- ఆందోళనలో ముగ్గురు మంత్రులు!
- ఇద్దరు మంత్రులను తొలగిస్తారా?
- విజయశాంతికి సీటు దక్కేనా?
- విస్తరణకు ముహూర్తం ఏప్రిల్ 3?
- ఢిల్లీ నుంచి రేవంత్‌రెడ్డి టీమ్ తిరుగు ప్రయాణం
(విధాత ప్రత్యేకం)
తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన 16 నెలల తరువాత మంత్రివర్గ విస్తరణ జరుగుతోంది. గత ఆరు నెలలుగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆశావహులకు ఢిల్లీ పెద్దలు తీపి కబురు త్వరలో పంపించనున్నారు. ఏప్రిల్ 3వ తేదీన నూతన మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం రాజ్ భవన్‌లో నిర్వహించనున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. వీటితో పాటు డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులను కూడా భర్తీ చేసేందుకు అనుమతి లభించిందని సమాచారం. ఈ మేరకు పక్కా హామీతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీ నుంచి తిరుగుప్రయాణం అయ్యారని తెలుస్తున్నది. ఏ రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ప్రస్తుతం ఆయనతో సహా 12 మంది ఉన్నారు. మరో ఆరు ఖాళీలు ఉండగా, భర్తీ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తున్నది. ఢిల్లీ పెద్దల నుంచి పిలుపు రావడంతో సోమవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, నీటి పారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్లారు. పార్టీ అగ్రనాయకులు రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. ఖాళీగా ఉన్న ఆరు మంత్రి పదవులు భర్తీ చేస్తారా? లేదా నాలుగు భర్తీ చేసి మరో రెండు ఖాళీ పెడతారా? అనేది తెలియడం లేదు. అయితే ఆరు పదవులు భర్తీ చేయడమే కాకుండా డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులను కూడా భర్తీ చేస్తారనే సమాచారం ఆశావహులకు అందిందంటున్నారు.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు చెన్నూరు ఎమ్మెల్యే జీ వివేక్ వెంకటస్వామి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీలోకి చేరిన సందర్భంగా మంత్రి పదవులు ఇస్తామని హామీ లభించింది. బోధన్ ఎమ్మెల్యే పీ సుదర్శన్‌రెడ్డికి మంత్రివర్గంలో చోటు కల్పిస్తామని ఎన్నికల సమయంలోనే రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చి ఉన్నారు. ఆయన పార్టీని నమ్ముకుని పనిచేస్తున్నారని పార్టీ పెద్దలకు ఢిల్లీ పర్యటన సందర్భంగా రేవంత్‌రెడ్డి వివరించినట్లు తెలిసింది. ఇక బీసీల నుంచి ఆది శ్రీనివాస్, దానం నాగేందర్, బీర్ల అయిలయ్య, వాకిటి శ్రీహరి, విజయశాంతి పేర్లు కూడా చర్చకు వచ్చాయని తెలుస్తున్నది. రాష్ట్రంలో ముదిరాజ్ కులం జనాభా అధికంగా ఉందని, వారిని గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని తెలిపారు. వాకిటి శ్రీహరికి ముదిరాజ్ కులం తరఫున మంత్రివర్గంలో స్థానం కల్పిస్తానని ఎన్నికల సభల్లో హామీ ఇచ్చినట్లు రేవంత్ రెడ్డి పార్టీ పెద్దలకు వివరించారు. మున్నూరు కాపుల నుంచి ఆది శ్రీనివాస్‌కు చోటు కల్పించాలని ఉన్నప్పటికీ ఆయన ప్రస్తుతం విప్‌గా కొనసాగుతున్నారు.
అయితే ఇప్పటికే వరంగల్ నుంచి గెలుపొందిన కొండా సురేఖ మంత్రివర్గంలో ఉన్నారు. ఆమె పద్మశాలి కులం కాగా, ఆమె భర్త కొండా మురళీధర్ రావు మున్నూరు కాపు. ఆమెకు ప్రస్తుతం రెండు కులాల నుంచి ప్రాతినిధ్యం ఉన్నందున ఆది శ్రీనివాస్‌కు చీఫ్ విప్ ఇచ్చి, పదోన్నతి కల్పించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఒకవేళ మున్నూరు కాపులకు ఇవ్వాలని అనుకుంటే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు ఇవ్వవచ్చనే సంకేతాలు ఉన్నాయి. ఆయన మొదటి నుంచీ కాంగ్రెస్‌లో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత బీఆర్ఎస్‌లోకి వెళ్లి, మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ సొంత గూటికి చేరుకున్నారు. నాగేందర్‌కు మంత్రి పదవి ఇస్తే హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం లభించడమే కాక, మున్నూరు కాపులకు అవకాశం ఇచ్చినట్టు అవుతుందనే ఆలోచనలో పార్టీ అధిష్ఠానం ఉందని అంటున్నారు. ముస్లిం మైనారిటీల నుంచి నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీ అమేర్ అలీ ఖాన్‌ను మంత్రి పదవి వరించనున్నట్లు పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు. సోమవారం ముఖ్యమంత్రి ఢిల్లీకి బయలుదేరే ముందు అసెంబ్లీలో ఎమ్మెల్సీ అమేర్‌తో సుదీర్ఘంగా చర్చించారు. ముస్లిం మైనారిటీ కోటా నుంచి మాజీ మంత్రి మహ్మద్ షబ్బీర్ అలీ సర్వశక్తులు ఒడ్డుతున్నా, ఆయన ఏ సభల్లోనూ సభ్యుడిగా లేరు. ఉన్నత విద్యావంతుడు, మృదు స్వభావి అయిన అమేర్‌కు రేవంత్ మంత్రివర్గంలో చోటు లభించే సూచనలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. లంబాడా కులం నుంచి దేవరకొండ ఎమ్మెల్యే బాలూ నాయక్‌కు చోటు దక్కే పరిస్థితులు ఉన్నాయి. ఒకవేళ ఇది సాధ్యం కానట్లయితే డిప్యూటీ స్పీకర్‌గా నియమించి, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జే రామచంద్రు నాయక్‌ను క్యాబినెట్‌లోకి తీసుకోవచ్చంటున్నారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, మంచిర్యాల ఎమ్మెల్యే కే ప్రేమ్ సాగర్ రావు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రేమ్ సాగర్, రంగారెడ్డి జిల్లా నుంచి మల్‌రెడ్డి.. తమకు పదవులు ఇవ్వాలని అధిష్ఠానం పెద్దలను అదే పనిగా వేడుకుంటున్నారనే చర్చ వినిపిస్తున్నది. వెలమ కులం నుంచి ఇప్పటికే జూపల్లి కృష్ణారావు క్యాబినెట్‌లో ఉన్నారు. ఇక రెడ్డి కులం నుంచి ఎక్కువ సంఖ్యలో ఉన్నందున మల్ రెడ్డికి సాధ్యం కాకపోవచ్చనే వార్త విన్పిస్తున్నది.
ఆ ఇద్దరిని తొలగిస్తారా?
రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖల ను తొలగిస్తారనే వార్తలు గత రెండు నెలలుగా ఊపందుకున్నాయి. పర్యాటక శాఖలో కృష్ణారావు కుమారుడి జోక్యం అధికంగా ఉందని, ఆయన ప్రతి విషయంలో కలుగచేసుకుని సెటిల్‌మెంట్లు చేస్తున్నారనే విమర్శలున్నాయి. ఆయనకు తెలియకుండా ఒక్క పని కూడా జరగడం లేదని, పనుల కోసం ఎవరైనా వెళ్తే కుమారుడిని కలవాల్సిందిగా కృష్ణారావు సూచిస్తున్నారని కార్యకర్తలే చెప్పుకొంటున్నారు. ఇక సురేఖ విషయానికి వస్తే అక్కినేని నాగార్జున కుటుంబం పరువు బజారున పడే విధంగా బహిరంగ వ్యాఖ్యలు చేయడం, ఆ తరువాతి పరిణామాలను ఢిల్లీ పెద్దలు సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే సురేఖ వ్యాఖ్యలపై కోర్టులో కేసు నడుస్తున్నందున వేచి చూసే అవకాశాలు ఉన్నాయని పార్టీ నాయకులు చెబుతున్నారు. వీరిద్దరిని కొనసాగిస్తారా, సాగనంపుతారా అనేది మంత్రివర్గ విస్తరణ రోజు తేలనున్నది.
కొండా సురేఖ స్థానంలో విజయశాంతి?
మంత్రి పదవి నుంచి కొండా సురేఖను తప్పిస్తే, ఆమె స్థానంలో ఇటీవలే ఎమ్మెల్సీగా ఎన్నికైన ఎం విజయశాంతికి చోటు దక్కవచ్చని వారం రోజులుగా జోరుగా ప్రచారం సాగుతోంది. ఎంబీసీలలో కళావంతుల కులానికి చెందిన విజయశాంతికి పదవి ఇవ్వడంతో పాటు గౌరవం కల్పించనట్లు అవుతుందనే భావనలో ఢిల్లీ పెద్దలు ఉన్నట్టు చెబుతున్నారు. మంత్రివర్గంలో కూడా కీలకమైన బాధ్యతలు అప్పగించనున్నారని అంటున్నారు.
ముగ్గురు మంత్రుల శాఖల్లో కత్తిరింపులు
మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక శాఖలను నిర్వర్తిస్తున్నారు. వారి వద్ద అదనంగా ఉన్న శాఖలను తొలగించి, కొత్తగా మంత్రివర్గంలోకి వచ్చేవారికి ఇవ్వాలనే నిర్ణయం ఢిల్లీలో జరిగిందనే ప్రచారం వినిపిస్తున్నది. ఈ నిర్ణయం తెలుసుకున్న మంత్రులు కంగుతిని, ఆందోళనకు గురవుతున్నట్లు సమాచారం. విక్రమార్క విద్యుత్ శాఖతో పాటు ఆర్థిక శాఖను కూడా నిర్వహిస్తున్నారు. అయితే ఆర్థిక శాఖను తనకు ఇవ్వాలని ఉత్తమ్ పట్టుబడుతున్నారని భోగట్టా. ఆ శాఖను ఇచ్చేందుకు విక్రమార్క ససేమిరా అంటున్నట్లు సమాచారం. కమీషన్ల మంత్రిగా పేరు పడినందున, ఆయన నుంచి ఆర్థిక శాఖను తప్పించాలని అధిష్ఠానం ఆదేశించినట్లు సచివాలయంలో గుప్పుమంటోంది. ఉత్తమ్ నీటి పారుదల శాఖతో పాటు పౌర సరఫరాల శాఖను నిర్వర్తిస్తున్నారు. రెంటిలో ఏదో ఒక శాఖను కొనసాగించి, మిగిలిన శాఖను తప్పించే సూచనలున్నాయి. ఇక పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రెవెన్యూతో పాటు గృహ నిర్మాణం, సమాచార శాఖలను నిర్వర్తిస్తున్నారు. ఆయన నుంచి రెండింటిని తప్పించి రెవెన్యూకే పరిమితం చేయవచ్చంటున్నారు. మరో మంత్రి డీ శ్రీధర్ బాబు నుంచి పరిశ్రమల శాఖను తప్పించి ఐటీ శాఖను కొనసాగించవచ్చని కాంగ్రెస్ నాయకులు లాబీల్లో చెప్పుకొంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద విద్య, మునిసిపల్, హోం వంటి కీలక శాఖలు ఉన్నాయి. వాటిని ఆయన వద్దే కొనసాగిస్తారా? లేదా కొత్త మంత్రులకు కేటాయిస్తారా? అనేది సస్పెన్స్ గా ఉంది. జూపల్లి కృష్ణారావు నుంచి ఎక్సైజ్ శాఖను తొలగించే ప్రమాదముందని కార్యకర్తలే బాహాటంగా చెప్పుకొంటున్నారు.