Krishna Pending Projects | కృష్ణా జలాల వాటాలపై బీఆరెస్‌, కాంగ్రెస్‌ షాడో ఫైటింగ్! ప్రాజెక్టులు మాత్రం పెండింగ్‌!

కృష్ణా జలాల్లో వాటాల విషయంలో కొట్లాడుకుంటున్న అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీఆరెస్‌ పార్టీల నేతలు.. అసలు విషయాన్ని పక్కన పెట్టి.. షాడో ఫైట్‌ చేస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నీటి వాటాలు ఉన్నా.. వాటిని వినియోగించుకునేందుకు తగిన ప్రాజెక్టులు ఏవని సాగునీటి నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ముందుగా పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేస్తే.. కేటాయింపుల మేరకైనా నీటిని నిల్వ చేసుకునే అవకాశం లభిస్తుందని సూచిస్తున్నారు.

krishna river pending irrigation projects water utilisation failure
Krishna Pending Projects | గత రెండు రోజులుగా టీవీ చానళ్లలో, పత్రికల్లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై అటు బీఆరెస్‌ నాయకులు, ఇటు కాంగ్రెస్‌ నాయకులు పోటాపోటీగా విమర్శలు చేసుకుంటున్నారు. మీరేం చేశారని ఒకరు ప్రశ్నిస్తే.. మీరు చేసింది ఏంటని మరొకరు దుమ్మెత్తుతున్నారు. నిజానికి కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా 299 టీఎంసీలు. అది తాత్కాలిక వాటా అయినా, శాశ్వత వాటా అయినా మొత్తానికి ఖరారు చేసిన కేటాయింపులే. కానీ.. చట్టపరంగా దక్కిన  ఈ నీటి వాటాను వినియోగించుకోవడంలో తెలంగాణ పాలకులు పూర్తిగా విఫలమయ్యారని సాగునీటిపారుదల నిపుణులు అంటున్నారు. తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు.. మీ పాలన తప్పంటే… మీ పాలనే తప్పంటూ ఒకరిపై మరొకరు ఘాటు విమర్శలు చేసుకుంటూ ప్రజలను పిచ్చివాళ్లను చేస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కృష్ణా జలాల వాడకం విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య షాడో ఫైట్‌ నడుస్తోందని అంటున్నారు.
2014-15 నీటి సంవత్సరం నుంచి 2024-25 నీటి సంవత్సరం వరకు ఏ ఒక్క ఏడాది కూడా తమకు కేటాయించిన జలాల్లో కనీసం 90 శాతం కూడా తెలంగాణ వినియోగించుకోలేదు. 2016-17 నీటి సంవత్సరంలో మాత్రమే 45.50 శాతం నీటిని వినియోగించుకున్నారు. ఇంకో విచిత్రమైన విషయం ఏమంటే.. ఏపీ పాలకులు ఏ ఒక్క నీటి సంవత్సరంలో కూడా 54.5 శాతానికి తక్కువ కాకుండా జలాలను సద్వినియోగం చేసుకుని ముందు వరుసలో ఉన్నారు. తద్వారా పచ్చటి పైర్లతో రైతులకు చేతినిండా పని కల్పిస్తున్నారు.
కృష్ణా నదిలో నీటి లభ్యత ఆధారంగా ఆంధ్రప్రదేశ్‌కు 512 టీఎంసీలు, తెలంగాణ కు 299 టీఎంసీల నీటి కేటాయింపులు తాత్కాలికంగా చేశారు. కేటాయింపులపై ఇప్పటికీ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌లో విచారణ కొనసాగుతున్నది. ఈ కేసు విషయాన్ని పక్కన పెడితే.. అసలు కేటాయింపుల ప్రకారం తెలంగాణ పాలకులు చర్యలు తీసుకున్నారా అంటే లేదనే సమాధానమే సర్వత్రా విన్పిస్తున్నది. ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావం తరువాత 2014–15 నీటి సంవత్సరంలో మొత్తం టీఎంసీలు 757.073 కాగా ఏపీ పాలకులు 529.330 టీఎంసీలు (69.91 శాతం) వాడుకోగా, తెలంగాణ 227.743 టీఎంసీలు (30.09 శాతం) వినియోగించుకున్నది.
కేటాయించిన దాని కన్నా ఎక్కువగా వినియోగించుకునేందుకు ఏపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున సాగునీటి ప్రాజెక్టులను చేపట్టింది. కానీ.. తెలంగాణలో మాత్రం పాలమూరు రంగారెడ్డి సహా కీలక పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేయకుండా నిర్లక్ష్యం వహించారని సాగునీటి నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో బాహుబలి మోటర్లను ఏర్పాటు చేశామని చెప్పుకొంటున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆ మోటర్లు ఎత్తిపోసే నీటిని పారించేందుకు కాలువలు, ఫీడర్ చానళ్లను పట్టించుకోలేదని అంటున్నారు. వేల కోట్లు ఖర్చు చేశామని చెప్పుకొంటున్న కేసీఆర్.. ఆయకట్టు వరకు నీరు పంపించకుండా ప్రాజెక్టు నిర్మించి లాభమేంటని రైతులు ప్రశ్నిస్తున్నారు.
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కృష్ణా నది జాలాల వినియోగం విషయంలో చిత్తశుద్ధితో పని చేయడం లేదన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే రెండేళ్ల కాలం గడిచిపోయింది. ఈ రెండేళ్ల వ్యవధిలో సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఎంతో చేయాల్సి ఉండగా, కొత్త ప్రాజెక్టుల సంగతి పక్కన పెడితే.. పెండింగ్ ప్రాజెక్టులను సైతం గాలికి వదిలేశారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.  భీమా (20 టీఎంసీలు), నెట్టెంపాడు (21.425 టీఎంసీలు), కల్వకుర్తి (40 టీఎంసీలు) ఇంకా పూర్తి కాలేదు. నల్లగొండ జిల్లా రైతులకు జీవనాడిగా మారాల్సిన శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్సెఎల్బీసీ) ఇంకా పూర్తి కాలేదు. 2027 నాటికి పూర్తి చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. 2.70 లక్షల ఎకరాల ఆయకట్టుకు, 516 గ్రామాలకు తాగునీరు అందించే ఎస్సెఎల్బీసీ విషయాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు పదేళ్ల పాటు పట్టించుకోకపోవడంతో పనులు పూర్తి కాలేదని నల్లగొండ జిల్లా రైతులు ఆరోపిస్తున్నారు. ఇక పోతే శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి 30 టీఎంసీల వరద నీటిని ఎత్తిపోసే భారీ లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టు డిండి. నల్లగొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లోని ఫ్లోరోసిస్, కరువు పీడిత ప్రాంతాలైన ఒక వేయి గ్రామాలకు తాగునీరు, 3.40 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే దీని లక్ష్యం. 2015లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు అప్పటి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. జూరాల వద్ద కృష్ణా నది నుంచి 70 టీఎంసీల నీటిని ఎత్తిపోయడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. వర్షాకాలంలో 60 రోజుల పాటు వరద ఉండే రోజుల్లో రూ.1.5 టీఎంసీల చొప్పున మొత్తం 90 టీఎంసీలను ఎత్తిపోయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఒక్క డిస్ట్రిబ్యూటరీ కాలువ నిర్మించకుండా, ఒక్క ఎకరాకు నీరు ఇవ్వకుండా 90 శాతం పనులు పూర్తయ్యాయని బీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకున్నదని కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తున్నారు. దీనికి రూ.27వేల కోట్లు ఖర్చు చేసి 35 శాతం పనులు మాత్రమే పూర్తి చేశారన్నారు. ఈ ప్రాజెక్టులను పూర్తి చేస్తే సుమారు 200 కు పైగా టీఎంసీలను వాడుకునే అవకాశం ఉంటుంది.
తెలంగాణలో కృష్ణా జలాలను పూర్తిగా వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున నిధులు సమకూర్చుకుని ముందుకు వెళ్లాల్సి ఉండగా, ఆ దిశగా పని చేస్తున్న సూచనలు ఏమాత్రం కన్పించడం లేదు. ఈ ప్రభుత్వం పని చేసేందుకు మరో రెండేళ్ల గడువు మాత్రమే మిగిలి ఉంది. మాజీ ముఖ్యమంత్రి కృష్ణా జలాల పై చేసిన విమర్శలకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి విమర్శలు చేయడం మినహా ఏమీ చేయడం లేదనేది ప్రజలకు తెలిసిపోయింది. ఇకనైనా మాటలకు పరిమితం కాకుండా పాలమూరు రంగారెడ్డితోపాటు.. ఇతర పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేయాల్సిన అవసరం ఉందని సాగునీటి నిపుణులు చెబుతున్నారు. ఈ పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేసుకుంటే సుమారు 300 టీఎంసీల నీళ్లు అందుబాటులోకి వస్తాయని గుర్తు చేస్తున్నారు. అది వదిలేసి, ఒకరిపై ఒకరు నెపం మోపుకోవడం, జలదోపిడీ అంటూ ఏపీపై పడి ఏడవటం వల్ల ఉపయోగం ఏమీ ఉండబోదని స్పష్టం చేస్తున్నారు. నిజానికి తెలంగాణ 299 టీఎంసీల నీటిని కేటాయించినా.. తగిన ప్రాజెక్టులు లేక వాటిని వాడుకునే అవకాశం దక్కలేదని చెబుతున్నారు. గత ఏడాది కాలం మంచిగా కావడంతో వాడుకునే అవసరమూ రాలేదని అంటున్నారు. ఈ కీలక అంశాలను పక్కన పెట్టి.. అధికార, ప్రతిపక్ష పార్టీలు షాడో ఫైట్‌ చేస్తున్నాయని విమర్శిస్తున్నారు.
ఈ కింది పట్టికను పరిశలిస్తే.. గత పదేళ్లలో తెలంగాణ ఎన్నడూ తనకు కేటాయించిన నీటిలో కనీస మొత్తాన్ని వినియోగించుకోలేదని అర్థం అవుతుంది.
ఇవి కూడా చదవండి..
Palamuru Rangareddy Lift | పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుపై కేసీఆర్‌, రేవంత్‌ దొందూ దొందే!!
Check Power : బిగ్ బ్రేకింగ్..ఉప సర్పంచ్ ల చెక్ పవర్ రద్దు..పునరుద్దరణ
Swiggy : భారతీయుల క్రేజీ ఫుడ్ బిర్యానీ..పదేళ్లుగా నెంబర్ వన్

Latest News