Site icon vidhaatha

AP | మార్పుకే ఏపీ ఓటు?.. రికార్డుస్థాయిలో ఓటింగ్‌ నమోదు

తుది లెక్కల్లో మరింత పెరిగే చాన్స్‌
సందడిగా వచ్చి ఓటేసిన ప్రజలు
సర్కారును దెబ్బకొట్టాలనే కసితోనే!
ప్రభుత్వ వ్యతిరేకతతోనే భారీ ఓటింగ్‌
వరుసగా మూడోసారీ రుజువు
ప్రతిసారీ ఓడిపోయిన అధికార పార్టీ
ఇప్పుడూ అదే జరుగనుందా?
రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు
నాలుగు దశల ఎన్నికల్లో ఏపీనే టాప్‌
రీపోలింగ్‌కు ఎక్కడా ప్రతిపాదనలు రాలేదు
ఎస్‌ఈవో ముఖేష్ కుమార్ మీనా వెల్లడి

(విధాత ప్రత్యేకం)

ఏపీలో భారీగా పోలింగ్‌ నమోదు కావడం ఎవరి కొంప ముంచుతుందనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతున్నది. మే 13న ముగిసిన పోలింగ్‌లో.. ఓటింగ్‌ శాతం రికార్డుస్థాయిలో 81.86గా నమోదైంది. ఇది గత ఎన్నికల కంటే ఎక్కువ. 2019 ఎన్నికల్లో 80.38 శాతం నమోదైంది. ఇప్పుడు అది పెరిగి, 81.86 శాంతంగా ఉన్న‌ది. ఇదే కాదు.. 2014లో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా 78.96శాతం పోలింగ్‌ రికార్డయింది. ఈ మూడు సందర్భాల్లోనూ ఓడిపోయింది అధికార పార్టీలే.

రాష్ట్ర విభజన అనంతరం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓడిపోయి, ఏపీలో తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. తర్వాతి ఎన్నికల్లోనూ జరిగిన భారీ ఓటింగ్‌.. టీడీపీని అధికారం నుంచి దించి.. వైసీపీని గద్దెనెక్కించింది. ఇప్పుడు మరోసారి భారీ స్థాయిలో పోలింగ్‌ నమోదైంది. ఇది ప్రభుత్వ పతనానికి ఒక సంకేతంగా గత ట్రెండ్‌ ఆధారంగా చెబుతున్నారు.

గత ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా ఏపీలో పోలింగ్‌ కేంద్రాలు జాతరను తలపించాయి. భారీగా సమీకరణలు జరిగాయి. ఎక్కడెక్కడి నుంచో ప్రజలు ఏపీకి వెళ్లి ఓటేశారు. ఇక్కడ ఓటు హక్కు కలిగి ఉండి, విదేశాల్లో ఉన్నవారు సైతం విమానాలెక్కి వచ్చి మరీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. బహుశా దేశ ఎన్నికల చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా 4.4 లక్షలమంది పోస్టల్‌ బ్యాలెట్లు ఉపయోగించుకున్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా 4,44,216 మంది వేసిన ఓట్లు ప్రభుత్వ వ్యతిరేకమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సాధారణ స్థాయిలో పోలింగ్‌ జరిగితే ఫలితాలు అటా ఇటా? అన్నట్టు ఉంటాయి. కానీ.. ఓటర్లలో నిరాసక్తత లేదా ఓటు వేయాలన్న కసి కలిగిందంటే అధికార పార్టీకి మూడినట్టేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉన్న సమయాల్లోనే ఇటువంటి భారీ ఓటింగ్‌ నమోదుతుందని అంటున్నారు. అందుకు నిదర్శనంగా గత మూడు పర్యాయాలుగా ఏపీలో నమోదైన భారీ ఓటింగ్‌ శాతాలను వారు ఉదహరిస్తున్నారు.

అయితే.. వైసీపీ నేతలు మాత్రం విజయం తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇంత భారీ పోలింగ్‌ తమకే అనుకూలమని నమ్మబలుకుతున్నారు. జగన్‌ పట్ల అభిమానంతో, ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలన్న తపనతోనే ప్రజలు ఉవ్వెత్తున కదిలి వచ్చి ఓటు వేశారని చెబుతున్నారు. ఒక వేళ జగన్‌ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ఏపీ ప్రజలు పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొన్నారని తేలితే మాత్రం గత ట్రెండ్స్‌కు భిన్నంగానే ఫలితాలు ఉంటాయని పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

 

ఏపీలోనే అత్యధిక పోలింగ్‌

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 81.86 శాతం పోలింగ్ నమోదైందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) ముకేశ్ కుమార్‌ మీనా తెలిపారు. ఈవీఎంల ద్వారా 80.66 శాతం, పోస్టల్ బ్యాలెట్ ద్వారా 1.2 శాతం పోలింగ్ నమోదైందని చెప్పారు. బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో తుది పోలింగ్ శాతం వివరాలను ఆయన వెల్లడించారు. ఇప్పటిదాకా జరిగిన నాలుగు దశల లోక్‌సభ ఎన్నికల్లో ఏపీలోనే అత్యధిక పోలింగ్ జరిగిందని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో 3,33,04,560 మంది ఓటు వేశారన్నారు. కొంతమంది అసెంబ్లీకి ఓటు వేసి పార్లమెంటుకు వేయలేదని తెలిపారు.

గతంలో కంటే ఈసారి పోలింగ్ 2.09 శాతం పెరిగిందని మీనా తెలిపారు. 3500 కేంద్రాల్లో సాయంత్రం 6 గంటలు దాటాక కూడా పోలింగ్ కొనసాగిందని చెప్పారు. ఆఖరి పోలింగ్ కేంద్రంలో రాత్రి 2 గంటలకు ఓటింగ్ ముగిసిందని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈవీఎంలన్నీ 350 స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచామన్నారు. కొన్నిచోట్ల వర్షం వల్ల పోలింగ్ ఆలస్యమైందని చెప్పారు. అబ్జర్వర్లంతా పరిశీలన చేశారని.. రీపోలింగ్ ఆవశ్యకతపై ఏమీ చెప్పలేదని సీఈవో వివరించారు. ఎవరి నుంచీ అలాంటి ప్రతిపాదనలు తమకు అందలేదన్నారు.

ఈ ఎన్నికల్లో అత్యధికంగా దర్శి అసెంబ్లీ నియోజకవర్గంలో 90.91 శాతం, అత్యల్పంగా తిరుపతిలో 63.32 శాతం నమోదైనట్లు వివరించారు. లోక్‌సభ స్థానాల్లో అత్యధికంగా ఒంగోలులో 87.06 శాతం, అత్యల్పంగా విశాఖ లోక్ సభలో 71.11 శాతం పోలింగ్ నమోదైనట్లు సీఈవో చెప్పారు. ఈ ఎన్నికల్లో నాలుగు చోట్ల తాడిపత్రి, మాచర్ల, చంద్రగిరి, నరసరావుపేటలలో హింసాత్మక ఘటనలు చాలా జరిగాయని తెలిపారు. ఆ నాలుగు ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించామని, అదనపు బలగాలు పంపించామని వివరించారు.

అభ్యర్థులదరినీ హౌస్ అరెస్టు చేయాలని అదేశాలిచ్చామని, ఘటనకు బాధ్యులైన వారిపై కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని తెలిపారు. ఈవీఎంలు ధ్వంసం చేసిన వారిని అరెస్టు చేసి జైలుకు పంపాలని ఆదేశాలిచ్చామని, ఘటనలు అరికట్టడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రాష్ట్రంలో 715 ప్రాంతాల్లో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశామన్నారు.

Exit mobile version