Jubilee Hills Bye Election | ‘కంటోన్మెంట్‌’కు లేని హైప్ ‘జూబ్లీహిల్స్’కు ఎందుకు?

జూబ్లీ హిల్స్‌ ఉప ఎన్నిక ప్రచారం నగరంలోనే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వేడిని రగిలించింది. ఈ ఎన్నికలో గెలుపోటమలు రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పుతాయని కొందరు అంటుంటే.. కేవలం ప్రతిష్ఠ కోసమే ఉప ఎన్నికను రాజకీయ రణరంగంగా మార్చారని మరికొందరు అంటున్నారు.

Jubilee Hills bypoll

విధాత, ప్రత్యేక ప్రతినిధి:

Jubilee Hills Bye Election | రాష్ట్రంలో తాజా రాజకీయమంతా జూబ్లీ ‘హిల్స్’ ఉప ఎన్నిక చుట్టూ తిరుగుతోంది. మూడు ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ తమ రాష్ట్రవ్యాప్త ‘బలగాలను’ అక్కడే మోహరించి బ్యాలెట్ యుద్ధం చేస్తున్నాయి. రాష్ట్ర మంత్రివర్గం, కేంద్రమంత్రులు, జిల్లాల్లో చక్రం తిప్పే ఎంపీలు, ఎమ్మెల్యేలు గల్లీలవారీగా బాధ్యతలు పంచుకుని అనుచరగణంతో సహా అక్కడే తిష్ఠవేశారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించారు. ప్రలోభాలకూ తెరతీశారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇక మీడియా సైతం ఎక్కడలేని ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నది. మంగళవారం (10.11.2025) ఆఖరి ఘట్టం నేపథ్యంలో మూడు పార్టీలు ఓటరుపై ముప్పేట దాడి చేస్తున్నారా? అనే స్థాయిలో రాజకీయ నాయకులు ప్రచారం చేశారు. నిజానికి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు అంత ప్రాధాన్యం ఉందా? ప్రచారంలో కొందరు నేతలు ప్రగల్భాలు పలికినట్లు రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని ఈ గెలుపోటములు మారుస్తాయా? లేకుంటే రాజకీయ పక్షాలు తమ ఆధిపత్యాన్ని చాటుకునేందుకు ఈ ఉప ఎన్నికను రాజకీయ రణరంగంగా మార్చారా? రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకంటే జూబ్లీ ఎన్నికల గెలుపోటములే పార్టీలకు ప్రాణం పోస్తాయా? అనే చర్చ సాగుతోంది. పైగా ఈ ఎన్నిక కోసం హుజురాబాద్ ఉప ఎన్నిక స్థాయిలో పోటీపడుతూ విచ్చలవిడిగా ఖర్చుపెడుతున్న వైనం.. ‘ఏ పరిణామాలకు ఈ పయనం?’ అనే ప్రశ్నను లేవనెత్తుతున్నది.

మూడు నెలలుగా జూబ్లీ నాటకం

గత మూడు నెలలుగా, మరీ ముఖ్యంగా గత నెల రోజులుగా రాష్ట్రంలో మరో సమస్యే లేనట్లు జూబ్లీ హిల్స్ చుట్టూరా చక్కర్లు కొడుతున్నారు నాయకులు. ప్రచారంలో సవాళ్ళు, ప్రతి సవాళ్ళు విసుకుంటున్నారు. ఇంత చేస్తే ఆ జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజల సాధకబాధకాలేమైనా చర్చకు వచ్చాయా? అంటే అదేమీలేదు. పార్టీ భేదాలు, నాయకత్వ స్థాయి భేదాలు పక్కన పెట్టిమరీ ‘బస్తీమే సవాల్’ అంటూ జబ్బలు చరుసుకుంటూ తోడలు కొట్టారు. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ విమర్శలకు దిగారు. సోషల్ మీడియా వేదికగా సాగుతున్న ప్రచారపర్వం చూస్తే జుగుప్సాకరంగా అనిపించకమానదు. ఇదే సమయంలో అకాల మరణం చెందిన మాగంటి గోపీనాథ్ మృతి చుట్టూ అనుమానాలు, అవమానాలు, ఆరోపణలు ముసురుకున్నాయి. చివరికి కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు, రాజకీయ నాయకుల ఆరోపణలు నాటకాన్ని రక్తికట్టించాయి. పోనీ, నిజంగానే ఆయన మృతిపై అనుమానాలుంటే విచారణ సాగి నిజం నిగ్గుతేలుతుందా? అంటే అదీ అనుమానమే. పోనీ, జూబ్లీ హిల్స్ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకంటే అభివృద్ధిలో ముందంజలో వేసి, రోడ్లు అద్దంలా మెరిసిపోయి, అక్కడి ప్రజల కష్టాలన్నీ తీరిపోతాయా? అంటే ఈ ఉప ఎన్నికలాంటి ఎన్నికలకు సంబంధించి తెలంగాణకు ఉన్నంత అనుభవం మరే ప్రాంతానికి లేదేమో! ఎన్నికల తర్వాత ఏమైతదో అందరికీ తెలిసిందే. కాకుంటే నియోజకవర్గానికి కాసింత తేడా అంతే?

రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని మారుస్తుందా?

జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక గెలుపోటములు రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని మారుస్తాయా? ఈ చర్చ నిజమేనా? పడిపోయిన ప్రతిష్ఠలను కాపాడుకునేందుకు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను పావుగా వాడుకుంటున్నారా? నిజానికి జూబ్లీ హిల్స్ బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు. దీనికి ముందు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ నగర పరిధిలోని కంటోన్మెంట్‌లో కూడా ఉప ఎన్నిక వచ్చింది. ఆ స్థానం కూడా బీఆర్ఎస్ సిట్టింగ్ సీటే. ఇంకా చెప్పాలంటే అక్కడ సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా గెలుపొందిన సాయన్న మృతితో ఆయన కుమార్తె లాస్య నందిత పోటీచేసి గెలిచారు. ఆమె రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇంకా చెప్పాలంటే గోపీనాథ్ అనారోగ్యానికి గురై చనిపోతే.. లాస్య రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అక్కడ జరిగిన ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పక్షాన ఆమె చెల్లెలు పోటీచేశారు. అక్కడ సెంటిమెంటుకు భిన్నంగా పాత బీజేపీ అభ్యర్ధి కాంగ్రెస్‌లో చేరి, పోటీ చేసి విజయం సాధించారు. మరి ఆ ఎన్నికకు లేని ప్రాధాన్యం ఈ జూబ్లీ హిల్స్‌కు ఎక్కడి నుంచి వచ్చిందనే చర్చ సాగుతోంది. నిజమే అప్పటికీ, ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీ మీద కొంత ప్రజావ్యతిరేకత పెరిగిందనుకుందాం! ఆ పార్టీ ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయలేకపోవచ్చూ! కానీ కంటోన్మెంట్‌లో బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు కోల్పోయిందిగదా? నిజంగానే కంటోన్మెంట్‌లో బీఆర్ఎస్ గెలిస్తే తన సిట్టింగ్ సీటు నిలబెట్టుకుందనుకునేవారు. జూబ్లీ హిల్స్‌లో కూడా బీఆర్ఎస్ గెలిస్తే అదే వాదన ఉంటుంది. జూబ్లీ హిల్స్‌లో కాంగ్రెస్ ఓడితే ఆ పార్టీలో ‘చర్చ’కు అవకాశం ఉండనే ఉంది. ప్రభుత్వ వ్యతిరేకతకు ఈ తీర్పు నిదర్శనమని చెప్పుకొనే అవకాశం బీఆరెస్‌కు లభిస్తుంది. కానీ, మరో వైపు ఇక్కడ కాంగ్రెస్ తన సిట్టింగ్ సీటు కోల్పోయినట్లు కాదనే వాదన ఉంటోంది.

500 రోజుల అల్టిమేటమ్.. అంతరార్ధం!

పదేళ్ళ టీఆర్ఎస్ అండ్ బీఆర్ఎస్ పాలనకు చరమ గీతం పాడి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్ళు పూర్తయ్యాయి. ఇంకా ఆ పార్టీకి మరో మూడేళ్ళు…. సీఎం రేవంత్ అంచనా ప్రకారం జమిలి ఎన్నికల కారణంగా అంతకంటే ఎక్కువ కాలమే ఆ పార్టీ అధికారంలో ఉంటుందేమో. కానీ. .జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తే 500 రోజుల్లో కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారనేది ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్నికల ప్రచారాస్ర్తం. దీనర్ధ, పరమార్థాలపై ఆయనే వివరణ ఇవ్వాలి. ఇది ఎన్నికల స్టంటా? లేదా బీఆర్ఎస్ గెలిస్తే తాము కదిపే పావులెలా ఉంటాయో ముందే చెబుతున్నారా? జూబ్లీ ఎన్నికలు, కేటీఆర్ జోస్యం పై అనేక ఊహాగానాలు, ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఉన్న మార్గాలపై ఈ విధంగా చర్చ సాగుతోంది. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతే ఆ పార్టీలో సంక్షోభం తలెత్తి 500 రోజుల్లో ప్రభుత్వం కూలిపోయి తిరిగి ఎన్నికలు జరిగితే మళ్ళీ కేసీఆర్‌ను ప్రజలు గద్దెనెక్కిస్తారనేది అందులో ఒకటి. ఓటమితో రేవంత్‌ను గద్దె దింపి కాంగ్రెస్‌లోనే తిరుగుబాటు ప్రారంభమై ఆ పార్టీ ఎమ్మెల్యేలు ‘ఫిరాయించి’ లేదా శాసనసభా పక్షాన్ని బీఆర్ఎస్‌లో విలీనం చేసి కేసీఆర్‌ను సీఎం చేస్తారనడం మరోటి. దీనికి కూడా 500 రోజులు అంటే అటూ ఇటూగా మరో ఏడాదిన్నర సమయం పడుతోందని వారి అంచనా. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కేటీఆర్ చెప్పినట్లు కాంగ్రెస్ ఓటమిపాలైతే రేవంత్ పాలన పై తీర్పుగా పేర్కొంటూ ఆ పార్టీలో ఆయన పట్టు కొంత సడలిపోవచ్చు. తీవ్ర పరిణామాలు జరిగితే నాయకత్వ మార్పు జరుగొచ్చేమో! ఈ పరిణామాలతో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తుందా? అనేది ప్రస్తుతానికి మాత్రం ఊహాజనితమే! కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్న కొన్ని రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. ఇలాంటి రాష్ట్రాన్ని ఆ పార్టీ అధిష్ఠానం అంత సులభంగా చేజార్చకుంటుందా? అనేది అనుమానమే. ఈ కాస్త జాగ్రత్త, ముందస్తు రాజకీయ అంచనా లేకుండా ఆ పార్టీ ఉన్నదా? అనే చర్చ కూడా మరో వైపు ఉంది.

బీజేపీ పరిస్థితేంటి?

ఇక కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోతే ఈ తతంగంలో కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ ఇక్కడ ఏ పాత్ర నిర్వహిస్తుందనేది మరో మిలియన్ డాలర్ల ప్రశ్న. ఒక్క ఉప ఎన్నిక రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని మారుస్తుందా? అనేది ప్రధాన చర్చనీయాంశం. మరి బీఆర్ఎస్ ఓటమిపాలైతే ఇంత రాజకీయ వేడి రగలినప్పుడు.. ఇప్పటికే రాష్ట్రంలో అధికారం కోల్పోయి.. పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాక, ఎమ్మెల్యేలు ఫిరాయించిన నేపథ్యంలో గాడిలో పడిన పార్టీలో కొత్త చర్చకు దారి తీయదా? అనే చర్చ సాగుతున్నది. ఇప్పటికే కవిత ఎపిసోడ్‌తో తలబొప్పికట్టిన పార్టీ తిరిగి కోలుకుంటుందా? అనే చర్చ కూడా దీని వెన్నంటి ఉంటోంది. అంటే ఫలితం కత్తికి రెండు వైపులా పదును ఉంటుందని అర్థమవుతున్నది. ఇందులో బీజేపీకి వచ్చే ఓట్లను బట్టి ఆ పార్టీకి కూడా ప్లస్, మైనస్‌లు ఉంటాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే ఆ పార్టీకి, నాయకుడు రేవంత్ మరింత పట్టు బిగించే అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్ గెలిస్తే కాంగ్రెస్‌పై విమర్శల దాడిని మరింత తీవ్రం చేయొచ్చు. రానున్న రోజుల్లో ఆ పార్టీకి, కేడర్‌కు ఇది ఉత్తేజాన్నిస్తుందనడంలో సందేహం లేదు. ఇక బీజేపీ గెలిస్తే అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు దెబ్బపడ్డట్లే! ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన గెలుపునకు ఇది మరింత జోష్ నింపుతోంది. కానీ.. బీజేపీకి అంత సీన్‌ ఉందా? అనేది ప్రశ్న.

Read Also |

CM Revanth Reddy | ప్రజాప్రభుత్వంలో మైనారిటీలకు పెద్దపీట : సీఎం రేవంత్ రెడ్డి
AI Job Disruption | ఏఐ ఎఫెక్ట్‌.. ముందువరుసలో జర్నలిస్టులు, అనువాదకులు, రచయితలు! ఎఫెక్ట్‌లేని టాప్‌ టెన్‌ ఉద్యోగాలేంటి?
Hyderabad | హైదరాబాద్‌లో ఉగ్ర కలకలం.. డాక్టరే ప్రధాన సూత్రదారి