హైదరాబాద్, విధాత ప్రతినిధి:
Jubilee Hills by-election | జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం ముగింపు దశకు వచ్చింది. నాలుగైదు రోజులుగా సర్వేలు అన్నీ బీఆర్ఎస్ గెలుస్తాయంటూ చెబుతున్నాయి. సర్వే సంస్థలపై ఆగ్రహమో.. సర్వేసంస్థల ఫలితాలపై ఆగ్రహమోగానీ.. కాంగ్రెస్ పార్టీ నాయకులు సహనం కోల్పోయి విమర్శలు గుప్పిస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకటి రెండు సంస్థలు మినహా పలు సర్వే సంస్థలు బీఆర్ఎస్ అభ్యర్థికే మొగ్గు చూపుతున్నాయి. ఆమె విజయం ఖాయమనే విధంగా లెక్కలతో సహా వివరిస్తున్నాయి. సర్వేలన్నీ నిజం అవుతాయా అంటే అవుననీ చెప్పలేము. గతంలో కూడా సర్వేలు బొక్క బోర్లా పడ్డాయి. మరోవైపు కాంగ్రెస్ నాయకులు.. బీఆరెస్ చేస్తున్న సర్వేలన్నీ డబ్బు పెట్టి చేయించుకున్నవేనని ఆరోపిస్తున్నారు. అదే సమయంలో తీవ్ర అసహనం ప్రదర్శిస్తున్నారు. కాంగ్రెస్ చేస్తున్న తీవ్రస్థాయి విమర్శలను ప్రజలు స్వీకరిస్తారా లేదా నిశబ్ధంగా తమ ఓటుతో తీర్పునిస్తారా? అనేది ఫలితాల నాడే తేలనున్నది.
హీటెక్కిన ప్రచారంలో హాట్ హాట్ విమర్శలు
విజయబావుటా ఎగుర వేసేందుకు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ వారం రోజుల నుంచి ప్రచారాన్ని హీటెక్కించాయి. కాంగ్రెస్ తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, ముఖ్య నాయకులు ప్రజల ముందుకు వస్తున్నారు. కార్నర్ మీటింగ్స్, రోడ్డు షో ల ద్వారా రేవంత్ రెడ్డి తన ప్రచారాన్ని కొనసాగిస్తుండగా, మంత్రులు, ఎమ్మెల్యేలు గల్లీ గల్లీ తిరుగుతున్నారు. కులాల వారీగా సమావేశాలు నిర్వహించి మద్ధతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కాని హద్దులు దాటి చేస్తున్న విమర్శలు కాంగ్రెస్ అభ్యర్థికి మేలు చేస్తాయా, కీడు చేస్తాయా? అనే సందేహాలను విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక విష పురుగు అని, తెలంగాణకు డ్రగ్స్, గంజాయి తీసుకువచ్చారని రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. నగరంలో జరిగే హత్యాచారాలకు అవే కారణమని, అందుకే ఈగిల్ వ్యవస్థను తీసుకువచ్చి దాడులు నిర్వహిస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వీ నవీన్ యాదవ్ ను పదే పదే రౌడీ అని ప్రచారం చేస్తున్న కేటీఆర్, దీపావళి పండుగ రోజు డ్రగ్స్ వాడిన వాళ్లే రౌడీలు అవుతారని రేవంత్ అన్నారు. వాళ్లు సినిమా హీరోయిన్లతో ఎలా గడిపారో అందరికీ తెలుసంటూ హద్దు దాటేశారు. బీఆర్ఎస్‌ను దక్కించుకునేందుకు మాజీ మంత్రి హరీశ్ రావు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. సొంత చెల్లెలు కవితకు ఆస్తిలో వాటాలు ఇవ్వాల్సి వస్తుందని బయటకు పంపిన కసాయి కాదా? అని ప్రశ్నించారు. చెల్లెలిని బయటకు పంపేసిన నీచుడు కేటీఆర్ అని మండిపడిన రేవంత్‌రెడ్డి.. మీ సొంత అన్న ఇలాగే చేస్తే ఊరుకుంటారా అని ఓటర్లను అడిగారు. నగరంలో ప్రతి గల్లీలో చెత్త కుప్పలు ఉన్నాయంటున్న కేటీఆర్ విమర్శలకు కౌంటర్ ఇచ్చే క్రమంలో నోటిదురుసును ప్రదర్శించిన రేవంత్.. ‘ఆ చెత్త నా కొ..కే కదా పదేళ్లు మునిసిపల్ మంత్రిగా పనిచేశాడు. జూబ్లీహిల్స్ లో చెత్త కుప్పలు, డ్రైనేజీ సమస్య, ప్రజల రోగాలకు ఆయనే కారణం’ అంటూ దుమ్మెత్తారు.
పొన్నం వ్యాఖ్యలతో దుమారం
వారం రోజుల క్రితం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ప్రజల నుంచి సానుభూతి ఓట్లు పొందేందుకు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత దొంగ ఏడుపులు ఏడుస్తుందంటూ వ్యాఖ్యానించడం ఒక వితంతువు కన్నీటిని చిన్నచూపు చూడటమేననే ఆగ్రహాలు వ్యక్తమయ్యాయి. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఘాటుగానే విమర్శలు చేస్తున్నారు. దివంగత మాగంటి గోపీనాథ్ విషయంలో కేటీఆర్ విలన్ అని సాక్షాత్తూ గోపీనాథ్ తల్లిగారే ప్రకటించారని అన్నారు. గోపీనాథ్ మృతి ఓ మిస్టరీ అని ఆమె చెప్పడం చూస్తే కేసీఆర్ కుటుంబ వైఖరి అందరికీ అర్దమవుతుందన్నారు. గతంలో వేలాది మంది తెలంగాణ యువతను ఉద్యమానికి ఆహుతిచ్చిన కేసీఆర్ తర్వాతి కాలంలో ఎందరో ఉద్యమ నాయకులను పాతాళానికి తొక్కేశారని అన్నారు. తెలంగాణ ప్రజలకు చెందిన వేల కోట్లను కొల్లగొట్టిన కేసీఆర్ కుటుంబం ఇప్పుడు జూబ్లీహిల్స్‌లో మాగంటి సునీత సెంటిమెంట్‌ను ప్రజలపై ప్రయోగించి పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
కన్నీటిపర్యంతమవుతున్న సునీత
ఇక తన వ్యక్తిత్వంపై జరుగుతున్న దాడిని సునీత స్వయంగా ఖండించుకోవాల్సి వచ్చింది. పోలింగ్ కు సరిగ్గా ఐదారు రోజుల ముందు వివాదం సృష్టించి తమను ఇబ్బంది పెట్టేందుకు, ప్రత్యర్థి పార్టీలతో చేతులు కలిపి కుట్రలు చేస్తున్నారని మాగంటి సునీత ఆవేదన చెందుతున్నారు. 25 ఏళ్ల క్రితం మా అమ్మను గోపీనాథ్ పెళ్ళి చేసుకున్నారంటూ, ఆధారాలతో శేరిలింగంపల్లి తహశీల్దార్ కార్యాలయానికి గోపీనాథ్ కుమార్తె దిశిర.. వెళ్లడం, 25 ఏళ్ల తర్వాత గోపీనాథ్ మొదటి భార్యను తానే అంటూ హక్కుల కోసం తహశీల్దార్ కార్యాలయానికి కొసరాజు మాలిని దేవి, కుమారుడు ప్రద్యుమ్న తారక్, తల్లి మాగంటి మహానంద దేవీ ఇలా.. వీరందరినీ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెరమీదికి తెచ్చారని, ప్రతి ఎన్నికల ముందు ఇలాంటివి చేస్తుంటారని సునీత కన్నీళ్ల పర్యంతమవుతున్నారు. మొత్తంగా కాంగ్రెస్ నాయకులు చేస్తున్న తీవ్ర స్థాయి విమర్శలు ప్రజల్లోకి వెళతాయా? వాటిని ప్రజలు స్వీకరిస్తారా? లేక అవి కాంగ్రెస్‌కు బూమరాంగ్ అవుతాయా? అనేది తెలియాలంటే ఫలితాల దాకా వేచి చూడాల్సిందే.
Read Also |
Bandi Sanjay : గోపీనాథ్ ఆస్తుల కోసమే కేటీఆర్, రేవంత్ మధ్య గొడవలు
జూబ్లీహిల్ ఎన్నికల వేళ తెరపైకి మాగంటి మాలినీ దేవి..విచారణకు హాజరు
జూబ్లీహిల్స్‌లో మోదీ కేసీఆర్ ఓ వైపు రాహుల్ రేవంత్ మరోవైపు: సీఎం రేవంత్
