- హామీలపై నిలదీయనున్న బీఆర్ఎస్
- బీసీల్లో ముస్లింల చేర్పుపై బీజేపీ రణం
- పదేళ్ల విధ్వంసంపై కాంగ్రెస్ సిద్ధం
(విధాత ప్రత్యేకం)
Assembly Session : అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టాలని బీఆర్ఎస్ సమాయత్తం కాగా, అంతే స్థాయిలో దీటుగా జవాబిచ్చేందుకు పాలక పక్షం సిద్ధమైంది. హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 15 నెలలు అవుతున్నా ఒక్క హామీని కూడా పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో దళిత ముఖ్యమంత్రి, మూడెకరాల ఉచిత భూమి వంటి ఎన్నో మోసపూరిత హామీలను ఇచ్చి నిండా మోసం చేసిందని, కాళేశ్వరం ప్రాజెక్టు, ధరణి వంటి తప్పిదాలపై సభలో సవివరంగా చెప్పాలని కాంగ్రెస్ సిద్ధమైంది. ప్రతిపక్ష సభ్యులు ఎంతగా తూలనాడినా, రెచ్చిపోయినా సంయమనంతో దీటుగా స్పందించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి మంత్రులు, సభ్యులకు సూచించారు.
తొలి సందేహం కేసీఆర్ హాజరుపైనే!
బడ్జెట్ సమావేశాల మొదటి రోజు గవర్నర్ ప్రసంగానికి హాజరైన ప్రతిపక్ష నేత కే చంద్రశేఖర్ రావు.. సమావేశాలు ముగిసే వరకు వస్తారా? ఒకరోజుతోనే సరిపుచ్చుతారా? అనేది సస్పెన్స్‌గానే ఉన్నది. ఆయన వచ్చినా, రాకపోయినా పట్టించుకోవాల్సిన అవసరం లేదనేది కాంగ్రెస్ సభ్యుల ఆలోచనగా చెబుతున్నారు. ప్రజలకు జవాబుదారీగా ఉండాలన్నా, ప్రభుత్వ వైఫల్యాలను ఆధారాలతో ఎత్తిచూపాలన్నా ఆయన సభకు వస్తేనే గౌరవం ఉంటుందనేది రాజకీయ పరిశీలకుల భావన. రైతు రుణ మాఫీ, రైతు భరోసా, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, పెన్షన్ పెంపు, నిరుపేద మహిళలకు ప్రతినెలా భృతి వంటి వాటిపై ఈ సభలో నిలదీయాలని ప్రతిపక్ష పార్టీ నిర్ణయం తీసుకున్నది. రైతు రుణ మాఫీపై ఏదో ఒక గ్రామానికి వెళ్లి పరిశీలన చేద్దామని, ఎంతమంది అర్హులు ఉన్నారు? ఎంత మందికి మాఫీ చేశారనేది స్పష్టమవుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కే తారకరామారావు సవాల్ విసిరారు. రైతు భరోసా కింద మూడు ఎకరాలలోపు వారికి సాయం చేశామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, చాలా మంది రైతుల ఖాతాల్లోకి డబ్బులు పడలేదన్నారు. ఒకేసారి డబ్బులు వేయకుండా విడతల వారీగా డబ్బులు వేయడం ఏంటనీ ఆయన ప్రశ్నించారు. రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి ప్రజలను మీ సేవా కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పుకొన్నారని, అయినా ఒక్కరికి కూడా కార్డు ఇవ్వలేదని ఆరోపించారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు పెన్షన్లనను పెంచుతామని చెప్పి నయాపైస పెంచలేదని కేటీఆర్ ఫైర్ అవుతున్నారు. ఇలా చెప్పుకొంటూ పోతే కాంగ్రెస్ అమలు చేయలేని హామీలను లేవనెత్తి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసూ వ్యూహంలో బీఆరెస్ ఉన్నది.
ముస్లిం అంశంపై బీజేపీ
సమగ్ర కుల గణన, ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వ వైఖరిని తూర్పారబట్టేందుకు బీజెపీ సిద్ధమైంది. బీసీ జాబితాలో ముస్లింలను చేర్చి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద తప్పిదానికి పాల్పడిందని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ముస్లిం మైనారిటీలను బీసీల జాబితాలో ఎలా కలుపుతారని, అలా కలిపేసి ఎలా రిజర్వేషన్లను పెంచుతారని ప్రశ్నిస్తున్నారు. ముస్లింలతో ఉన్న బీసీ రిజర్వేషన్ జాబితాను ఆమోదించేది లేదని ఇప్పటికే కేంద్ర మంత్రులు జీ కిషన్ రెడ్డి, బండి సంజయ్ స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణపై తీర్పు ఇచ్చి ఆరు నెలలు దాటినా ఇంత వరకు అమలు చేయకుండా కమిటీల పేరుతో కాంగ్రెస్ సర్కార్ కాలయాపన చేస్తున్నదని, నష్టపోయిన కులాలకు న్యాయం చేయాలనే యోచన లేదని మండిపడుతున్నారు. ఈ అంశాలతో పాటు కాంగ్రెస్ హామీలపై సభలో నిలదీయనున్నారు.
బీఆరెస్ ఆర్థిక విధ్వంసంపై అస్త్రశస్త్రాలతో కాంగ్రెస్
ఆర్థికంగా తీవ్ర విధ్వంసం చేసి, మోసపు హామీలతో పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని అంశాల వారీగా చీల్చి చెండాడాలని పాలకపక్షం నిర్ణయించింది. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సభ్యులతో సమావేశం అయ్యారు. ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు గందరగోళం చేసి, తాము వాదించేదే కరెక్టు అనే ప్రయత్నం చేస్తారని అన్నారు. వారు అరుస్తున్నారని మీరు అరవవద్దని, సంయమనం పాటిస్తూ స్పష్టంగా సమాధానాలు ఇవ్వాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత రెండో పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాలివని, ప్రతి ఒక్కరూ అంశాలవారీ నోట్స్ సిద్ధం చేసుకుని రావాలని చెప్పారు. ప్రతి సభ్యుడు సభకు హాజరు కావాలని, ప్రతిపక్షాలు వేసే ప్రశ్నలు సరైనవి కావని ప్రజలకు తెలియచేయాల్సిన బాధ్యత పార్టీ ఎమ్మెల్యేలపైనే ఉన్నదని స్పష్టంచేశారు. ఇక బీజేపీ విషయానికి వస్తే సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు, విదేశాల నుంచి నల్లధనం తెచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామన్న హామీలు ఏమయ్యాయని కాంగ్రెస్ సభ్యులు ఎదురు దాడి చేయనున్నారు. దక్షిణాది రాష్ట్రాలపై సవతి ప్రేమ, తెలంగాణ ప్రజలను ఈ దేశంలోని ప్రజలుగా చూడకపోవడం వంటి అంశాలను సమాధానం ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. బీఆర్ఎస్ పక్షం నేత కేసీఆర్ రెగ్యులర్‌గా సభకు వస్తే హాట్ హాట్ గా జరగడంతో పాటు వైఫల్యాలు మొత్తం వెలుగుచూసే అవకాశం ఉంది.