Jubilee Hills Bypoll | ఎంఐఎం మద్ధతుతోనే కాంగ్రెస్ గెలుపు? రెండు పార్టీల వ్యయం రూ.110 కోట్లు?

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక పోలింగ్‌ ముందు రోజు అనేక బస్తీల్లో యథేచ్ఛగా నగదు పంపిణీ కొనసాగిందనే చర్చ నగరంలో సాగుతున్నది. దాదాపు 110 కోట్ల వరకూ రెండు పార్టీలు వెచ్చించాయని అనుకుంటున్నారు.

హైదరాబాద్, విధాత ప్రతినిధి:

Jubilee Hills Bypoll | జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక పోలింగ్ తంతు పూర్తయింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ నువ్వా నేనా అనేలా పోటీ పడ్డాయి. రెండు పార్టీల అభ్యర్థులు ఏమాత్రం వెరవకుండా ప్రలోభాలకు తెర తీశారన్న ఆరోపణలు గుప్పుమన్నాయి. కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించడంలో ఎంఐఎం పార్టీ నాయకులు శ్రమించారనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తున్నది. ముస్లింల ఓట్లు కాంగ్రెస్ అభ్యర్థికి వేసేలా చూడాలని, ఏ బస్తీలో అయినా ఓటింగ్ తగ్గితే సంబంధిత నాయకుడిపై చర్యలుంటాయని ఆ పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ గట్టిగా హెచ్చరించారని తెలుస్తున్నది. అసదుద్దీన్ ఒవైసీ ఆదేశాల మేరకు నాయకులు గల్లీ గల్లీ తిరిగి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికే ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. ముస్లింలలో మెజారిటీ ఓటర్లు కాంగ్రెస్ అభ్యర్థి చెయ్యి గుర్తుకే మీట నొక్కారని తెలుస్తున్నది.

TPCC Chief Mahesh Kumar Goud : ప్రభుత్వానికి ఢోకా లేదు

భారీగా ప్రలోభాలు?

నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 4,01,365మంది ఓటర్లు ఉండగా 407 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. మంగళవారం నాటి ఓటింగ్ సరళిని గమనిస్తే ఉదయం పూట మందకొడిగా సాగగా, మధ్యాహ్నం మూడు గంటల వరకు 40 శాతానికి చేరుకున్నది. సాయంత్రం 6 గంటల వరకు 48.47 శాతం నమోదు అయ్యింది. ఈ నియోజకవర్గంలో 2014 సంవత్సరంలో 50.18 శాతం నమోదు కాగా ఆ తరువాత 2018 లో 45.59, 2023లో 47.58 నమోదు అయినట్లు లెక్కలు చెబుతున్నాయి. గతంతో పోల్చితే ఈ ఉప ఎన్నికల్లో 0.89 శాతం ఓటింగ్ పెరిగింది. పెరిగిన ఓటింగ్ కాంగ్రెస్ పార్టీకే కలిసి వస్తుందని నాయకులు గట్టి ధీమాతో ఉన్నారు. బస్తీ ప్రజలు బారులు కట్టగా, కాలనీలు, అపార్ట్ మెంట్ వాసులు పోలింగ్ కేంద్రాలకు వెళ్లేందుకు పెద్దగా ఆసక్తి చూపించలేదు. శ్రీనగర్ కాలనీ, మధురానగర్, శాలివాహన్ నగర్ కాలనీల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలింగ్ కేంద్రాలు ఖాళీగా కన్పించాయి. బస్తీలు, మురికివాడల్లో ఓటర్లకు వంద శాతం నగదు పంపిణీ చేయగా కాలనీల్లో అక్కడక్కడా ఇచ్చారని చర్చించుకుంటున్నారు. రెండు ప్రధాన పార్టీల అభ్యర్థుల ఏమాత్రం తగ్గకుండా స్వయం సహాయక సంఘాలు, గ్రూపు లీడర్లు, బస్తీ నాయకులకు చేరేలా చేశారని చర్చించుకుంటున్నారు. ఒక ప్రధాన పార్టీ ఓటుకు రూ.2500 తో పాటు గ్రూపు లీడర్ కు ప్రత్యేకంగా రూ.5వేల చొప్పున పంపిణీ చేసినట్టు తెలుస్తున్నది. మరో పార్టీ కూడా ఓటుకు రూ.2వేల చొప్పున బస్తీ లీడర్లకు ఇవ్వగా, ఆ మొత్తాన్ని ఓటర్లకు చేరలేదంటున్నారు. ఇందులో రూ.500 నుంచి రూ.1వేయి వరకు జేబులో వేసుకున్నట్లు ఫిర్యాదులు అందాయి. పోలీసుల నిఘా, ఎన్నికల కమిషన్ నిరంతర పర్యవేక్షణ కారణంగా బీఆర్ఎస్ పంపిణీలో వెనకబడిందంటున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ ముందే ఏర్పాట్లు చేసుకోవడంలో విఫలమయ్యారని అంటున్నారు. రెండు ప్రధాన పార్టీల పంపిణీ మొత్తం సుమారు రూ.110 కోట్ల వరకు ఉంటుందని నియోజకవర్గంలో నాయకులు చర్చించుకుంటున్నారు. ఇవి కాకుండా పట్టు చీరలు, కుక్కర్లు, మిక్సీలు కూడా అక్కడక్కడా పంపిణీ చేశారని సమాచారం. సమీప దుకాణాల స్లిప్పులను అందచేయడంతో వారి వద్దకు వెళ్లి ఓటర్లు తమకు నచ్చిన కుక్కర్ లేదా మిక్సీ, కుర్చీలను తీసుకువెళ్లారని తెలుస్తున్నది. ఓటింగ్ కు ముందు బస్తీ ఓటర్లకు మద్యం బాటిల్ తో పాటు చికెన్, మటన్ ప్యాకెట్లను అందచేశారనే ఆరోపణలూ వినిపించాయి. ఎన్నికల పుణ్యమా అని బస్తీలలో డబ్బులు, మద్యం ప్రవాహం ఏరులై పారిందంటున్నారు.

Cholesterol Reducing Foods : ఇలా చేస్తే మీ శరీరంనుంచి కొవ్వు పారిపోతుంది

నవీన్‌ గెలుపు బాధ్యత భుజాన వేసుకున్న ఎంఐఎం!

అసుదుద్దీన్ ఒవైసీ ఆదేశం మేరకు ఎంఐఎం పార్టీ నాయకులు పోలింగ్ నాడు ముస్లిం ఓటర్లు ఉండే బస్తీలు, కాలనీలను కలియతిరిగారు. ఓటు వేశారా లేదా అని గడపగడప తిరిగి ఆరా తీశారు. కాంగ్రెస్ పార్టీ పోలింగ్ ఏజెంట్ల ద్వారా ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుని, వేయని వారి ఇళ్లకు వెళ్లి పురమాయించారు. వందశాతం పోలింగ్ కు వెళ్లేలా ఆ పార్టీ నాయకులు ఉదయం నుంచి సాయంత్రం వరకు అప్రమత్తంగా వ్యవహరించారు. కార్వాన్ ఎంఐఎం ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ నిరంతరం బస్తీ నాయకులతో టచ్ లో ఉంటూ సూచనలు ఇచ్చారు. పోలింగ్ తక్కువగా ఉన్న బూత్ ల వద్దకు వెళ్లి పరిశీలించారు. బీఆర్ఎస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులకు బాధ్యతలు అప్పగించింది. తమకు కేటాయించిన డివిజన్లలో పర్యటించిన నాయకులు, ప్రలోభాల పంపిణీ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. ఎమ్మెల్యే సబితా రెడ్డి, ఎంపీ మర్రి రాజశేఖర్ రెడ్డి తో పాటు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఇలా కొందరి నాయకులకు డివిజన్ బాధ్యతలు అప్పగించారు. తమ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతతో మాట్లాడి, ప్రలోభాలు ఓటర్లకు అందేలా చేయడంలో స‌ఫ‌లీకృతం కాలేక‌పోయారంటున్నారు. బస్తీల వారీగా ఎంత పంపిణీ చేశారు, ఓటర్లకు ఎంత మొత్తం చేరిందనే విషయంలో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారని కార్యకర్తలే చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కి సమఉజ్జీగా ప్రలోభాలు ఎరవేయడంలో బీఆర్ఎస్ పోటీపడ లేదని ఆ పార్టీ కార్యకర్తలు అంగీకరిస్తున్నారు. పార్టీ అధినాయకత్వం కూడా నగదు పంపిణీలో అంతగా చొరవ చూపలేదనే వార్తలు కూడా విన్పిస్తున్నాయి.

Read Also |
Uttam Kumar Reddy : కాళేశ్వరం బారేజీల పునరుద్ధరణకు శాస్త్రీయ చర్యలు
China’s Hongqi Bridge Collapses : చైనాలో కుప్పకూలిన హాంగ్కీ వంతెన..వీడియో వైరల్
IRCTC Best Package: రూ. 7210కే తిరుపతి, శ్రీకాళహస్తి, తిరుచానూరు పద్మావతి దర్శనం.