Site icon vidhaatha

Cabinet Expansion | ఆ క్యాటగిరీలో ఉన్నవారికి మంత్రి పదవుల్లేవు! నేడే క్లారిటీ?

కేసీ వేణుగోపాల్‌తో ముగిసిన రేవంత్‌ భేటీ
హాజరైన పీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌
పీసీసీ కూర్పుపైనా చర్చించిన నేతలు
అందుబాటులో ఉండాలన్న వేణుగోపాల్
నేడు కూడా ఢిల్లీలోనే ఇద్దరు నాయకులు
ఆయారాం గయారాంలకు అవకాశం లేదు?
కొందరు ఆశావహులకు మొండి చెయ్యే?

హైద‌రాబాద్‌, మే 26 (విధాత‌)
Cabinet Expansion | తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ క‌మిటీ (పీసీసీ) కార్య‌వ‌ర్గం కూర్పు, ఖాళీగా ఉన్న మంత్రి ప‌ద‌వుల భ‌ర్తీపై అధ్య‌క్షుడు బీ మ‌హేశ్‌ కుమార్ గౌడ్, ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఆదివారం పార్టీ పెద్ద‌ల‌తో చ‌ర్చించారు. విదేశీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కేసీ వేణుగోపాల్ ఢిల్లీ చేరుకున్నారు. ఆయ‌న‌ను ముఖ్య‌మంత్రితో పాటు పీసీసీ అధ్య‌క్షుడు కలిసి, పీసీసీ కార్య‌వ‌ర్గంలో ఎవ‌రెవ‌రికి అవ‌కాశం క‌ల్పించాలనేది వివ‌రించారు. రాష్ట్ర మంత్రివ‌ర్గంలో ఏ కులం వారికి ప‌ద‌వులు ఇవ్వాలనే విష‌యం కూడా చ‌ర్చించిన‌ట్లు తెలిసింది. గ‌త మూడు నెల‌లుగా ఇదిగో అదిగో అంటూ వాయిదా వేస్తున్నారు త‌ప్పితే మంత్రి వర్గ విస్తరణ కార్య‌రూపం దాల్చ‌డం లేదు. ఆదివారం జ‌రిగిన స‌మావేశంలో అన్ని అంశాలు, కులాలవారీగా స‌మీక‌ర‌ణ‌పై వేణుగోపాల్ కు వివ‌రించారని సమాచారం. పార్టీ పెద్ద‌ల దృష్టికి తీసుకువెళ్లి, ఏ విష‌యం మ‌ళ్లీ చెబుతాన‌ని వేణుగోపాల్ ముఖ్య‌మంత్రికి హామీ ఇచ్చారు. ఎప్పుడు పిలిచినా వెంట‌నే వ‌చ్చేందుకు ఢిల్లీలోనే అందుబాటులో ఉండాల‌ని చెప్పారు. ఆయ‌న సూచ‌న మేర‌కు ముఖ్య‌మంత్రి, పీసీసీ అధ్య‌క్షుడు సోమ‌వారం కూడా ఢిల్లీలోనే ఉండ‌నున్నారు. మంత్రివ‌ర్గంలో చోటు కోసం ఎవ‌రికి వారుగా త‌మ ప్ర‌య‌త్నాలు చేసుకుంటున్నారు. ముఖ్య‌మంత్రితో స‌హా ఇప్పుడు 11 మంది మంత్రివ‌ర్గంలో ఉన్నారు. మ‌రో ఆరు ఖాళీల‌ను భ‌ర్తీ చేసేందుకు ఎప్పటిక‌ప్పుడు పార్టీ అధ్య‌క్షుడు మ‌ల్లిఖార్జున్ ఖ‌ర్గే, రాహుల్ గాంధీ తో ముఖ్య‌మంత్రి చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు కాని స్ప‌ష్ట‌త రావ‌డం లేదు.

మీనాక్షీ న‌ట‌రాజ‌న్ బెంచ్ మార్క్‌
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్య‌వ‌హారాల ఇన్‌చార్జ్‌, మాజీ ఎంపీ మీనాక్షి న‌ట‌రాజ‌న్ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ కార్య‌వ‌ర్గం కూర్పు, జిల్లా, బ్లాక్‌, మండ‌ల క‌మిటీల పై ఒక స్ప‌ష్ట‌త‌కు వ‌చ్చారని తెలుస్తున్నది. 2017 సంవ‌త్స‌రం వ‌ర‌కు పార్టీ అభివృద్ధి కోసం ప‌నిచేసిన వారికి ప్రాధాన్యం ఇవ్వాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారని విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి. ఆయారాం గ‌యారాం ల‌కు ఎట్టి ప‌రిస్థితుల్లో ప‌ద‌వుల్లో చోటివ్వ‌కూడ‌ద‌ని దృఢ నిశ్చయానికి వచ్చినట్టు తెలుస్తున్నది. దీంతో గోడ దూకిన ప‌లువురు నాయ‌కుల గొంతులో ప‌చ్చి వెల‌క్కాయ ప‌డిందంటున్నారు.

నెలల తరబడి చర్చోపచర్చలు
గ‌త కొద్ది నెల‌లుగా పీసీసీ కార్య‌వ‌ర్గంపై చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి త‌ప్పితే కార్య‌వ‌ర్గం జాబితా బ‌య‌ట‌కు రావ‌డం లేదు. గ‌తంలో మాదిరి సిఫార‌సులు, పైర‌వీల ప్ర‌కారం కాకుండా విధేయ‌త‌, ప్ర‌జ‌ల్లో తిరిగే వారికి ఇవ్వనున్నారని తెలుస్తున్నది. వ‌ర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఇద్ద‌రు పేర్ల‌ను ఖ‌రారు చేసిన‌ట్లు సమాచారం. అలంపూర్ మాజీ ఎమ్మెల్యే, మాదిగ కులానికి చెందిన ఎస్‌ ఏ సంప‌త్ కుమార్‌, ఖైర‌తాబాద్ డీసీసీ ప్రెసిడెంట్ డాక్ట‌ర్‌ సీ రోహిన్ రెడ్డిని వ‌ర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఎంపిక చేసిన‌ట్లు చెబుతున్నారు. ఇద్ద‌రు కూడా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డితో స‌న్నిహితంగా మెలుగుతున్నారు. కుల జ‌నాభా దామాషా ప్ర‌కారం సంప‌త్ పేరును ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్నారని సమాచారం. అంద‌రితో క‌లివిడిగా ఉంటూ, పార్టీ కోసం ప‌నిచేస్తున్నందున రోహిన్ ను రాష్ట్ర క‌మిటీ లోకి తీసుకుంటున్నారని గాంధీభవన్‌ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర క‌మిటీతో పాటు జిల్లా, బ్లాక్‌, మండ‌ల క‌మిటీల ఎంపిక‌కు భారీ క‌స‌ర‌త్తు జ‌రుగుతోంది. పక్కాగా వడపోస్తున్నారు. 2017 సంవ‌త్స‌రాన్ని బెంచ్ మార్క్ గా తీసుకున్నారని, ఆ సంవ‌త్స‌రం వ‌ర‌కు పార్టీలో ఉన్న‌వారు ఎవ‌రు? ఆ మ‌రుస‌టి సంవ‌త్స‌రం నుంచి పార్టీనే అంటి పెట్టుకుని ప‌నిచేస్తున్న‌వారు ఎవ‌రెవ‌రు? అనే లెక్క తీశారని తెలిసింది. అలాంటి బ‌యోడేటా ద‌ర‌ఖాస్తులను మొదటి ప్రాధాన్యంలో పెట్టినట్టు చెబుతున్నారు. ఇలాంటి వారికి ప‌ద‌వులు ఇవ్వ‌డంతో మ‌రింతగా పార్టీ ప‌టిష్ట‌మ‌వుతుంద‌నే భావ‌న‌లో మీనాక్షీ న‌ట‌రాజ‌న్ ఉన్నారని అంటున్నారు. ప‌ద‌వులు ద‌క్కించుకున్న త‌రువాత హ‌వా చెలాయించకుండా ఉండేందుకు ప్ర‌తి నెలా రిపోర్టులు ఇవ్వాల‌ని ష‌ర‌తు విధిస్తారని తెలుస్తున్నది. సుమారు 30 ప్ర‌శ్న‌ల‌తో రిపోర్టు రూపొందించి, వాటికి స‌మాధానాలు పూరించి ఆన్ లైన్ లో పంపాల్సి ఉంటుంది. ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ సిఫార‌సు చేశార‌ని ప‌ద‌వులు ఇచ్చే సంస్కృతికి చెక్ ప‌డే ప‌రిస్థితులే ఎక్కువ‌గా ఉన్నాయి. ఈ నిర్ణ‌యం ప‌లువురు ముఖ్య నాయ‌కుల‌కు ఏమాత్రం స‌రిప‌డ‌డం లేదు, కాని ఏం చేయ‌లేని ప‌రిస్థితి. పార్టీ ఫ‌స్ట్ అనే విధంగా ఆమె నిర్ణ‌యాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారని ఆమె వ్యవహార శైలి తెలిసినవారు చెబుతున్నారు. గుజ‌రాత్ లో పార్టీ ముఖ్య‌మైన బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డంతో అక్కడే మీనాక్షీ మ‌కాం వేశారు. నాలుగు రోజుల క్రితం కూడా ఆమె జూమ్ మీటింగ్ నిర్వ‌హించి, పార్టీ కార్య‌క్ర‌మాల‌పై స‌మీక్షించారు. పార్టీ ప‌ద‌వులు, నామినేటెడ్ పోస్టుల్లో త‌న ముద్ర స్ప‌ష్టంగా ఉండాల‌నే దిశ‌గా ఆమె ఉన్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతున్న‌ది.

Exit mobile version