మొన్న వికసిత్‌ భారత్‌ నేడు విద్వేష వ్యాఖ్యలు

'కాంగ్రెస్‌ది ముస్లిం మ్యానిఫెస్టో, కాంగ్రెస్‌కు ఓటేస్తే హిందువుల పుస్తెల తాళ్లు కూడా లాక్కొని ముస్లింల‌కు దోచిపెడుతుంది. దేశ బ‌డ్జెట్‌లో 15 శాతం ముస్లింల‌కు ఇవ్వాల‌ని కాంగ్రెస్ కుట్ర చేస్తున్న‌ది

  • Publish Date - May 21, 2024 / 10:07 AM IST

‘కాంగ్రెస్‌ది ముస్లిం మ్యానిఫెస్టో, కాంగ్రెస్‌కు ఓటేస్తే హిందువుల పుస్తెల తాళ్లు కూడా లాక్కొని ముస్లింల‌కు దోచిపెడుతుంది. దేశ బ‌డ్జెట్‌లో 15 శాతం ముస్లింల‌కు ఇవ్వాల‌ని కాంగ్రెస్ కుట్ర చేస్తున్న‌ది. కాంగ్రెస్‌ది మావోయిస్టుల అజెండా. ఆ పార్టీ మ్యానిఫెస్టో మావోయిస్టుల డాక్యుమెంట్‌లా ఉన్న‌ది. కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తే గుళ్ల‌లోని బంగారాన్నంతా దోచుకొంట‌ది. మ‌హిళ‌ల మెడ‌ల్లోని మంగ‌ళ‌సూత్రాల‌ను గుంజుకుంటుంది. మావోయిస్టుల ఎజెండాతో ఉన్న కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తే దేశాన్ని దివాళా తీయిస్త‌ది.’ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ విపక్ష పార్టీపై చేస్తున్న విమర్శలు ఇవి.

పదేళ్లు అధికారంలో ఉన్న బీజేపీ దేశానికి ఏం చేసిందో చెప్పడం లేదు. 2014 ఎన్నికలకు ముందు గుజరాత్‌ మోడల్‌ అన్న అంశాన్ని ఇప్పుడు ప్రస్తావించడం లేదు. అవినీతిరహిత పాలన అందిస్తామని, విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తాన్న మోడీ మాటలు ఆచరణలో అమలు కాలేదు. ఆయన హయాంలోనే అనేక మంది బ్యాంకులను ముంచి విదేశాలకు పారిపోయారు. నల్లధనాన్ని తీసుకురాలేదు, కనీసం బ్యాంకులను ముంచిన వాళ్లనైనా స్వదేశానికి రప్పించి చట్ట ప్రకారం వాళ్లపై చర్యలు తీసుకోలేదు. కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి అన్నట్టు ప్రియాంక గాంధీ అన్నట్టు భారత్‌లో ఎన్నికలు జరుగుతుంటే పాకిస్థాన్‌ ప్రస్తావనను ప్రధాని ఎందుకు తీసుకొస్తున్నారన్న దానికి స్పష్టమైన సమాధానం లేదు.

మత ప్రాతిపదిక ఏర్పడిన దేశాలు కావొచ్చు, ప్రజా సమస్యలను పక్కనపెట్టి మతమే అజెండాగా రాజకీయాలు చేస్తే ఆ దేశాల ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందో, రాజకీయ సంక్షోభం ఎలా ఉంటుందో? పాకిస్థాన్‌, అఫ్ఘనిస్తాన్‌లే ఉదాహరణ కళ్ల ముందు కనిపిస్తున్నది. మోడీ నాయకత్వంలోనే ప్రపంచంలోనే ఐదో ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది అని గొప్పలు చెప్పుకున్న ఆపార్టీ త్వరలో అమెరికా, చైనా తర్వాత అతిపెద్ద మూడో ఆర్థికవ్యవస్థగా ఎదుగుతుంది అని చెప్పిన పార్టీ ఎన్నికల సమయంలో మతాన్ని మాత్రమే ముందుపెట్టి ఓట్లు అభ్యర్థించడం, హిందువుల ఓట్ల మనతో ఏ రకంగా పోల్చుకోలేని పక్క దేశాన్ని ప్రస్తావించడమూ మోడీ నాయకత్వ ఘనతగానే చెప్పుకోండి.

పదేళ్ల పాలనా వైఫల్యాలకు అద్దం పడుతున్న సూచీలు

పదేళ్ల కిందట అంటే 2014లో రూ. 54 ఉన్న పెట్రోలు ధర 2024 నాటికి రూ. 100పైగా పెరిగింది. రూ. 400 ఉన్న గ్యాస్‌ సిలిండర్‌ ధర ఇప్పుడు రూ. 900 దాటింది. 7.98 శాతం ఉన్న నిరుద్యోగ రేటు 10 శాతానికి పైగా చేరుకున్నది. రూపాయితో డాలర్‌ విలువ రూ. 63.33 నుంచి రూ. 83 .39 పైసలకు పడిపోయి జీవితకాల కనిష్ఠానికి పడిపోయింది. పత్రికా స్వేచ్ఛలో 140/180 నుంచి 161/180 స్థానంలో నిలిచింది. ప్రపంచ ఆకలి సూచీలో 55/125 నుంచి 111/125 స్థానంలో ఉన్నది. అవినీతి సూచీలో భారత్‌ 85/180 నుంచి 93/180 స్థానానికి దిగజారింది. పదేళ్ల మోడీ పాలనా వైఫల్యాలకు ఈ సూచీలు అద్దం పడుతున్నాయి.

ఈ పదేళ్ల కాలంలో పెరిగిన ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయకుండా, నిరుద్యోగాన్ని నిర్మూలించకుండా, ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా, కేంద్రంలో ఖాళీగా 10 లక్షలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేయకుండా, దేశంలో ఇప్పటికీ ఎక్కువ శాతం మందికి ఉపాధి కల్పిస్తున్న వ్యవసాయ రంగాన్ని అభివృద్ధికి చర్యలు చేపట్టకుండా మతం, పదేళ్ల కిందట అధికారం కోల్పోయి ప్రతిపక్షంలో ఉన్న పార్టీ గురించే చెప్పుకుంటూ 2024లోనూ మోడీ ప్రచారం చేయడం చూస్తుంటే ఆయన అధికారం కోసం ఏస్థాయికి దిగజారి విమర్శలు చేస్తున్నారో ఆయన ప్రచారంలో చేస్తున్న వ్యాఖ్యలు చూస్తే అర్థమౌతున్నది.

మార్పునకు ఆ వ్యాఖ్యలే కారణం

ప్రపంచంలో ఎన్నో దేశాలున్నా భిన్నత్వంలో ఏకత్వమే మన దేశ బలం. అదే మన దేశాన్ని ప్రపంచ యవనికపై సమూన్నతంగా నిలబెట్టింది. అహింసా మార్గంలోనే స్వాతంత్రం సాధించిన దేశంగా చరిత్రలో నిలిచింది. అలాంటి ఈ దేశ ఔన్నత్యాన్ని, కీర్తిని తగ్గిస్తున్నది ఎవరు? అన్నది పదేళ్ల కాలంలో ప్రజలకు అవగతమైంది. పదేళ్ల కిందట చెప్పిన అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన వారు ఇప్పుడూ అదే విధానాన్ని కొనసాగిస్తున్నారు. బీజేపీ నేతలు చెబుతున్నట్టు అసత్యాలకు కాలం చెల్లింది. ప్రపంచీకరణ తర్వాత ప్రపంచమే కుగ్రామంగా మారింది. అన్ని దేశాల్లో భారతీయులు నివసిస్తున్నారు. ఆయా దేశాలు మన సంస్కృతిని గౌరవిస్తున్నాయి.

బతుకుదెరువు కోసం వెళ్లిన వాళ్లకు భద్రత కల్పిస్తున్నది. బీజేపీ నాయకురాలు నుపూర్‌శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వల్ల అరబ్‌ దేశాలు తప్పుపట్టాయి. చివరికి దానికి కేంద్రం క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ఇలాంటి ఓటు బ్యాంకు కోసం విద్వేష రాజకీయాల వల్ల ఎంత నష్టం జరుగుతుందో బీజేపీ నేతలు ఆలోచించడం లేదు. అందుకే కాలం మార్పు కోరుకుంటుంది అన్నట్టే ఈసారి సార్వత్రిక ఎన్నికల్లోనూ దేశ ప్రజల మార్పేవైపే చూస్తున్నట్లు ఇప్పటివరకు జరిగిన పోలింగ్‌ సరళిని బట్టి తెలుస్తోంది. ఎన్నికల షెడ్యూల్‌కు ముందు వికసిత్‌ భారత్‌ అని నినదించిన ప్రధాని సహా బీజేపీ నేతలు ఎన్నికల ప్రచారంలో విద్వేష వ్యాఖ్యలు చేస్తుండటమే మార్పునకు ఒక కారణం అనే అభిప్రాయం ఉన్నది.

Latest News