Site icon vidhaatha

Kaleshwaram Banakacharla | పవర్ పాయింట్లతో పోటాపోటీ!

Kaleshwaram Banakacharla | హైదరాబాద్, (విధాత): కాళేశ్వరం, బనకచర్ల ప్రాజెక్టులపై అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పోటా పోటీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహించాయి. మీరంటే మీరే రాష్ట్రానికి అన్యాయం చేశారని పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. తమ వాదనలను సమర్ధించుకొంటున్నాయి. అసలు ఎవరి వాదన ఏంటి? ప్రాణహిత -చేవెళ్ల డిజైన్ మార్పునకు కారణం ఏంటి? బనకచర్ల ప్రాజెక్టుపై ఎవరేమంటున్నారు? పవర్ పాయింట్ ప్రజెంటేషన్లతో ఏం సాధించారో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ప్రజెంటేషన్లు ప్రారంభించిన బీఆర్ఎస్

కాళేశ్వరం ప్రాజెక్టుపై హస్తం పార్టీ దుష్ప్రచారం చేస్తోందనేది గులాబీ పార్టీ వాదన. అసలు వాస్తవాలను ప్రజల ముందు పెట్టేందుకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను అస్త్రంగా ఎంచుకుంది. ఇందులో భాగంగానే కాళేళ్వరంపై జూన్ 2న మాజీ మంత్రి హరీశ్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును ప్రతిపాదించారు. రాష్ట్ర విభజన తర్వాత కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టుల రీ డిజైన్కు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే తుమ్మిడి హెట్టి వద్ద కాకుండా మేడిగడ్డ వద్ద బరాజ్ నిర్మించడం ద్వారా గోదావరి నీటిని ఎక్కువ ఉపయోగించుకొనే అవకాశం ఉంటుందని భావించి కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపకల్పన చేసినట్టు బీఆర్ఎస్ చెబుతోంది. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా 11 టీఎంసీల నీటిని మాత్రమే వాడుకొనే అవకాశం ఉంటుంది. రీ డిజైన్లో భాగంగా మేడిగడ్డ వద్ద బరాజ్ నిర్మాణం వల్ల 141 టీఎంసీల నీటిని నిల్వ చేసుకొనే అవకాశం ఉంటుందనేది గులాబీ పార్టీ వాదన. మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల, మేడారం, మల్కపేట, అనంతగిరి, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్, బస్వాపూర్, గంధమల్ల, కొండంచెరువు, భూంపల్లి, మోతె, ధర్మారావుపేట, కాటేవాడి, ముద్దోజివాడి, తిమ్మక్కపల్లి రిజర్వాయర్లలో 141 టీఎంసీల నీటిని నిల్వ చేసుకోవచ్చని ఆ పార్టీ చెబుతోంది. మల్లన్నసాగర్లోనే 50 టీఎంసీలు నిల్వ చేసుకోవచ్చు అనేది ఆ పార్టీ వెర్షన్. ఎస్ఆర్‌సీపీ, ఎల్లంపల్లికి నీళ్లు రాని సమయంలో, కడెం నిండకున్నా మేడిగడ్డలో నీళ్లుంటాయని మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీశ్ రావు జూన్ 2న పవర్ పాయింట్ ప్రజేంటేషన్‌లో చెప్పారు. వర్షాలు బాగా కురిసిన సమయంలో ఎస్సారెస్సీ నుంచి మిడ్ మానేరుకు నీళ్లు వచ్చేవి. అక్కడి నుంచి నీటిని అన్నపూర్ణ, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ వరకు నీళ్లు తెచ్చుకున్నామని బీఆర్ఎస్ నాయకులు గుర్తు చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కాల్వల ద్వారా నింపిన 456 మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల ద్వారా 39,146 ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందించినట్టు ఆ పార్టీ చెబుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు నీటితోనే ఎస్ఆర్ఎస్పీ స్టేజీ 1, ఎస్ఆర్ఎస్పీ స్టేజీ 2, నిజాంసాగర్ పరిధిలోని 1.67 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరు అందించామని హరీశ్ రావు తెలిపారు. ఎస్ఆర్ఎస్పీ స్టేజీ 1, స్టేజీ 2, నిజాంసాగర్ ప్రాజెక్టులకు కాళేశ్వరం నీటిని అందించడం ద్వారా 17 లక్షల 8 వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించినట్టు గులాబీ పార్టీ తెలిపింది. కమీషన్ల కోసం ప్రాజెక్టు రీ డిజైన్లు చేశామని అధికారపక్షం వాదనలను బీఆర్ఎస్ కొట్టిపారేసింది. ప్రజలను తప్పుదోవపట్టించేందుకే ఈ ప్రచారం చేస్తున్నారని కారు పార్టీ వాదన.

తుమ్మిడిహెట్టి వద్ద నీళ్లు లేవని బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం: ప్రభుత్వం

బీఆర్ఎస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు కౌంటర్‌గా అధికార కాంగ్రెస్ కూడా రంగంలోకి దిగింది. ప్రధాన ప్రతిపక్షం పవర్ పాయింట్ దాడిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో తిప్పికొట్టే ప్రయత్నం చేసింది. కృష్ణా జలాలు, కాళేశ్వరం ప్రాజెక్టుపై జూలై 9న ప్రజాభవన్లో ప్రజా ప్రతినిధులకు నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు ఇందులో పాల్గొన్నారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును 16 లక్షల ఎకరాలకు నీరిచ్చేందుకు డిజైన్ చేశారు. తెలంగాణ ఏర్పడే నాటికి ఈ ప్రాజెక్టుకు సంబంధించి రూ.11, 690 కోట్ల విలువైన పనులు జరిగిన విషయాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కమీషన్ల కోసం తుమ్మిడిహెట్టి వద్ద నీళ్లు లేవని తప్పుడు ప్రచారం చేసి మేడిగడ్డకు ప్రాజెక్టును మార్చారనేది ఉత్తమ్ ఆరోపించారు. కాగ్ నివేదిక ప్రకారం 2022 నాటికి కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 1.47 లక్షల కోట్లు. ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టు కంటే రెండు లక్షల ఎకరాలే అదనం. ఈ ప్రాజెక్టుకు ఏడాదికి రూ. 16 వేల కోట్లు వడ్డీ, అసలు కింద చెల్లించాల్సి వస్తోందనేది అధికారపక్షం వాదన. సరైన డిజైన్లు, నిర్మాణం, నిర్వహణ లేక మూడు బరాజ్లు పనికిరాకుండా మారాయని ఎన్డీఎస్ఏ నివేదిక తెలిపిందని మంత్రి చెప్పారు. 2019లో బరాజ్లు ప్రారంభించేనాటికే లీకేజీలు బయటపడ్డా కేసీఆర్, హరీశ్ రావు పట్టించుకోని కారణంగా అవి కుంగిపోయాయని ఆయన విమర్శించారు. ఈ లోపాలు సరిచేయకుండా నీళ్లు నింపితే బరాజ్ దిగువన ఉన్న గ్రామాలతో పాటు భద్రాచలానికి ముప్పు ఉంటుందని ఎన్ డీ ఎస్ ఏ నివేదిక రాతపూర్వకంగా నివేదిక ఇచ్చిందన్నారు. ఐదేళ్లలో కాళేశ్వరం నుంచి లిఫ్ట్ చేసిన నీటిలో వినియోగించింది 65 టీఎంసీలు మాత్రమే అని ఉత్తమ్ వివరించారు. రూ. 38 వేల కోట్లతో పూర్తయ్యే తుమ్మిడిహెట్టిని పక్కనపెట్టి రూ. లక్ష కోట్లతో కాళేశ్వరం నిర్మించారని గులాబీ పార్టీపై అధికారపక్షం మండిపడుతోంది. కాళేశ్వరంతోనే రాష్ట్రానికి నీళ్లు వచ్చినట్టుగా బీఆర్ఎస్ ప్రచారం చేసుకుందని ప్రభుత్వం విమర్శలు చేస్తోంది. కాళేశ్వరం నుంచి చుక్క నీరు వాడుకోకుండానే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 153 లక్షల టన్నుల ధాన్యాన్ని పండించినట్టు ప్రభుత్వం లెక్కలు చెబుతోంది. ఇక యాసంగిని కలిపితే ఇది 283 లక్షల టన్నులకు చేరుతోందనేది అధికారపక్షం వాదన. మేడిగడ్డ నుంచి 168 టీఎంసీల నీటిని మాత్రమే బీఆర్ఎస్ లిప్ట్ చేసిందని తెలిపింది. ఇందులో 63 టీఎంసీలు తిరిగి సముద్రంలోకి వదిలేశారు. 10 టీఎంసీలు ఆవిరికిందపోయింది. ఇక 92 టీఎంసీలే లిఫ్ట్ చేశారని ప్రభుత్వం ప్రకటించింది. కొండపోచమ్మసాగర్, మల్లన్నసాగర్, రంగనాయకసాగర్ లకు 27 టీఎంసీలు ఇచ్చారు. ఐదేళ్లలో 65 టీఎంసీలనే వాడుకున్నారని.. 1.40 లక్షల ఎకరాలకే నీళ్లు అందించారనేది ప్రభుత్వ వాదన.

ఇక కృష్ణా జలాల విషయంలోనూ ఇదే జరిగిందని ప్రభుత్వం అంటోంది. 1987లో 11,150 క్యూసెక్కుల సామర్ధ్యంతో పోతిరెడ్డిపాడును నిర్మించారు. 2005లో దీని సామర్ధ్యం 44 వేల క్యూసెక్కులకు పెంచారు. తెలంగాణ ఏర్పడి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక పోతిరెడ్డిపాడు సామర్ధ్యాన్ని 92,592 క్యూసెక్కులకు ఏపీ ప్రభుత్వం పెంచుకుందని గులాబీ పార్టీపై హస్తం పార్టీ ఆరోపణలు చేస్తోంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు కూడా ఏపీ శ్రీకారం చుట్టిందని గుర్తు చేసింది. వర్షాకాలం ఆరంభంలో వచ్చే వరద నీటిని ఈ ప్రాజెక్టు ద్వారా తరలిస్తే నాగార్జునసాగర్ ఆయకట్టుకు చుక్క నీరు కూడా రాదని ప్రభుత్వం చెబుతోంది. 2014 కు ముందు శ్రీశైలం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రోజుకు 4.1 టీఎంసీల నీటిని తరలించే సామర్ధ్యం ఉంది. 2014 -2023 మధ్య బీఆర్ఎస్ హయంలో రోజుకు 9.6 టీఎంసీల నీటిని తరలించేలా సామర్థ్యాన్ని పెంచుకున్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.

మరో పోతిరెడ్డిపాడుగా బనకచర్ల: బీఆర్ఎస్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గోదావరి-బనకచర్ల ప్రాజెక్టును ప్రతిపాదించింది. ఇది పూర్తయితే తమకు నష్టమని తెలంగాణ వాదిస్తోంది. ఈ విషయంలో అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ ఒకే మాటమీద ఉన్నాయి. బనకచర్లను నిర్మిస్తే తెలంగాణకు ఎలా నష్టమో జూన్ 14న తెలంగాణ భవన్ లో నిర్వహించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో మాజీ మంత్రి హరీశ్ రావు వివరించారు. పోలవరం-బనకచర్లపై ఏపీ ప్రభుత్వం ముందుకు వెళ్తోన్నా తెలంగాణ ప్రభుత్వం ఎందుకు అడ్డుకోలేకపోతోందని గులాబీ పార్టీ ప్రశ్నించింది. భవిష్యత్తులో బనకచర్ల సామర్ధ్యాన్ని 400 టీఎంసీలకు పెంచుకొనేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బీఆర్ఎస్ ఆరోపించింది. ఈ విషయాన్ని కేంద్రానికి సమర్పించిన నివేదికలో చంద్రబాబు సర్కార్ తెలిపిందని హరీశ్ రావు చెప్పారు. కృష్ణా నది నీటిని పోతిరెడ్డిపాడు ద్వారా ఎలా తరలించుకుపోయారో గోదావరిని కొల్లగొట్టేందుకు బనకచర్లను ఏపీ తెరమీదికి తెచ్చిందనేది గులాబీ పార్టీ వాదన.

బనకచర్ల పాపం బీఆర్ఎస్‌దే

బీఆర్ఎస్ విమర్శలకు అధికారపక్షం కౌంటర్ ఇచ్చింది. గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై రాష్ట్రంలోని అన్ని పార్టీల ఎంపీలతో రాష్ట్ర ప్రభుత్వం జూన్ 18న సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు అన్ని పార్టీలకు చెందిన ఎంపీలు పాల్గొన్నారు. గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుకు కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే బీజం పడిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. నదీ జలాల విషయంలో కేసీఆర్ చేసిన పాపంలో భాగంగానే బనకచర్ల ప్రాజెక్టు తెరమీదికి వచ్చిందన్నారు. బేసిన్లు లేవు.. బేషజాలు లేవు అంటు చిత్తూరు జిల్లాలో అప్పటి మంత్రి రోజా ఇంట్లో విందు తర్వాత కేసీఆర్ మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలను అధికార పక్షం గుర్తు చేసింది. 2016 సెప్టెంబర్ 21న కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతితో పాటు , తెలంగాణ రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, చంద్రబాబు, మంత్రులు దేవినేని ఉమా మహేశ్వరరావు, హరీశ్ రావు పాల్గొన్నారని సీఎం గుర్తు చేశారు. గోదావరి, కృష్ణా జలాల వినియోగంపై ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయానికి సంబంధించి ఎనిమిది పేజీల మీటింగ్ మినిట్స్ ను సీఎం ప్రస్తావించారు. గోదావరి నుంచి మూడు వేల టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి.. కృష్ణా బేసిన్ లో ప్రాజెక్టులకు వెయ్యి టీఎంసీల నీళ్లు అవసరం. గోదావరి నుంచి కృష్ణాకు నీళ్లు తరలించి ఉపయోగించుకోవచ్చని ఈ సమావేశంలో కేసీఆర్ సూచించారని రేవంత్ రెడ్డి అన్నారు. గోదావరి నుంచి రాయలసీమకు నీళ్లు ఇవ్వవచ్చని ఆయన అన్నారని సీఎం గుర్తు చేశారు. ఆ తర్వాత చంద్రబాబు అధికారం కోల్పోయిన తర్వాత జగన్ సీఎం అయ్యాక హైదరాబాద్ లో కేసీఆర్, జగన్ మధ్య నాలుగు సమావేశాలు జరిగాయన్నారు. ఈ సమావేశాల్లో రాయలసీమకు గోదావరి జలాల తరలింపునకు సహకరిస్తామని కేసీఆర్ ఆనాడే జగన్ కు హామీ ఇచ్చారని రేవంత్ చెప్పారు. కేసీఆర్, జగన్ మధ్య కుదిరిన ఒప్పందం మేరకే చంద్రబాబు ముందుకు వెళ్తున్నారని సీఎం అన్నారు. బనకచర్లను ప్రారంభిస్తామని ఏపీ అనగానే బీఆర్ఎస్ వ్యతిరేకిస్తోందన్నారు. తమ పార్టీ ఫస్ట్ నుంచి ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. గోదావరి జలాల్ని పెన్నా బేసిన్ కు, రాయలసీమకు తరలించడాన్ని బీఆర్ఎస్ ఆమోదించిందని సీఎం గుర్తు చేశారు. బనకచర్లను ఏపీ ప్రారంభిస్తామని ప్రకటించగానే తమ ప్రభుత్వం కేంద్ర జల్ శక్తి మంత్రిత్వశాఖకు ఫిర్యాదు చేసిన విషయాన్ని ప్రభుత్వం గుర్తు చేస్తోంది.
ఏపీ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన గోదావరి-బనకచర్లపై జూన్ 19న కేంద్ర జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్ కు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం ఫిర్యాదు చేసింది. ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులను కేంద్రం నిలిపివేస్తూ జూన్ చివర్లో ప్రకటించింది.

పవర్ పాయింట్ ప్రజెంటేషన్లతో ఏం సాధించారు?

నీటిపారుదల ప్రాజెక్టులపై ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, అధికార కాంగ్రెస్ పోటాపోటీగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు చేశాయి. నీటి పారుదల ప్రాజెక్టుల విషయంలో అధికార కాంగ్రెస్ ఏ రకంగా రాష్ట్రానికి నష్టం చేస్తోందో వివరించేందుకు బీఆర్ఎస్ ప్రయత్నించింది. తాము అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ప్రయోజనాలను కాపాడే ప్రయత్నం చేశామని తెలిపింది. తుమ్మిడిహెట్టి వద్ద కాకుండా మేడిగడ్డ వద్దకు ప్రాజెక్టును ఎందుకు మార్చాల్సి వచ్చిందో తమ వాదనను సమర్ధవంతంగా వినిపించింది. బీఆర్ఎస్ చేసిన ప్రయత్నాలకు కాంగ్రెస్ కూడా కౌంటర్ ఇచ్చింది. ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టు అంచనా వ్యయం కంటే ఎక్కువ ఖర్చుతో నిర్మించిన కాళేశ్వరంతో ఏం లాభమని అధికార పార్టీ ప్రశ్నించింది. కృష్ణా, గోదావరి నదీ జలాల వాటా విషయంలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు చేసుకున్న ఒప్పందాలే ఇప్పుడు కొంపముంచుతున్నాయని గులాబీ పార్టీపై అధికారపక్షం ఎదురుదాడికి దిగుతోంది. ఈ రెండు పార్టీలూ తమ వాదనలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లారు.

Exit mobile version