- నేటి అర్థరాత్రి నుంచి ఆర్టీసీ సమ్మె
- ఎక్కడికక్కడ ఆగిపోనున్న బస్సులు
- 15 నుంచి ఉద్యమ బాటలోకి ఉద్యోగులు
- సమస్యల పరిష్కారానికి నిధుల కొరత
- సీఎం వ్యాఖ్యలతో ఉద్యోగుల గుస్సా
- ఇదే అహంకారంతో బీఆరెస్ సర్కార్
- అందుకే ఎన్నికల్లో చిత్తుగా ఓటమి
- అదే బాటలో రేవంత్‌రెడ్డి ప్రయాణం
- సచివాలయ ఉద్యోగుల్లో చర్చలు
Revanth Reddy Facing Trouble | తెలంగాణ రోడ్డు రవాణ సంస్థ (టీజీఆర్టీసీ) ఉద్యోగులు సమ్మెకు సిద్ధమయ్యారు. మంగళవారం అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడే ఆగిపోనున్నాయి. మే 7వ తేదీ నుంచి సమ్మెలోకి వెళుతున్నట్టు సంస్థ జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. తమ దీర్ఘకాలిక పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కొద్ది రోజుల క్రితం తెలంగాణ రోడ్డు రవాణ సంస్థ ఉద్యోగులు యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చారు. సమస్యలను పరిష్కరించేందుకు తమను చర్చలకు పిలవాల్సిందిగా సమయం ఇచ్చినా యాజమాన్యం స్పందించకపోవడంతో ప్రత్యక్షంగా రంగంలోకి దిగారు. సోమవారం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కార్మిక సంఘాల నేతలను చర్చలకు ఆహ్వానించారు. సమ్మె చేయవద్దని వారిని కోరారు. ఆర్టీసీ ఇప్పుడిప్పుడే లాభాల బాటలో పడుతున్నదని చెబుతూ.. కార్మికుల సంక్షేమం కోసం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. కానీ, ప్రభుత్వం తరఫున చేయాల్సిన పనులపై స్పందించకపోవడంతో జేఏసీ నాయకులు ఆగ్రహంగా బయటకు వచ్చారు. ముందుగా ప్రకటించిన కార్యాచరణ ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదని, ముందుకు వెళ్తామని ఆయనకు స్పష్టం చేశారు. సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో సోమవారం ఆర్టీసీ క్రాస్ రోడ్డు నుంచి బస్సు భవన్ వరకు కవాతు నిర్వహించారు. పోలీసులు ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున మోహరించి నిలువరించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కార్మికులు, ఉద్యోగులు బస్‌భవన్‌ను ముట్టడించారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉద్యోగులు సమ్మెకు దిగితే పరిస్థితి ఏంటనే దానిపై ప్రభుత్వ పెద్దలు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంతో పాటు చర్చలకు పిలిచేందుకు మంత్రి వర్గ ఉపసంఘం వేయాల్సిన ఆవశ్యకత ఉందని ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు.
మే 15 నుంచి ఉద్యోగులు, ఉపాధ్యాయులు రంగంలోకి
ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం చూపుతున్న ఉదాసీనత, అలసత్వం 13 లక్షల 31 వేల కుటుంబాలను సంక్షోభంలోకి నెట్టివేస్తున్నాయని తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల, గెజిటెడ్ అధికారుల, ఉపాధ్యాయుల కార్మికుల పెన్షనర్స్ ఐక్యకార్యచరణ సమితి (టీజీఈ జాక్) చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాస్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెకు తోడు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు కూడా ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. ఏడాదిన్నర కాలంగా వేచి చూస్తున్నామని, ఒక్క సమస్య కూడా పరిష్కరించలేదని ఆగ్రహంతో ఉన్న వీరు ఆదివారం నాడు బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సమావేశమయ్యారు. కొత్త ప్రభుత్వం అని ఇప్పటి వరకు ఓపిక వహించామని, సహనం నశించి ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల, గెజిటెడ్ అధికారుల, ఉపాధ్యాయుల కార్మికుల పెన్షనర్స్ ఐక్యకార్యాచరణ సమితి సదస్సులో ప్రకటించారు. సమితి చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావుతో పాటు వివిధ సంఘాల నాయకులు హాజరయ్యారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే మే నెల 15న హైదరాబాద్ తో పాటు జిల్లాల్లో మధ్యాహ్నం భోజన విరామ సమయంలో ప్రభుత్వ కార్యాలయాల ముందు నల్ల బ్యాడ్జీలతో నిరసన ప్రదర్శనలు చేపడ్తామని తెలిపారు. వర్క్ టూ రూల్, మానవ హారాలు, సామూహిక భోజనాలు, పెన్ డౌన్, సామూహిక సెలవులు పెట్టి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామన్నారు. అప్పటికీ విన్పించుకోనట్లయితే జూన్ 9న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద మహా ధర్నా, ర్యాలీ నిర్వహిస్తామన్నారు. ప్రతి ఐదు సంవత్సరాలకు పాలకులు మారుతుంటారని, ఉద్యోగులు శాశ్వతంగా ఉంటారని అన్నారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఎంత వరకైనా వెళ్తామని సదస్సులో పాల్గొన్న నేతలు స్పష్టం చేశారు. తెలంగాణ సమాజం ఎల్లకాలం ఏ అణచివేతను, సాచివేతను, ఆగచాట్లను అవమానాలను భరించిన చరిత్ర లేదని జేఏసీ నాయకులు వెల్లడించారు. అయితే సోమవారం నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నగరంలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, ఒకటో తేదీన జీతాలు ఇస్తున్న కాంగ్రెస్ సర్కార్ కు సహకరించాల్సింది పోయి సమరం చేస్తారా అంటూ మండిపడ్డారు. తనను కోసినా సరే రాబడికి మించి ఒక్క పైసా అదనంగా ఖర్చు చేయలేనని స్పష్టం చేయడాన్ని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ కార్మికులు జీర్ణించుకోలేకపోతున్నారు.
సహకరించినందుకు ఇదా?
ఇప్పటి వరకు ప్రభుత్వ పథకాలకు సహకరించి, సంయమనంగా ఉన్నందుకా ఈ వ్యాఖ్యలు అని సచివాలయం ఉద్యోగులు ఆగ్రహంగా ఉన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఇలాంటి అహంకారపూరిత మాటలు మాట్లాడి ప్రజల చేతుల్లో చిత్తుగా ఓడిపోయిందని, ఇలాగే మాట్లాడితే ఈ ప్రభుత్వానికి నూకలు చెల్లినట్లేనని ఉద్యోగులు విమర్శిస్తున్నారు. పదవీ విరమణ చేసిన తరువాత కూడా ఉద్యోగికి రావాల్సిన బకాయిలు ఇవ్వకపోతే ఎలా బతకాలంటున్నారు. జీపీఎఫ్ నిధులను కూడా ఇవ్వకుండా నెలల తరబడి పెండింగ్ లో పెడుతూ సచివాలయం చుట్టూ తిప్పించుకుంటున్నారని అంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వంలోని మొత్తం ఉద్యోగులు
ప్రభుత్వ ఉద్యోగులు 3,56,135
ఏయిడెడ్ ఉద్యోగులు 30,915
యూనివర్సిటీ ఉద్యోగులు 5,266
ప్రభుత్వరంగ ఉద్యగులు 8,986
కార్పొరేషన్ ఉద్యోగులు 1,20,390
కాంట్రాక్టు ఉద్యోగులు 81,341
జీపీ ఎంపిడబ్ల్యూ 53,185
టీజీఆర్టీసీ ఔట్ సోర్సింగ్ 1,27,326
ఎన్ఎంఆర్, డైలీవేజ్ 13,138
గౌరవ వేతనజీవులు 2,18,830
సర్వీసు ఫించన్‌దారులు 1,60,170
ఫ్యామిలీ ఫించన్ దారులు-1 1,25,173
ఫ్యామిలీ ఫించన్ దారులు-2 1,607
ప్రొవిజనల్ ఫించన్ దారులు 1,219
మొత్తం సంఖ్య 13,03,681
ఇవి కూడా చదవండి..
CM Revanth Reddy | మీ సమరం తెలంగాణ ప్రజలపైనా? : ఉద్యోగ సంఘాలపై సీఎం ఫైర్
Universe End | ఆకాశ పెను తుఫాన్‌తో తుడిచిపెట్టుకుపోనున్న విశ్వం! నిజమేనా? శాస్త్రవేత్తలేమంటున్నారు?
Revanth Reddy | రేవంత్.. ఢిల్లీ వెళ్లేది ఈ పనుల కోసమేనా?