Jubilee Hills Exit Polls | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ వైపు ఓటర్లు మొగ్గు చూపారని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ రిగ్గింగ్ చేసిందని బీఆర్ఎస్ ఆరోపణలు చేసింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఎంఐఎం మద్దతు పలకడం కూడా హస్తం పార్టీకి కలిసివచ్చిందనే విశ్లేషణలు ఉన్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ మూడో స్థానానికే పరిమితం కానుంది. అయితే ఆ పార్టీకి ఈ ఎన్నికల్లో ఆశించిన ఓట్లు వచ్చే అవకాశం లేదని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
కాంగ్రెస్ కు కలిసి వచ్చిన ఎంఐఎం మద్దతు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎంఐఎం తన అభ్యర్ధిని బరిలోకి దింపలేదు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి నవీన్ యాదవ్ కు ఆ పార్టీ మద్దతు ప్రకటించింది. ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో ముస్లిం ఓటర్లు గణనీయంగా ఉన్నారు. ఇది ఒక రకంగా కాంగ్రెస్ కు కలిసి వచ్చింది. ముస్లిం ఓటర్లు ఉన్న ప్రాంతాల్లో ఎంఐఎం నాయకులు కాంగ్రెస్ అభ్యర్ధి గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం చేశారు. అంతేకాదు మూడు రోజులుగా ఎంఐఎం శ్రేణులు తమకు పట్టున్న ప్రాంతాల్లో కాంగ్రెస్ గెలుపు కోసం పక్కా ప్రణాళికతో పనిచేశారు. ఇది కాంగ్రెస్ కు కలిసివచ్చిందని చెబుతున్నారు.
ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఉప ఎన్నిక షెడ్యూల్ వెలువడక ముందే ఈ నియోజకవర్గంలో ముగ్గురు మంత్రులు, కార్పోరేషన్ చైర్మెన్లకు బాధ్యతలను అప్పగించారు. క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని ఎన్నికలకు సిద్దం చేశారు. అంతేకాదు ఈ నియోజకవర్గంలో అభివృద్ది కార్యక్రమాలకు వందల కోట్లు కేటాయించింది ప్రభుత్వం. ప్రతి ఓటరుకు కాంగ్రెస్ ప్రచారం వెళ్లేలా ప్లాన్ చేశారు. ప్రచారంలో ప్రత్యర్థి పార్టీలను ఎండగట్టడంతో పాటు తాము ఏం చేస్తామో వివరించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని అభివృద్ది చేస్తామని హామీ ఇచ్చారు. పోలింగ్ ముగిసేవరకు మంత్రులు, ఇంచార్జీలు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. స్థానిక కాంగ్రెస్ నాయకులు హడావుడి పోలింగ్ బూత్ ల వద్ద హడావుడి కనిపించింది.
సెంటిమెంట్ పైనే బీఆర్ఎస్ ఆశలు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ సెంటిమెంట్ పైనే ఎక్కువగా ఆశలు పెట్టుకుంది. మాగంటి గోపినాథ్ మరణంతో ఈ ఉప ఎన్నిక జరుగుతుంది. గోపినాథ్ భార్యను ఆ పార్టీ బరిలోకి దింపింది. సెంటిమెంట్ అస్త్రాన్ని గులాబీ పార్టీ ప్రయోగించింది. అయితే బీఆర్ఎస్ సెంటిమెంట్ ప్రయోగాన్ని కాంగ్రెస్ తిప్పికొట్టే ప్రయత్నం చేసింది. కల్వకుంట్ల కవిత అంశాన్ని ప్రస్తావిస్తూ బీఆర్ఎస్ ప్రయోగించిన సెంటిమెంట్ అస్త్రానికి అడ్డుకట్టవేసేందుకు యత్నించింది. కాంగ్రెస్ హామీల వైఫల్యాలను కూడా ఆ పార్టీ ఈ ఎన్నికల సమయంలో ప్రధానంగా ప్రస్తావించింది. హైడ్రా అంశాన్ని కూడా మరోసారి తెరమీదికి తెచ్చింది. అయితే ఓటింగ్ శాతం తగ్గిపోవడం గులాబీ పార్టీకి కొంత నిరాశను కలిగిస్తోంది. ఓటింగ్ శాతం పెరిగితే ఆ పార్టీకి కలిసివచ్చేదనే అభిప్రాయాలున్నాయి. బస్తీవాసులు ఎక్కువగా హస్తం వైపు మొగ్గు చూపారని…. సైలెంట్ ఓటర్లు మాత్రం బీఆర్ఎస్ వైపునకు మళ్లారని సర్వేలు సూచిస్తున్నాయి. షేక్ పేట, బోరబండల్లో కాంగ్రెస్ రిగ్గింగ్ చేసిందని బీఆర్ఎస్ ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలను కాంగ్రెస్ తోసిపుచ్చింది. బోరబండ డివిజన్ లోని బస్తీలన్నీ కాంగ్రెస్ వైపునకు మొగ్గు చూపినట్టుగా చెబుతున్నారు. రహమత్ నగర్, జవహర్ నగర్, యూసుఫ్ గూడ, వెంగళ్ రావు నగర్ లలో కాంగ్రెస్ కు మెజార్టీ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఎర్రగడ్డలో రెండు పార్టీలు సగం సగం ఓట్లను పంచుకున్నాయనేది అంచనా. షేక్ పేటలో ఎంఐఎం చక్రం తిప్పిందని అంటున్నారు. దీంతో ఈ డివిజన్ లో కూడా కాంగ్రెస్ కు మెజారిటీ వచ్చే అవకాశం ఉందనే అంచనాలున్నాయి.