Political Defections | ‘ఫిరాయింపుల’ చదరంగం.. ప్రశ్నార్ధకమైన నిబద్ధతలు

ఫిరాయింపులకు చెక్ పెట్టాలంటే పార్టీలు, ప్రజాప్రతినిధులు నైతికతకు కట్టుబడి ఉండాలని సూచిస్తున్నారు. చట్టం కూడా లోటుపాట్లకు తావివ్వకూడదని భావిస్తున్నారు. పార్టీ మారిన మరుక్షణమే అనర్హులుగా మారే విధానం రావాలంటున్నారు. కానీ, అధికారం కోసం అక్రమమార్గాలను అన్వేషించే పార్టీలు, నాయకులు తమ చిత్తశుద్ధిని కనబరుస్తాయా? అనేదే ప్రధాన ప్రశ్న.

Political Defections | విధాత ప్రత్యేక ప్రతినిధి: అధికారం కోసం రాజకీయ పార్టీలు అడ్డదారిలో గడ్డికరుస్తున్నాయి. ఫిరాయింపులకు ప్రధాన రాజకీయ పార్టీల్లో ఏవీ తక్కువ తినలేదు. స్థాయీభేదాలు పక్కనబెట్టి ఈ ఫిరాయింపుల పర్వం కొనసాగిస్తున్నారని, పార్టీలలో నిజాయతీ లోపం వల్ల ఈ దుష్ట సంప్రదాయానికి ఇటీవల తెరపడే అవకాశం లేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అధికార చదరంగంలో ఫిరాయింపులను ఒక ఆటగా మార్చేశారు. రాజకీయ డ్రామాగా తీర్చిదిద్దడంతో ఓటేసిన ప్రజలు అవహేళనకు గురవుతున్నారు. పార్టీ ఏదనేది పక్కనపెడితే దాదాపు అన్ని పార్టీలు ‘అధికార కోసం’ ఈ ఆటను సమయూనుకూలంగా ఆడుతున్నాయి. ఒక పార్టీలో ఎన్నికై పక్క పార్టీలోకి జంప్ చేసి, తనను బలపరిచిన ఓటర్లను అవమానిస్తున్నారు. మరి కొందరు అధికార అందలం, ఆర్ధికంగా లాభం, అవినీతి, అక్రమాలకు తలొగ్గి తమ స్థాయిని తామే దిగజార్చుకుంటున్నారు. సమాజంలో మాత్రం అధికార దర్పం వెలగబెడుతూ ‘ఉన్నతులు’గా చెలామణి కావడం దురదృష్టంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.

రాజకీయ పార్టీలు పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి, నిబద్దత, నైతికతకు ప్రాధాన్యం ఇవ్వనంత కాలం ఈ ఫిరాయింపులు కొనసాగుతాయని గతాన్ని, తాజా పరిస్థితిని పరిశీలించిన పెద్దలు ఆవేదనతో చెబుతున్నారు. రాజీవ్ ప్రధానిగా ఉన్నప్పుడు ఫిరాయింపుల నిరోధానికి చేసిన చట్టమిప్పుడు అమలులో డొల్లతనంగా మారిందంటున్నారు. చట్టంలోని లోపాలను, స్పీకర్‌కు ఉండే విచక్షణాధికారాన్ని ఉపయోగించుకుని జంపింగ్ జపాంగులు అనర్హత వేటు నుంచి తప్పించుకుంటున్నారు. స్పీకర్ స్థానానికి ఉండే గౌరవానికి అధికార పార్టీలు తలవంపులు తెస్తూ ప్రజలకు మాత్రం నీతులు చెబుతున్నారని రాజకీయ పరిశీలకులు మండిపడుతున్నారు.

తెలంగాణ ఉద్యమసమయంలో నిబద్ధత

తెలంగాణ సాధన కోసం అనేక మంది నాయకులు, ప్రజాప్రతినిధులు అప్పటి వరకు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలను కాలదన్ని ఉద్యమపార్టీగా చెప్పుకున్న టీఆర్ఎస్‌లో (తదుపరి బీఆరెస్‌) చేరారు. ఉద్యమసమయంలో ఎమ్మెల్యేల పదవులను త్యజిస్తూ పదేపదే ఉప ఎన్నికలకు సిద్ధమైన సందర్భంలో ఈ ఫిరాయింపుల నైతికతపైన విస్తృత చర్చ సాగింది. బీఆరెస్‌ నాయకత్వం రాజకీయ కమిట్‌మెంట్‌కు ప్రాధాన్యం ఇస్తున్నదని భావించారు. ముఖ్యంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచిన డాక్టర్ రాజయ్యలాంటివారు అధికార పార్టీని వీడి బీఆరెస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం గొప్ప విషయంగా చర్చసాగింది. తర్వాత ఉప ఎన్నికల్లో పోటీపడ్డారు. ఆ ఎన్నిక సందర్భంగా రాజయ్య ఎదురీదినా.. చివరికి విజయం సాధించారు. ఈ విలువల విధానం కొనసాగుతుందని పలువురు ఆశించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పలువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకొన్నారు. దీనిపై నాడు టీఆరెస్‌ తీవ్రంగా ఆక్షేపించింది. ఈ సమయంలో వైఎస్ పైన పలువురు రాజకీయవాదులు, ఉద్యమ శ్రేయోభిలాషులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు తర్వాత కాలంలో రాజకీయ భవిష్యత్తు లేకుండా చేశారు. దాదాపు వీరిలో అందరూ ఇప్పుడు జీవించిలేకపోవడం యాదృచ్ఛికం.

కొత్త రాష్ట్రంలో ఆశలు గల్లంతు

కొత్తగా ఏర్పాడిన తెలంగాణ రాష్ట్రంలోనూ పాత రోత రాజకీయమే కొనసాగడం పట్ల పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనేక ప్రజాపోరాటాలకు, చైతన్యానికి ప్రతీకగా చెప్పుకొంటూ, సుదీర్ఘ ఉద్యమం ద్వారా సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలోనైనా విలువలతో కూడిన రాజకీయానికి కనీస పాదులు పడుతాయని ఆశించారు. ప్రజాస్వామిక, పార్టీ కట్టుబాటు విధానాలతో రాజకీయాలు ఉన్నంతంగా సాగేందుకు పునాదులు పడుతాయని పలువురు ప్రజాస్వామిక ప్రియులు అభిలషించారు. కొత్త విధానాలకు, కనీస విలువలకు తెలంగాణ రాష్ట్రం, దేశానికి ప్రమాణానికంగా నిలుస్తుందనే ఆశ తొలి నాళ్లలోనే నీరుగారిపోయింది. తెలంగాణ ఉద్యమ సమయంలో తమ పార్టీ ఎమ్మెల్యేలకు నాటి వైఎస్ ప్రభుత్వం వల వేసినప్పుడు అనుభవించిన రాజకీయ అవస్థ.. టీఆరెస్‌ మర్చిపోయేది కాదు. ఆ అనుభవంలో ఉన్నందున కేసీఆర్ ఆ తప్పుడు పద్ధతికి తెరతీయరనే ఒక గట్టి అభిప్రాయముండేది. కానీ, అధికారం వచ్చేంత వరకే నీతులు, విలువల మాటలని కేసీఆర్ మరోమారు నిరూపించారు. తమది ఫక్తు రాజకీయ పార్టీగా ప్రకటించుకుని, మిగిలిన పార్టీల విధానమేనని తేల్చిచెప్పారు.

ఫిరాయింపులకు జైకొట్టిన బీఆరెస్‌

రాష్ట్రంలో అధికారంలోకి బీఆరెస్‌ వచ్చింది. ఎన్నికలకు ముందే ఇప్పటి నుంచి తమ పార్టీ ‘ఫక్తు రాజకీయ పార్టీ’ అంటూ ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించినపుడు అందరికీ అర్ధం కాలేదు. కానీ, అధికారంలోకి వచ్చిన కొద్దికాలానికే అప్పటి ప్రధాన ప్రతిపక్ష పార్టీకి చెందిన కాంగ్రెస్, టీడీపీ, ఇండిపెండెంట్, సీపీఐ ఎమ్మెల్యేలను సామ దాన భేద దండోపాయాలతో గులాబీకి గూటికి చేర్చుకోవడం ప్రారంభించారు. దీంతో ఫక్తు రాజకీయ పార్టీ గూఢార్ధం తేలిపోయింది. ఈ ఫిరాయింపుల కోసం ప్రత్యేకంగా అప్పటి మంత్రి హరీశ్‌ రావును కేటాయించారు. ఈ పనిచేయడంలో కళాత్మకంగా వ్యవహరిస్తున్నారని ఆయనకు గొప్ప కితాబునిస్తూ ‘ఆపరేషన్ ఆకర్ష్’ అంటూ జంపింగ్ పాలిటిక్సు ప్రారంభించారు. అప్పుడే కొత్త రాష్ట్రంలో పాత రోత తప్పదనే చర్చ ప్రారంభమైంది. తొలిసారి అధికారంలోకి వచ్చిన బీఆరెస్‌ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలు సాగుతున్నాయని, దీనిని అడ్డుకోవడానికి ఈ ఫిరాయింపులు సాగుతున్నాయని కొందరు రాజముద్ర వేశారు. రెండవసారి అధికారం చేజిక్కగానే కేసీఆర్ రంగు బహిరంగమైంది. తర్వాత పట్టపగ్గాలు లేకుండా పోయాయి. కావాల్సినంత మెజార్టీ ఉన్నా ప్రతిపక్ష పార్టీ అనేది ఉండకూడదనే ఏకపక్ష, ఆధిపత్య విధానాలు అవలంబించడంతో కేసీఆర్ తీరు, టీఆర్ఎస్ విధానం తేటతెల్లమైపోయాయి. కాకుంటే ఈ జంపింగ్ జాపాంగులకు ‘విలీన’మనే ముద్దుపేరు తగిలించేందుకు చెమటోడ్చారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ఏకపక్ష విధానాలు సాగుతున్నప్పటికీ, ఉప ఎన్నికల్లో వరుస విజయాలు సాధిస్తున్నా నైతికత కోసం కూడా పార్టీ ఫిరాయించిన ఏ ఎమ్మెల్యే తమ పదవులకు రాజీనామా చేయకపోవడం గమనార్హం.

అప్పుడు బీఆర్ఎస్ పైన విమర్శలు

పదేళ్ళు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన కేసీఆర్‌పై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. రాజకీయ పరిశీలకులు ఈ తీరును తప్పుపట్టారు. ముఖ్యంగా అప్పటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫిరాయించిన ఎమ్మెల్యేలను రాళ్ళతో కొట్టాలని పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో ఈ విషయాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అదేంటోగానీ, ఒకరో, ఇద్దరో మినహా ఈ జంపింగ్ ఎమ్మెల్యేలంతా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు.

ఫిరాయింపులు ముద్దంటున్న రేవంత్

కేసీఆర్ పదేండ్ల పాలనకు కాంగ్రెస్ చరమగీతం పాడింది. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే తిరిగి ఫిరాయింపుల చదరంగం ఆటను కాంగ్రెస్ ప్రారంభించింది. ప్రధాన ప్రతిపక్షంగా పాత్రమారిన బీఆర్ఎస్‌కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు, పలువురు ఎమ్మెల్సీలు దఫాలుగా కాంగ్రెస్ తీర్ధంపుచ్చుకున్నారు. పాత నాటకానికి ‘మూడు రంగు’లద్దారు. ఇప్పుడు నీతులు వల్లించడం, ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిందంటూ పెద్దపెద్ద మాటలు వల్లించడం బీఆర్ఎస్ వంతైంది. తాము విలీనం చేసుకున్నాం.. వీరు చేర్చుకుంటున్నారంటూ నైతికతలేని మాటలు వల్లెవేస్తున్నారు. కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలిప్పుడు గత బీటీ బ్యాచ్ తరహా అభివృద్ధి సుభాషితాలు చెబుతుండగా కాంగ్రెస్ నేతలు మాత్రం ఎదురుదాడి చేస్తున్నారు. ఈ ఫిరాయింపుల అంశం హైకోర్టు, సుప్రీం కోర్టు వరకు చేరింది. మూడు నెలల్లో ఈ ఫిరాంపు ఎమ్మెల్యేల భవిష్యత్తు తేల్చాలని తాజాగా స్పీకర్‌కు సూచించింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ ఏ విధంగా స్పందిస్తోందనే ఆసక్తి పెరిగింది. కాంగ్రెస్ పార్టీ ఈ తాజా నిర్ణయం పైన ఏ నిర్ణయం తీసుకుంటుందోననే చర్చసాగుతోంది. కోర్డు నిర్ణయంతో ఇప్పుడు బాల్ స్పీకర్ పరిధిలోకి వచ్చిచేరింది. ఇప్పుడు ఫిరాయింపులు హాట్ టాపిక్‌ మారింది.

కోర్టు తీర్పు నేపథ్యంలో తాము గతంలో చేసిందంతా మర్చిపోయిన బీఆర్ఎస్ నాయకులు ఉప ఎన్నికలొస్తాయని ఊదరగొడుతున్నారు. పార్టీ మారిన వారిని స్పీకర్ అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. స్పీకర్ పైన ఒత్తిడితెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ విశేషమేమిటంటే గత సర్కారులో స్పీకర్‌ బాధ్యతలు నిర్వహించిన పోచారం శ్రీనివాసరెడ్డి ఇప్పుడు ఫిరాయించిన జాబితాలో చేరిపోవడం. వాస్తవానికి రాజకీయ పార్టీల పరిధిదాటి స్పీకర్లు స్వతంత్రంగా వ్యవహరించే పరిస్థితిని కల్పించారా? అనే ప్రశ్నలిప్పుడు ఉత్పన్నమవుతున్నాయి. ఈ ఫిరాయింపులకు చెక్ పెట్టాలంటే పార్టీలు, ప్రజాప్రతినిధులు నైతికతకు కట్టుబడి ఉండాలని సూచిస్తున్నారు. చట్టం కూడా లోటుపాట్లకు తావివ్వకూడదని భావిస్తున్నారు. పార్టీ మారిన మరుక్షణమే అనర్హులుగా మారే విధానం రావాలంటున్నారు. కానీ, అధికారం కోసం అక్రమమార్గాలను అన్వేషించే పార్టీలు, నాయకులు తమ చిత్తశుద్ధిని కనబరుస్తాయా? అనేదే ప్రధాన ప్రశ్న.