Mulugu Politics | ములుగు జిల్లా రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. అధికార కాంగ్రెస్ విపక్ష బీఆర్ఎస్ మధ్య మాటలు.. మంటలు పుట్టిస్తున్నాయి. దశాబ్ధ కాలంగా ములుగులో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఉప్పూనిప్పూ అనే తీరుగా రాజకీయాలు కొనసాగుతున్నాయి. తాజా పరిస్థితి మరింత హాట్ హాట్ గా మారింది. ఏడాదిన్నర క్రితం జరిగిన ఎన్నికల్లో సీతక్క మరోసారి విజయం సాధించి రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం పొందారు. కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకోగా ముచ్చటగా మూడోసారి అధికారంపై ఆశపెంచుకున్న బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది. రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగినా ములుగులో మాత్రం రెండు పార్టీల మధ్య వైరం పచ్చగడ్డివేస్తే భగ్గుమనే పరిస్థితి కనిపిస్తోంది. ఈ అగ్నికి తాజాగా జీవో 49 మరింత ఆజ్యం పోసింది. ఇదే సమయంలో ఈ జీవో పై మావోయిస్టు పార్టీ స్పందించడం, అందులో మంత్రి సీతక్కను బాధ్యురాలిగా పేర్కొనడంతో జిల్లాలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య నెలకొన్న విభేదాలు తీవ్ర రూపం దాల్చాయి. ప్రత్యర్థి పార్టీగా ఉన్న బీఆర్ఎస్ కు కాంగ్రెస్ పైన, సీతక్క మీద విమర్శలు చేసేందుకు ఊతమిచ్చింది.
జీవోను, మావోయిస్టు ప్రకటనను తమకు అనుకూలంగా మార్చుకుని కాంగ్రెస్ పార్టీ పై, మంత్రి సీతక్క పై పత్రికల్లో, సోషల్ మీడియాలో తమదైన పద్ధతిలో తీవ్ర విమర్శలు చేశారు. తాజాగా శుక్రవారం జిల్లాలో పర్యటించిన మంత్రి సీతక్క మావోయిస్టుల ప్రకటనతో పాటు జీవో 49 మీద, ప్రత్యర్థి రాజకీయం పై తీవ్రంగా ప్రతిస్పందించారు. విపక్ష బీఆర్ఎస్ పార్టీ పై విరుచుకపడ్డారు. మావోయిస్టు పార్టీ వాస్తవాలు తెలుసుకుని స్పందించాలని మంత్రి తనదైన పద్ధతిలో సమాధానమిచ్చారు. మావోయిస్టు పార్టీ ప్రకటనపై అనుమానాలు వ్యక్తం చేశారు. వాస్తవమైనదా? మరెవరైనా విడుదల చేశారా? అంటూ సందేహాన్నివెలిబుచ్చారు. 49 జీవో పై మావోయిస్టు పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ పేరుతో రెండు రోజుల క్రితం ప్రకటన విడుదలయింది. జీవో వల్ల జరిగే కష్టనష్టాలను ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అందులోనే మంత్రి సీతక్కను ప్రశ్నించారు. ఈ మేరకు కొన్ని విమర్శలు చేయడమే కాకుండా ఆదివాసీలకు జరుగుతున్న అన్యాయానికి ఆమె బాధ్యత వహించాలంటూ స్పష్టం చేశారు.
మావోయిస్టు ప్రకటన.. ఇప్పుడు ములుగులో రాజకీయ దుమారానికి హేతువుగా మారింది. కొందరు తమ రాజకీయ ప్రయోజనాలు పరిరక్షించుకునేందుకూ, రానున్న రోజుల్లో లాభం పొందెందుకు ఈ ప్రకటనకు మరికొన్ని జోడించి ప్రచారం చేయడంతో మంత్రి సీతక్క తీవ్రంగా మండిపడ్డారు. అయితే, కాంగ్రెస్, బీఆర్ఎస్ మద్య తీవ్రవిభేదాలు రాష్ట్రంలో దశాబ్దాలుగా ములుగు నియోజకవర్గంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య వైరం తీవ్రంగానే కొనసాగుతోంది. 2014 శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాల్లో టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన సీతక్క 2018లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2018లో రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నా కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేగా సీతక్క విజయం సాధించడం ఆపార్టీకి ఇష్టంలేకుండేది. ఎమ్మెల్యేగా సీతక్క అధికారిక కార్యమాల్లో భాగస్వామ్యం కావడం అప్పటి బీఆర్ఎస్ ముఖ్యనేతలకు గిట్టకపోయేది.
ఈ అక్కసును అప్పటి కొందరు ముఖ్య నేతలు బహిరంగంగానే వ్యక్తపరిచిన సందర్భాలున్నాయి. 2023 ఎన్నికల్లో తిరిగి సీతక్క గెలుపొంది మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో మంత్రి సీతక్కతో పాటు కాంగ్రెస్ పార్టీ పై బీఆర్ఎస్ విరుచుకపడుతోంది. అవినీతి ఆరోపణలు, సంక్షేమ పథకాల్లో అక్రమాలంటూ రాజకీయ ఎత్తుగడలు ప్రదర్శిస్తున్నారు. ఈ నేపత్యంలో విడుదలైన మావోయిస్టుల ప్రకటన ప్రత్యర్థులకు ఆయుధంగా మారింది. మావోయిస్టుల ప్రకటనతోపాటు విమర్శలు చేసిన ప్రత్యర్థి పార్టీలపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. అది మావోయిస్టుల లేఖా లేక తానంటే గిట్టని వాళ్లు కుట్ర పూరితంగా సృష్టించిన లేఖా..అనేది తేలాల్సి ఉందన్నారు. ఆ లేఖను ముందుపెట్టి కొందరు తనపై రాజకీయ కక్షను వెళ్లగక్కుతున్నారని మండిపడ్డారు. మంత్రి స్పందనకు ప్రతిపక్షాలతో పాటు మావోయిస్టు నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. మొత్తానికి ములుగు జిల్లాల్లో రాజకీయాలు గరంగా మారడంతో జిల్లా ప్రజల్లో చర్చలు మొదలయ్యాయి.