Site icon vidhaatha

Konathala Ramakrishna | లోక్‌స‌భ ఎన్నిక‌ల చ‌రిత్ర‌లోనే 9 ఓట్ల మెజార్టీతో గెలిచిన కొణ‌తాల రామకృష్ణ.. ఎప్పుడంటే..?

Konathala Ramakrishna | హైద‌రాబాద్ : ఎన్నిక ఏదైనా స‌రే.. గెలుపు అనేది ముఖ్యం. ఎన్ని ఓట్లు పోల‌య్యాయి.. ఎంత మెజార్టీ వ‌చ్చింది అనేది ప్రాధాన్యం కాదు. ఒక్క ఓటుతో గెలిచినా అది గెలుపే. లోక్‌స‌భ ఎన్నిక‌ల చ‌రిత్ర‌లోనే అత్యంత త‌క్కువ మెజార్టీతో గెలిచిన నాయ‌కులు ఉన్నారు. ఒక అంకె, రెండంకెల మెజార్టీతో గెలిచి, పార్ల‌మెంట్‌లో అడుగుపెట్టిన వారు ఉన్నారు.

1989లో జ‌రిగిన లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో 9 ఓట్ల మెజార్టీతో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన కొణ‌తాల రామ‌కృష్ణ గెలుపొందారు. అన‌కాప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం నుంచి కాంగ్రెస్ త‌ర‌పున పోటీ చేసి విజ‌యం సాధించారు. లోక్‌స‌భ ఎన్నిక‌ల చ‌రిత్ర‌లోనే ఇది అత్యంత త‌క్కువ మెజార్టీ. నాటి ఎన్నిక‌ల్లో కొణ‌తాల రామ‌కృష్ణ‌కు 2,99,109 ఓట్లు పోల‌వ్వ‌గా, టీడీపీ అభ్య‌ర్థి పెత‌కంశెట్టి అప్ప‌ల న‌ర‌సింహంకు 2,99,100 ఓట్లు వ‌చ్చాయి.

ఇక 1998లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో బీహార్‌కు చెందిన సోమ్ మారాండీ కూడా 9 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. సోమ్ మారాండీ రాజ్‌మ‌హ‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బీజేపీ త‌ర‌పున విజ‌యం సాధించారు. 1996లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో గైక్వాడ్ స‌త్య‌జిత్ సిన్హా బ‌రోడా నియోజ‌క‌వ‌ర్గం నుంచి 17 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈయ‌న కాంగ్రెస్ త‌ర‌పున పోటీ చేశారు.

రెండు దశాబ్దాలపాటు ఉమ్మడి విశాఖ జిల్లా రాజకీయాలు శాసించిన నాయకుడు కొణ‌తాల రామ‌కృష్ణ‌. ఆయన వైయస్సార్ మరణం తర్వాత వైఎస్సార్‌సీపీలో చేరారు. కానీ అక్కడి రాజకీయాలతో విసుగు చెందిన ఆయన 2019 ఎన్నికల ముందు టీడీపీకి మద్దతు ప్రకటించారు. 2024, జ‌న‌వ‌రి 25వ తేదీన‌ జనసేన పార్టీలో చేరారు. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అనకాపల్లి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు కొణ‌తాల‌.

Exit mobile version