హైదరాబాద్, విధాత ప్రతినిధి:
Revanth Reddy Strategy | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉప ఎన్నికలు కలిసొస్తున్నాయి. మొన్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీగణేశ్ గెలుపొందారు. తాజాగా జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వీ నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆకస్మిక మరణంతో ఈ రెండు స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఒక విధంగా రేవంత్ రెడ్డి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న సమయంలో ఈ ఎన్నిక వచ్చింది. సంక్షేమ పథకాల అమలులో జాప్యం, పార్టీలో మంత్రుల మధ్య అంతర్గత తగాదాలు, ఈ ఉప ఎన్నికలో ఓడితే పెరిగే ఒత్తిడి.. ఈ అన్ని అంశాలను సమన్వయంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధిగమించి, పార్టీ అభ్యర్థిని గెలిపించారని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ విజయంతో రేవంత్ నాయకత్వానికి తిరుగు లేకుండా పోయిందంటున్నారు. అభ్యర్థి ఎంపిక, మంత్రులకు బాధ్యత, డివిజన్ల వారీగా బాధ్యతల అప్పగింత, నాయకుల మొహరింపు, ముఖ్యమంత్రి సైతం కార్నర్ మీటింగ్ లు, నాయకుల ఇంటింటి ప్రచారం, పోలింగ్ రోజున మంత్రులను అప్రమత్తం చేయడంలో రేవంత్ రెడ్డి చాణక్యం ప్రదర్శించారని విశ్లేషకులు చెబుతున్నారు. అన్నీ తానై వ్యవహరించడంతో విజయం సులువు అయిందని పార్టీ ముఖ్య నాయకులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ రావడం కంటే ముందే ముగ్గురు మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, పొన్నం ప్రభాకర్ గౌడ్, జీ వివేక్ వెంకట స్వామిలకు బాధ్యతలు అప్పగించారు. అభ్యర్థి ఎంపిక కోసం కార్యకర్తలు, నాయకుల అభిప్రాయాలు సేకరించడంతో పాటు నియోజకవర్గంలో పెండింగ్ సమస్యలను పరిశీలించాల్సిందిగా సూచించారు. ఇన్‌చార్జ్ మంత్రుల సూచన మేరకు ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు నిధులు మంజూరు చేయించి పనులు వేగిరంగా పూర్తి చేయించారు. అభ్యర్థిగా ఎవరిని నిలబెడితే బాగుంటుందని కాంగ్రెస్ శ్రేణుల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. తొలుత మహ్మద్ అజారుద్దీన్ పేరు విన్పించినప్పటికీ, ఆ తరువాత ఆయనకు ఎమ్మెల్సీ పదవికి నామినేట్ చేయడంతో తప్పుకొన్నారు. ఆ తరువాత వీ నవీన్ యాదవ్ పేరు ప్రముఖంగా విన్పించింది. స్థానికుడు, విద్యావంతుడు కావడం, గతంలో రెండు సార్లు పోటీ చేసిన అనుభవం ఉండటంతో, స్థానిక బలం, బలగం కారణంగా ఇన్‌చార్జ్ మంత్రులు నవీన్ యాదవ్ పేరును ప్రతిపాదించారు. కాంగ్రెస్ పార్టీ బీసీ నినాదం కూడా కలిసివచ్చిందనే చెప్పాలి. స్థానికుడికే టిక్కెట్ ఇస్తామని, బయటి వారికి ఇవ్వడం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. పీసీసీ సిఫారసు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదన మేరకు ఏఐసీసీ నాయకత్వం వీ నవీన్ యాదవ్ పేరును అధికారికంగా ప్రకటించింది. నోటిఫికేషన్ జారీ చేసిన తరువాత డివిజన్ల వారీగా మంత్రులు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ, జూపల్లి కిష్ణారావు, సీతక్క లకు బాధ్యతలు అప్పగించారు.
CM Revanth:ఈ విజయం భూకంపం వచ్చే ముందు ఇచ్చే అలర్ట్ లాంటిది
నామినేషన్లు దాఖలు చేసిన తరువాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగా రంగంలోకి దిగారు. కార్నర్ మీటింగ్ లు, రోడ్ షోలు నిర్వహించి బీఆర్ఎస్, బీజేపీ నాయకులను తూర్పార బట్టారు. ఈ రెండు పార్టీలు ఒకటేనని, అందుకే బీజేపీ డమ్మీ అభ్యర్థిని బరిలో నిలబెట్టిందన్నారు. బీజేపీ అభ్యర్థికి డిపాజిట్ కూడా దక్కదన్నారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు సోషల్ మీడియాను నమ్ముకున్నారని, తాము పథకాలను నమ్ముకుని ఓట్లు అడుగుతున్నామన్నారు. మీ సోషల్ మీడియాలు మీరు చెప్పిందే ప్రచారం చేస్తారని కూడా ఆయన అన్నారు. అధికారంలో ఉన్న ప్రభుత్వం మద్ధతు ఉన్న అభ్యర్థిని గెలిపిస్తే మరింత అభివృద్ధి నిధులు వస్తాయన్నారు. ముస్లిం ఓటర్లను తమ వైపునకు తిప్పుకునేందుకు మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ కు ఎమ్మెల్సీతో పాటు మంత్రి పదవి కూడా ఇచ్చామన్నారు. గత మూడు ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపించారని, ఈ సారి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను గెలిపించాలని ఓటర్లకు ముఖ్యమంత్రి వినతి చేశారు.
KTR : కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం బీఆర్ఎస్.. జూబ్లీహిల్స్ తీర్పు సారంశం ఇదే : కేటీఆర్
పోలింగ్ కు ముందు నాలుగైదు దఫాలు నియోజకవర్గం ఇన్‌చార్జ్ మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్లు, డివిజన్ బాధ్యులతో రేవంత్ రెడ్డి సమావేశమై కీలక సూచనలు చేశారు. ప్రతినిత్యం అప్రమత్తంగా ఉండాలని, బీఆర్ఎస్ ను తక్కువ అంచనా వేయవద్దని సూచించారు. ఏమైనా సమస్య ఉంటే మంత్రులకు తెలియచేసి, పరిష్కారం అయ్యేలా చూడాలని కోరారు. పోలింగ్ ముందు రోజు మంత్రివర్గానికి కీలక సూచన చేశారు. ఏ ఒక్క మంత్రి కూడా హైదరాబాద్ విడిచి వెళ్లవద్దని, అందరూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో జూబ్లీహిల్స్ లో విజయం సాధ్యమైందంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత జరిగిన రెండు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిందని కార్యకర్తలు వ్యాఖ్యానిస్తున్నారు.
నాలుగో స్థానంలో నోటా
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఆశ్చర్యకరమైన పరిణామం చోటు చేసుకున్నది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపొందగా, రెండో స్థానంలో బీఆర్ఎస్, మూడో స్థానంలో బీజేపీ లు ఉన్నాయి. నాలుగో స్థానంలో నోటా ఉంది. ‘నోటా’కు 922 ఓట్లు నమోదు అయ్యాయి. ఈ ఎన్నికల బరిలో మొత్తం 58 మంది అభ్యర్థులు నిలబడ్డారు.
Read Also |
Kaantha Review | కాంత మూవీ రివ్యూ: గురు–శిష్యుల ఈగో… చివరకు ఎవరి ప్రాణం తీసింది?
Great Blue Heron Mating Dance Viral Video : ప్రియురాలి కోసం ఆ పక్షి వింత ఎత్తులు..వైరల్ వీడియో!
Kavitha : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితంపై కవిత ట్వీట్ వైరల్ !
