజకీయాలపై ఆసక్తి ఉన్నందున పెద్ద ఎత్తున పందేలు సాగుతున్నాయని తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న నటుడు పవన్ కల్యాన్ ఈసారైనా గెలుస్తారా? అనేదీ కీలకంగా ఉన్నది. పార్లమెంటు ఎన్నికలకు తోడు తెలంగాణలో ఇటీవలనే అధికారం మారినందున ఏ పార్టీకి మెజార్టీ స్థానాలొస్తాయనే అంశంపై బెట్టింగ్‌లు నడుస్తున్నట్టు చెబుతున్నారు. అదే సమయంలో వరంగల్, చేవెళ్ళ, మెదక్, మల్కాజిగిరి నియోజకవర్గాల్లో విజేతలపైనా పందేలు కడుతున్నట్టు సమాచారం.

కోట్లకు చేరిన బెట్టింగ్‌

వందల నుంచి వేల స్థాయిలో బెట్టింగ్‌ పెరిగి కోట్ల రూపాయల దందా సాగుతోందనే చర్చలు వినిపిస్తున్నాయి. సాధారణ కార్యకర్త స్థాయి నుంచి నాయకుల వరకు ఈ బెట్టింగ్‌లలో ఉంటున్నారు. చిన్నచితక వ్యక్తులతోపాటు వివిధ సంస్థల్లో ఉద్యోగుల మధ్య, స్నేహితుల మధ్య స్నేహపూర్వక బెట్టింగ్‌లు జరుగుతుండగా ఆరితేరిన ముఠాలు మాత్రం ప్రణాళికబద్ధంగా తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారని సమాచారం. ఈ వ్యవహారంలో సామాన్యులు, మధ్యతరగతి వర్గాలు నష్టపోతున్న ఘటనలే ఎక్కువగా ఉంటున్నాయని చెబుతున్నారు. జూన్ 4వ తేదీ అంటే చాలా సమయం ఉన్నందున, పరిస్థితులు కూడా అనుకూలంగా ఉన్నందున ఈ బెట్టింగ్‌ వ్యవహారం మూడు పువ్వులు, ఆరుకాయలు అన్నట్లుగా సాగిపోతోందీ.

పోలీసుల ప్రేక్షకపాత్ర, పని ఒత్తిడి

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో గుట్టుచప్పుడు కాకుండా నాలుగు గోడల మధ్య, నిర్జన ప్రదేశాల్లో శిబిరాలు ఏర్పాటుచేసిన సాగిస్తున్న ఈ తతంగం పోలీసులకు కూడా సవాలుగా తయారైంది. పలు చోట్ల పోలీసులు ప్రేక్షక పాత్రకే పరిమితమవ్వాల్సి వస్తున్నది. మరికొన్ని చోట్ల అధికారులు మామూళ్ళకు అలవాటు పడి ఈ దందాకు పరోక్షంగా మద్దతు ఇస్తున్నారన్న చర్చ నడుస్తున్నది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు, తాజాగా పార్లమెంటు ఎన్నికల నేపథ్యంతోపాటు నిత్యం లా అండ్ అర్డర్ పనులతో పని ఒత్తిడి కారణంగా కూడా కొన్ని ప్రాంతాల్లో బెట్టింగ్‌ సమాచారం తెలిసినప్పటీకీ పోలీసులు తగిన చర్యలు చేపట్టలేక పోతున్నారని అంటున్నారు. చాలీచాలనీ సిబ్బంది, పని ఒత్తిడితో పట్టించుకోలేక పోతున్నామని కొందరు సిన్సియర్ పోలీసు ఆఫీసర్లు ఆవేదన వ్యక్తం చేస్తుండగా ఇదొక ఆదాయ వనరుగా భావించే వాళ్ళు మామూళ్ళ మత్తులో జోగుతున్నారు.

Latest News