BC reservations | హైదరాబాద్, జూలై 30 (విధాత): తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపైనే రాజకీయాలు నడుస్తున్నాయి. ప్రధాన పార్టీలు ఈ అంశంలో పైచేయి సాధించేందుకు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. రాష్ట్ర జనాభాలో అత్యధిక శాతం ఉన్న బీసీలను తమ వైపు తిప్పుకోగలిగితే రాజకీయంగా మేలు పొందవచ్చనేది పార్టీల ఎత్తుగడగా కనిపిస్తోంది. రిజర్వేషన్లకు అంతా సానుకూలమే అని పైకి చెబుతున్నా రాజకీయ లాభం కోసం వ్యూహాలు పన్నుతున్నాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ అంశంలో చాంపియన్లు కావాలనే భావన పొలిటికల్ పార్టీల్లో ఉందనే వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి. రాజకీయ ఎత్తుగడల కోసం ఈ అంశం అస్త్రంగా మారకుండా సమస్య పరిష్కారం కోసం పార్టీలు ప్రయత్నించాలని బీసీ సంఘాలు కోరుతున్నాయి.
బీసీ నినాదం ఎత్తుకున్న కాంగ్రెస్
2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో నిర్వహించిన సభలో బీసీ డిక్లరేషన్ ప్రకటించింది. ఇందులో కులగణన, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు వంటి హామీలు ఇచ్చింది. ప్రజలు కాంగ్రెస్‌కు అధికారం అప్పగించారు. ఇచ్చిన హామీల్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన పూర్తి చేసింది. కులాలవారీగా లెక్కలను అసెంబ్లీ ముందు పెట్టారు. ఈ సంఖ్యకు అనుగుణంగా స్థానిక సంస్థల్లో, విద్యా ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు రెండు వేర్వేరు బిల్లులను అసెంబ్లీలో ఆమోదించారు. ఇవి రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. దీనికి సమయం పట్టే అవకాశం ఉన్నందున స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లకు ముసాయిదా ఆర్డినెన్స్ తెచ్చారు. దీనిపై గవర్నర్ లీగల్ ఒపీనియన్ తీసుకుని కేంద్ర హోం శాఖకు పంపారు. మరోవైపు కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలను కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది. ఇందులో భాగంగా తమ పార్టీ ఎంపీలకు, నేతలకు కుల గణనపై ఢిల్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది.
కుల గణనకు కేంద్రం అంగీకారం
దేశవ్యాప్తంగా కూడా బీసీలే అధిక సంఖ్యలో ఉంటారు. ఈ నేపథ్యంలో తన రాజకీయ అవసరాల కోసం బీజేపీ సైతం కుల గణనకు మొగ్గు చూపింది. కాంగ్రెస్ ఇది తన విజయంగా చెప్పుకొంటూ వస్తున్నది. ఇప్పుడు బీసీలకు రిజర్వేషన్లపై బిల్లులు ఆమోదించిన కాంగ్రెస్ ప్రభుత్వం వీటిపై కేంద్రాన్ని ఒత్తిడి చేసేందుకు ఆగస్ట్ మొదటివారంలో నేరుగా రాష్ట్రపతిని కలవాలని నిర్ణయించింది. ప్లాన్ బీ అమల్లో భాగంగా.. ఒక వేళ రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ ఇవ్వని పక్షంలో ఢిల్లీలోనే ఆందోళనకు దిగే ఆలోచనలో కాంగ్రెస్ నేతలు ఉన్నారు.
మైలేజ్ ఎవరికన్నదే పాయింట్!
బీసీల పట్ల అందరికీ ప్రేమే ఉంది. కానీ.. ఎవరి వల్ల బీసీ రిజర్వేషన్లు వచ్చాయనేది పొలిటికల్ పాయింట్ అవుతుంది. ఇక్కడే అన్ని పార్టీలూ తమ వ్యూహాలు రచిస్తున్నాయి. తాము ఆమోదించిన బిల్లులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ కోరుతున్నది. తద్వారా బీసీలకు రిజర్వేషన్ సాధించిన పార్టీగా ప్రమోట్ చేసుకునే అవకాశం కాంగ్రెస్‌కు దక్కుతుంది. ఒకవేళ అడ్డు తగిలినా.. బీజేపీ బూచిని చూపించి.. కేంద్రం వల్లే బిల్లులు ఆమోదం పొందలేదని పొలిటికల్ మైలేజీ పొందేందుకు కూడా కాంగ్రెస్‌కు అవకాశం ఉంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి.
అడ్డుపుల్లేసిన బీజేపీ
బీసీ రిజర్వేషన్లకు బీజేపీ బాహాటంగానే తన వ్యతిరేకతను ప్రకటించింది. కుల సర్వేలో రాష్ట్రంలో బీసీ జనాభా 56.33 శాతంగా ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇందులో 10 శాతం ముస్లిం వర్గాలను కలిపారు. ఈ పదిశాతం తీసేస్తే బీసీ జనాభా 46 శాతం. బీసీల్లో ముస్లింలను ఎలా కలుపుతారనేది బీజేపీ ప్రశ్న. ముస్లింలు లేకుండా బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే విషయమై ముందుకు రావాలని అంటున్నది. దీన్ని ఆధారం చేసుకుని బీసీ రిజర్వేషన్ బిల్లులకు కేంద్ర ప్రభుత్వ ఆమోదం లభించే అవకాశాలు లేవనే సంకేతాలు ఇస్తున్నది. ముస్లింలతో కలిపి 42 శాతం రిజర్వేషన్లంటే తాము సహకరించబోమని కేంద్ర మంత్రి బండి సంజయ్, ఆ పార్టీ నేతలు ప్రకటించారు. 1990లో మండల్ కమిషన్ నివేదిక సమయంలో ఇదే తరహా రాజకీయాన్ని బీజేపీ చేసిందని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్ కల్పించడం మండల్ కమిషన్ నివేదిక ఉద్దేశం. దీనికి అనుకూలమని చెబుతూనే.. మరోవైపు దాని ఆధారంగా హిందూ సమీకరణలను బీజేపీ పెంచి పోషించింది. అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం అద్వానీ రథ యాత్ర కూడా దీనిలో భాగమేనని చెబుతారు. ఇప్పుడు కూడా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సానుకూలమని బీజేపీ చెబుతోంది. కానీ.. ముస్లింల అంశాన్ని తెరమీదికి తెచ్చింది. పైకి ముస్లింలను బూచిగా చూపుతున్నప్పటికీ అంతర్గతంగా రాజకీయ కారణాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. భవిష్యత్తులో తెలంగాణలో అధికారంలోకి రావాలనేది కమలం పార్టీ టార్గెట్. ఇప్పుడు రేవంత్ సర్కార్ తెచ్చిన 42 శాతం రిజర్వేషన్లకు కేంద్రం సహకరిస్తే.. ఆ క్రెడిట్ బీజేపీ కంటే.. క్షేత్రస్థాయిలో రిజర్వేషన్లు తీసుకొచ్చిన కాంగ్రెస్‌కే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇది కూడా ఈ బిల్లులపై బీజేపీ పేచీలు పెట్టడానికి కారణంగా భావిస్తున్నారు.
బీఆర్ఎస్ ఏమంటోంది?
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని బీఆర్ఎస్ పట్టుబడుతోంది. అయితే కాంగ్రెస్ తీరుపై ఆ పార్టీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. న్యాయపరమైన ఇబ్బందులు, టెక్నికల్ అంశాలు ఉన్నాయని తెలిసి కూడా రిజర్వేషన్లు అమలు చేస్తామని ముందుకు వచ్చిన కాంగ్రెస్.. అది అమలు కానిపక్షంలో ఆ నెపాన్ని ఇతర పార్టీలపైకి నెట్టే ప్రయత్నాల్లో ఉందని ఆరోపిస్తున్నది. కేంద్రంలో ఒక పార్టీ, రాష్ట్రంలో మరో పార్టీ అధికారంలో ఉన్న తరుణంలో రాజకీయ ఆమోదంతోనే బిల్లులు పాస్ అవుతాయని బీఆరెస్ నేతలు చెబుతున్నారు. కనుక ఈ బిల్లులు ఆమోదం పొందకపోతే ఆ తప్పు కాంగ్రెస్‌దే అవుతుందని అంటున్నారు.బీసీల రిజర్వేషన్ల విషయంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత బీఆర్ఎస్ కంటే ఒక అడుగు ముందే ఉన్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అసెంబ్లీలో మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహం, బీసీ సమస్యలను తీసుకొని ఆమె పోరాటం చేశారు. కవిత పోరాటాలు రాజకీయంగా బీఆర్ఎస్‌ను ఇరుకునపెట్టాయి. బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ తేవాలన్న ప్రభుత్వ ప్రయత్నాలను ఆమె సమర్థించారు. మరోవైపు బీఆరెస్ మాత్రం ఇందులో సాంకేతిక అంశాలు ఉన్నాయంటూ మెలిక పెడుతున్నది. బీసీ రిజర్వేషన్ల విషయంలో తన దారిలోకే బీఆర్ఎస్ రావాల్సి వస్తుందని కవిత ఇటీవల ఓ సందర్భంలో చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు కారణమయ్యాయి. రిజర్వేషన్ల అంశంలో రాష్ట్రపతిని కలిసేందుకు ఆగస్ట్ 5, 6, 7 తేదీల్లో ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, బీసీ సంఘాల ప్రతినిధులు ఢిల్లీకి వెళ్లనున్నారు. పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. బీఆరెస్ కూడా విడిగా రాష్ట్రపతిని కలిసే ఉద్దేశంలో ఉన్నది. వచ్చే నెలలో కరీంనగర్ లో బీసీ సభ కూడా నిర్వహించనున్నారు. అన్ని జిల్లాల్లో బీసీ సభలు నిర్వహించాలని కారు పార్టీ డిసైడ్ చేసింది.