Farmhouse CM – Own House CM | హైదరాబాద్, జూలై 9 (విధాత): రాష్ట్ర పరిపాలనా వ్యవస్థకు కేంద్ర బిందువు ఆ రాష్ట్ర సచివాలయం. వివిధ శాఖల అధికారులు, కార్యదర్శులు మొదలు.. మంత్రులు, ముఖ్యమంత్రులు కొలువుదీరే స్థానం. ఇంతటి కీలకమైన సచివాలయానికి ఓ దశాబ్దకాలంగా తెలంగాణ ముఖ్యమంత్రులు దూరంగానే ఉంటున్నారు. కోట్లు ఖర్చు చేసి నిర్మించుకున్న సచివాలయానికి నాటి సీఎం హోదాలో కేసీఆర్ వచ్చిన సందర్భాలు వేళ్ల మీద లెక్కపెట్టుకునేవే ఉన్నాయనే అభిప్రాయం ఉంది. కేసీఆర్‌ను గడీ ముఖ్యమంత్రి అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విమర్శించిన రేవంత్‌రెడ్డి.. తాను సైతం సందర్శకుడి పాత్రే పోషిస్తుండటం విశేషం. కాకపోతే క్యాబినెట్ సమావేశాలు మాత్రం రేవంత్‌రెడ్డి సచివాలయంలో నిర్వహిస్తుండటం, రైతు భరోసాలాంటి కార్యక్రమాలను కూడా ఇక్కడి నుంచే ప్రారంభించడం వంటి కొన్ని మినహాయింపులు ఉన్నాయి. ఏది ఏమైనా కేసీఆర్ ఫాంహౌస్ ముఖ్యమంత్రిగా విమర్శలు ఎదుర్కొంటే.. నేడు రేవంత్‌రెడ్డి ఓన్‌హౌస్ సీఎంగా విమర్శలు ఎదుర్కొనే పరిస్థితి ఉందని విశ్లేషకులు అంటున్నారు.
నాటి సీఎం ప్రగతిభవన్‌కే పరిమితం!
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న కేసీఆర్.. తొలుత కొన్ని రోజులు సచివాలయానికి వచ్చినా ఆ తర్వాత్ బంద్‌పెట్టారు. వాస్తు దోషాల అనుమానంతోనే ఆయన సచివాలయానికి రాలేదని అప్పట్లో చర్చించుకున్నారు. వాస్తును గట్టిగా నమ్మే కేసీఆర్.. ఆ కారణంతోనే పాత సచివాలయాన్ని కూల్చి కొత్తది కట్టించారని చెప్పేవారూ ఉన్నారు. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు నిర్మించిన బేగంపేట కార్యాలయాన్ని మరింత విస్తరించి ప్రగతిభవన్, ప్రజాభవన్‌తోపాటు.. తన నివాసానికి ప్రత్యేక బంగళాను కేసీఆర్ నిర్మించుకున్నారు. ఆ తర్వాత పూర్తిగా ప్రగతిభవన్‌కే అంకితమైపోయారనే విమర్శలు అప్పట్లోనే వచ్చాయి. ప్రగతి భవన్ లేదంటే ఫామ్‌హౌస్ అన్నట్టు అప్పట్లో పరిస్థితి తయారైంది.
పాతది కూల్చి కొత్తది కట్టినా..
వాస్తు దోషం పేరిట పాత సచివాలయాన్ని కూల్చిన కేసీఆర్.. తనకు నచ్చిన పద్ధతిలో కొత్త సచివాలయం నిర్మించుకున్నారు. నిత్యం దానిని పరిశీలనకు వెళ్లి, అవసరమైన మార్పులు చేర్పులు సూచించేవారు. లోపల పరిస్థితిని పక్కడపెడితే.. భారీ కోటలాంటి సచివాలయాన్ని అందంగా నిర్మించారు. అయితే.. సచివాలయంలోకి ఇతరులు ప్రత్యేకించి మీడియా ప్రవేశించే విషయంలో సవాలక్ష ఆంక్షలు విధించారు. హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైన దగ్గర నుంచి ఎలాంటి ఆంక్షలు లేకుండా సచివాలయంలోకి వెళ్లి వార్తలు కవర్ చేసిన మీడియా.. మొట్టమొదటిసారిగా అంటరానిదైంది. అధికారులు విడుదల చేసే ప్రెస్‌నోట్లను కవర్ చేయడమే చాలామంది విలేకరులకు సరిపోయేది. లోపల అధికారులతో బాగా ‘సంబంధాలు’ ఉన్నవారికి మాత్రం కొంత వెసులుబాటు లభించేది. ప్రభుత్వ వ్యతిరేక మీడియాగా ముద్రపడితే కనీసం దేఖేవారు కూడా ఉండేవాళ్లు కాదని, వాళ్లు విడుదల చేసే సమాచారం ఆధారంగా వార్తలు రాసుకోవాలే తప్పించి.. స్వతంత్రంగా సమాచారం సేకరించి వార్తలు అందించే పరిస్థితి ఉండేది కాదని ఒక సీనియర్ పాత్రికేయుడు చెప్పారు. ఆ తరువాత కూడా సచివాలయానికి పెద్దగా రాలేదని కేసీఆర్‌ను బాగా ఎరిగిన ఒక అధికారి అన్నారు.
గడీ సీఎం అన్న రేవంత్.. ఇప్పుడు?
ప్రగతి భవన్‌ను ఒక దొరల గడీగా, కొత్త సచివాలయన్ని ఒక కోటలా అభివర్ణించిన రేవంత్ రెడ్డి తాను అధికారంలోకి రాగానే సచివాలయాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకు వస్తానని చెప్పారు. సచివాలయంలోకి మీడియా స్వేచ్ఛగా వచ్చే ఏర్పాట్లు చేస్తానన్నారు. ప్రజలు ఎప్పుడైనా వచ్చి తనను కలువవచ్చునని, వినతి పత్రాలు ఇవ్వవచ్చునని తెలిపారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్న సమయంలోనే ప్రగతిభవన్‌కు ఉన్న ఇనుప కంచెలు తొలగించారు. సచివాలయంలోకి మీడియాను, ప్రజలను అనుమతించారు. తమకు రేవంత్ పాలనలో స్వేచ్ఛ లభించిందని మురిసిపోయిన జర్నలిస్టులు, ప్రజలు.. సచివాలయంలోకి వెళ్లి సెల్ఫీలు తీసుకున్న సందర్భాలూ ఉన్నాయి. కానీ.. అది మూణ్ణాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. అప్పటిదాకా అక్రెడిటేషన్ కార్డు ఉన్న జర్నలిస్టులు ఎలాంటి ఆటంకాలు లేకుండా సచివాలయంలోకి వెళ్లే పరిస్థితి ఉన్నా.. ఇప్పుడు ఆ అవకాశం లేకుండా చేశారని సచివాలయ వార్తలను కవర్ చేసే పలువురు జర్నిలిస్టులు చర్చించుకుంటున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ఏకంగా ఎవరికీ అనుమతి లేని ఆరో అంతస్తులోకి మార్చేశారు. ఇక్కడే సీఎస్ చాంబర్, సీఎంవో కార్యదర్శుల చాంబర్‌లు ఉంటాయి. వీటికి ప్రవేశాన్ని నిషేధించడంతో ప్రజలు సీఎంను కలుసుకునే అవకాశం కోల్పోయారు. కనీసం సీఎం ఆఫీసు కార్యదర్శులను కూడా కలిసి తమ సమస్యను చెప్పుకొనే అవకాశం పోయిందని సచివాలయానికి వచ్చే సందర్శకుడొకరు అన్నారు.
కారణాలేంటి?
భద్రతా కారణాలా? లేక ప్రజలు ఆయా సమస్యలపై తమను నిలదీస్తారన్న భయామో కానీ కావాలనే ప్రజలు కలువకుండా భద్రత పేరుతో ఒక కంచెను ఏర్పాటు చేసుకున్నారన్న అభిప్రాయం రాజకీయ వర్గాలలో జరుగుతున్నది. ఆరవ అంతస్తులోకి ప్రవేశాన్ని ఎందుకు నిషేధించారని అడిగితే విజిటర్స్‌తో తమకు ఇబ్బంది అవుతుందంటూ సీఎం కార్యదర్శులు, సలహాదారులు రానీయొద్దన్నారని భద్రతా సిబ్బంది చెబుతున్నారు. ముఖ్యమంత్రి ఎందుకు రావడం లేదని ఒక సీనియర్ అధికారితో మాట్లాడితే.. భద్రత సరిగ్గా లేదన్న కారణంతో అయి ఉంటందని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. సచివాలయంలోకి వచ్చేవారికి పూర్తిగా తనిఖీ చేసి, అనుమతి ఉంటేనే పంపిస్తారు. అయినా భద్రతా కారణాలేంటంటే సమాధానం రావడం లేదు. దీంతో ప్రజల సమస్యలు పరిష్కరించే ఓపిక లేక వారిని రానీయడం లేదా? లేక సందర్శకుల పట్ల ఏవగింపు ఉన్నదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ ఏర్పాటు వరకూ దాదాపు అందరు ముఖ్యమంత్రులు సచివాలయం నుంచి పనిచేసినవారే. సందర్శకులకు ప్రత్యేక వేళలు కేటాయించేవారు. నిత్యం సందర్శకులతో సచివాలయం కళకళలాడుతుండేది. ఇప్పుడు ఒక కార్పొరేట్ ఆఫీసుగా మారిపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో నిత్యం ఉండాలని, ప్రజలకు అందుబాటులో ఉండి వారి వినతులు స్వీకరించే పరిస్థితి రావాలని కోరుకుంటున్నారు.