Krishna Water Dispute : బిగ్ టాపిక్..కృష్ణా బేసిన్‌లో 45 టీఎంసీల నీటిపై పొలిటికల్ వార్

కృష్ణా జలాల్లో 45 టీఎంసీల వాటాపై అసెంబ్లీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య యుద్ధం ముదిరింది. పాత జీవోలతో ఉత్తమ్ కౌంటర్ ఇవ్వగా, పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు సిద్ధమవ్వాలని రేవంత్ ఆదేశించారు.

Krishna water political war

విధాత: తెలంగాణ శాసన సభ శీతకాల ప్రారంభ సమావేశాలు కొనసాగుతున్న క్రమంలో కృష్ణా, గోదావరి నది జలాల్లో తెలంగాణ హక్కులు..ఏయే ప్రభుత్వాల హయాంలో ఎంత నీటి వాటాలు వాడుకున్నారు..ప్రాజెక్టుల పెండింగ్ కు కారణం ఎవ్వరన్నదానిపై అధికార, ప్రతిపక్ష పార్టీలు తీవ్ర కసరత్తు సాగిస్తున్నాయి. ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు బీఆర్ఎస్ హయాంలో 90టీఎంసీలు కేటాయిస్తే..కాంగ్రెస్ ప్రభుత్వం 45టీఎంసీలకే కేంద్రానికి లేఖ ఇచ్చిందంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తున్న క్రమంలో..ఇదే అంశంపై సభలో తమ వాదనలను వినిపించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ లు నీటి లెక్కల సేకరణలో కుస్తీ పడుతున్నాయి. తాజాగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కృష్ణా జలాల వినియోగంలో బీఆర్ఎస్ హయాంలో విడుదల చేసిన ఓ జీవోను బయటపెట్టి బీఆర్ఎస్ ను ఇరకాటంలోకి నెట్టే ప్రయత్నం చేశారు. ఆగస్టు 28, 2022న విడుదలైన జీవో 246 లో కృష్ణా బేసిన్ లో 45.66 టీఎంసీలనే వాడుతున్నట్లు పేర్కొనడాన్ని ఉత్తమ్ లేవనెత్తారు. కృష్ణా నది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు 45 టీఎంసీల వాటాకు ఒప్పుకుంది గత ప్రభుత్వమేనని మంత్రి ఉత్తమ్ ఈ జీవో ఆధారంగా ఆరోపించారు.

మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచనలు

నీటి లెక్కల విషయంలో మంత్రులంతా సంసిద్దంగా ఉండాలని..మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరూ కూడా శాసన సభ అటెండెన్స్ మిస్ కావద్దని..ప్రతిపక్షాలకు కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధం కావాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. జిల్లాల వారీగా మంత్రులు ప్రతిపక్షంపై ఎదురుదాడికి సిద్ధం కావాలని, ప్రతిపక్షం అడిగే ప్రతి అంశానికి సమాధానం ఇవ్వాలని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు, మంత్రులకు జనవరి 1న నీటి వాటాలు..హక్కులు..ప్రాజెక్టుల స్థితిగతులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో అవగాహాన కల్పించబోతున్నట్లుగా తెలిపారు. 2వ తేదీనే పాలమూరు రంగారెడ్డిపై పూర్తి స్థాయి చర్చ చేసేందుకు సిద్దం కావాలని రేవంత్ రెడ్డి సూచించినట్లుగా సమాచారం. సభలో చర్చ సందర్భంగా నీళ్ల లెక్కలు వివరించేందుకు..ప్రతిపక్షానికి సరైన సమాధానాలు చెప్పి ఎదురుదాడి చేసేందుకు ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతుండటం ఆసక్తికరం.

మాకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చాన్స్ ఇవ్వాలి

శాసనసభ సమావేశాల్లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు సహా నదీ జలాలకు సంబంధించిన అంశాలపై బీఆర్ఎస్ పార్టీ తరఫున పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి అవకాశమివ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సోమవారం స్పీకర్‌కు వినతిపత్రం అందించారు.

ఇవి కూడా చదవండి :

Revanth Reddy : కేసీఆర్ ను కలవడం ఇది రెండోసారి
Beerla Ilaiah : పదవి..జీతం కోసం కేసీఆర్ సభకు వచ్చి వెళ్లాడు : బీర్ల ఐలయ్య

Latest News