విధాత, హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, బీఆర్ఎస్ అభ్యర్థిపై 24,658 వేల ఓట్లకుపైగా మెజార్టీతో గెలుపొందారు. ఈ ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి నవీన్ యాదవ్ పత్రి రౌండ్ లోనూ ఆధిక్యం కనబరిచారు. ఏ ఒక్క రౌండ్‌లోనూ బీఆర్ ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఆధిక్యం దక్కించుకోలేకపోయారు. మొత్తం 10రౌండ్ల ఓట్ల లెక్కింపు ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు 24,658ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. పోలింగ్ ముగిశాక కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వేసుకున్న అంచనా మేరకు మెజార్టీ సాధించడం గమనార్హం.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక జరిగిన రెండో ఉప ఎన్నిక జూబ్లీహిల్స్ లో ఆ పార్టీ విజయం సాధించడంతో పార్టీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అంతకుముందు కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ గెలిచిన సంగతి తెలిసిందే. జూబ్లీహిల్స్, కంటోన్మెంట్ రెండు సీట్లలోనూ సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాగంటి గోపినాథ్, లాస్య నందితల ఆకస్మిక మరణాలతో ఉప ఎన్నికలు వచ్చాయి. ఈ రెండు స్థానాలలోనూ సెంటిమెంట్ ను అధిగమించి కాంగ్రెస్ హస్తగతం చేసుకోవడం విశేషం.
