విధాత, ప్రత్యేక ప్రతినిధి:
Jubilee Hills By-poll Analysis | ఒక్క ఉప ఎన్నికకు ఎక్కడ లేని సకల హంగులను కల్పించి, ప్రచారాన్ని పతాక స్థాయికి తీసుకెళ్ళి రాష్ట్ర రాజకీయాలను మలుపుతిప్పే ఎన్నికలంటూ ఊదరగొట్టిన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఫలితాల్లో కాంగ్రెస్ ఊహించిన దానికంటే మంచి మెజార్టీతో గెలిచింది. ఈ ఉప ఎన్నిక నేపథ్యంలో పార్టీలు తమకు తాముగా కొని తెచ్చుకున్న ‘ప్రతిష్ఠాత్మక’ పోటీ నేపథ్యంలో ఈ ఫలితం రాష్ట్ర రాజకీయాలపై ఎంత ప్రభావం కనబరుస్తుందనే చర్చ ఇప్పుడు సాగుతోంది. ఏ పార్టీకి ఎంత లాభం? ఎంత నష్టం కలిగిస్తుందంటూ రాజకీయ పరిశీలకులు లెక్కలు వేస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ ఫలితం ప్రభావంతో పాటు ఆయా పార్టీల తీరు తెన్నులు ఎలా? ఉంటాయనే ఊహాగానాలు సాగుతున్నాయి. గెలిచిన కాంగ్రెస్‌లో జోష్ నెలకొనగా, బీఆర్ఎస్, బీజేపీ నైరాశ్యంలో మునిగిపోయాయి. అంతర్గతంగా ప్రధాన పార్టీలు, పరిశీలకులు లాభనష్టాల లెక్కల్లో నిమగ్నమయ్యారు.
ఏకగ్రీవ సాంప్రదాయానికి గండి కొట్టిన బీఆరెస్
కాంగ్రెస్‌లో కాసింత జోష్
ఎవరెన్ని చెప్పినా రెండేళ్ళ అధికారాన్ని పూర్తి చేసుకున్న కాంగ్రెస్ పార్టీకి జూబ్లీ విజయం కొత్త ఉత్సహాన్నిస్తోంది. సీఎం రేవంత్‌తోపాటు కేడర్‌లో జోష్ నింపింది. ప్రభుత్వంలో, పార్టీలో సీఎం రేవంత్ పట్టు మరింత పెరుగుతోంది. ఇవన్నీ పక్కన పెడితే జూబ్లీ ఎన్నిక ఫలితం రాష్ట్రం మొత్తం ప్రభావం కనబరుస్తుందా? అనే చర్చలు సాగుతున్నాయి. ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ.. జూబ్లీ ఉప ఎన్నికకు ఎక్కడలేని ప్రాధాన్యం ఇచ్చిన నేపథ్యంలో అదే స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్‌లో, రాష్ట్ర వ్యాప్తంగా కొంత ప్లస్ గా మారుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలపై ఎంత ప్రభావం చూపుతుందంటే… గ్రామీణ ఓటర్లు ఎక్కువగా ఉండే స్థానిక ఎన్నికల్లో పూర్తిగా సానుకూలంగా మారుతోందని ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. ఈ ఫలితం ప్రభావాన్ని కాంగ్రెస్ ఎలా ఉపయోగించుకుంటుందనే దానిపై ‘స్థానిక’ విజయాలు ఆధారపడుతాయని చెబుతున్నారు.
కాంగ్రెస్ సమీక్షించుకుంటుందా?
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు పూర్తయ్యాయి. ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో కొన్ని మాత్రమే అమలు చేశారు. రుణమాఫీ, రైతు భరోసా లాంటివి ఇచ్చారు. మహిళలకు ఉచిత బస్సు, ఉచిత విద్యుత్ అమలు చేశారు. అయినప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రభుత్వంపై కొంత వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో జూబ్లీ ఎన్నిక ఫలితం మొత్తం పరిస్థితిని మార్చివేసి సానుకూలత సృష్టిస్తోందని చెప్పలేమంటున్నారు. కాకుంటే విపక్షాల విమర్శలకు కొంత చెక్ పెట్టేందుకు కొద్ది కాలం ఉపయోగపడుతోందంటున్నారు. ఈ ఫలితం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కొంత ప్రభావాన్ని కనబరిచే అవకాశం ఉంటుందంటున్నారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో హైదరాబాద్‌లో పట్టు సాధించలేక పోయిన కాంగ్రెస్‌కు కంటోన్మెంట్, జూబ్లీ ఉప ఎన్నికల విజయాలు కొంత పట్టును సాధించేందుకు దోహదం చేస్తాయంటున్నారు. జూబ్లీ ఎన్నిక ఫలితాలతో పాలనలో జరుగుతున్న లోపాలు, ఇతరత్రా సమస్యలను పరిష్కరించుకునేందుకు, సమీక్షించుకునేందుకు రేవంత్ కు అవకాశం కల్పించిందని చెబుతున్నారు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అసంతృప్తులు, రేవంత్ వ్యతిరేకులు ఇప్పుటికిప్పుడు గట్టిగా నోరిప్పే అవకాశం తగ్గుతుందనే వాదనా వినిపిస్తున్నది. అదే సమయంలో జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ బీహార్ ఎన్నికల్లో ఘోర ఓటమి రాష్ట్ర నాయకత్వం పై ప్రభావం చూపే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. ఉప ఎన్నిక విజయంతో సీఎం రేవంత్ నాయకత్వంలో తమ పట్టును నిలుపుకున్నట్లేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ సిట్టింగ్ సీటును కాంగ్రెస్ దక్కించుకోవడం రైడా ఆ పార్టీకి ప్లస్ గా భావిస్తున్నారు.
Read Also |
బీహార్ ఎన్డీయే గెలుపులో ఆ 7,500 కోట్ల పాత్రే కీలకం!
Kavitha : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితంపై కవిత ట్వీట్ వైరల్ !
Prashant Kishor’s Jan Suraaj Party : బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2025: ప్రశాంత్ కిషోర్ జనసురాజ్ పార్టీ వైఫల్యమెందుకు?
