- నిక్కచ్చిగా ఉన్నందుకే ఐఏఎస్‌లపై గుర్రు!
- ఆది నుంచీ మంత్రి జూపల్లి వివాదం
- ఎంపీ బీర్లపై అనుమతి, అంతలోనే రద్దు
- మధ్యప్రదేశ్‌లో అనేక ఆరోపణలు, ఎగవేతలు
- హోలోగ్రామ్ మొదలు సోమ్ డిస్టిలరీ వరకు..
హైదరాబాద్, విధాత ప్రతినిధి:
Excise Department Internal Fight Explained | తెలంగాణ ఎక్సైజ్ శాఖలో గత రెండు సంవత్సరాలుగా వేల కోట్ల టెండర్ల అంశంపై ఉన్నతాధికారులు, మంత్రి మధ్య అంతర్గతంగా జరుగుతున్నట్టు చెబుతున్న పోరు బట్టబయలైంది. తన ఆదేశాలు అమలు చేయడం లేదని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆక్రోశం వ్యక్తం చేస్తుండగా, నిబంధనల ప్రకారం వెళ్తున్నామని ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తజా రిజ్వీ, కమిషనర్ హరికిరణ్ సమర్థించుకుంటున్నారు. మంత్రిగా తన మాటను అధికారులు ఖాతర్ చేయడం లేదని జూపల్లి బావురుమంటున్నారన్న చర్చలు గతంలోనే వినిపించాయి. 1999 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన రిజ్వీ స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్)కు దరఖాస్తు చేయడంతో అంతర్గత విభేధాలపై పూర్తి స్పష్టత వచ్చిందని సచివాలయ వర్గాలంటున్నాయి. వీఆర్ఎస్ దరఖాస్తును ఆమోదించకుండా పెండింగ్‌లో పెట్టాలని, ఆల్ ఇండియా సర్వీసు రూల్స్ ప్రకారం విచారణ జరపాలని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామ కృష్ణారావుకు వెంటనే లేఖ రాయడంతో మరింత బలపడిందంటున్నారు. ఈ విషయం తెలిసిన తరువాత ఐటీ శాఖ మంత్రి డీ శ్రీధర్ బాబు రిజ్వీకి ఫోన్ చేసి వీఆర్ఎస్ విరమించుకుని విధుల్లో కొనసాగాల్సిందిగా కోరారు. ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మధ్య వివాదం సమసిన వెంటనే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వివాదం తెరమీదికి వచ్చింది. ఒక దాని తరువాత మరో వివాదం తెరమీదికి రావడంతో కాంగ్రెస్ కార్యకర్తలు అంతర్గతంగా మథనపడుతున్నారు. వరుస వివాదాల కారణంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరింత పలుచన అయ్యే ప్రమాదముందని ఆందోళన చెందుతున్నారు. ఇదే రీతిన గొడవలు, వివాదాలు జరిగితే ప్రజలు ఛీత్కరించుకుని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యామ్నాయ పార్టీని చేరదీసే అవకాశాన్ని తోసిపుచ్చలేమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మంత్రి, ప్రిన్సిపల్ సెక్రటరీ మధ్య వివాదం
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత సీఎం రేవంత్ రెడ్డి.. జూపల్లి కృష్ణారావుకు ఎక్సైజ్ శాఖ అప్పగించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన నాటి నుంచి ఒకే కంపెనీ మద్యం బాటిళ్లకు లేబుల్స్ సరఫరా చేస్తున్నది. హై సెక్యురిటీ హాలోగ్రామ్స్, 2డీ బార్ కోడింగ్ టెండర్లకు సంబంధించి గత ఏడాదిన్నరగా వివాదం నడుస్తోంది. నకిలీ మద్యం కట్టడి కోసం ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. దీనిపై టెండర్లు ఆహ్వానించగా, తాను సూచించిన కంపెనీకి ఇవ్వకుండా రిజ్వీ సమీక్ష పేరుతో కాలయాపన చేస్తున్నారనే ఆగ్రహంతో మంత్రి ఉన్నారనే గుసగుసలు సచివాలయంలో వినిపించాయి. పాత వారినే కొనసాగించడంపై కినుకతో ఉన్నారు. క్యాప్రికార్న్ బ్లెండర్స్ నుంచి రూ.6.15 కోట్లు డీమరేజి చార్జీలు ముక్కుపిండి వసూలు చేయడంతో మంత్రి ఆగ్రహం మరింతగా రెట్టింపు అయ్యిందని సమాచారం. ఏబీడీ కంపెనీ మద్యం ఉత్పత్తి, ధరల విషయంలో జాప్యం చేయడం మూలంగా ప్రభుత్వానికి భారీ నష్టం వచ్చిందని, దీనికంతటికీ ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ కారణమని మంత్రి అంచనాకు వచ్చారని సమాచారం. ఏ4 దుకాణాల సంఘం ఇచ్చిన ఫిర్యాదుపై వివరణ ఇవ్వాలని 2024 ఆగస్టు నెలలో నివేదిక కోరగా, ఇప్పటి వరకు స్పందించలేదు. వివాదాస్పదమైన అంశాలపై నిర్ణయాలు తీసుకోవాలని ఒత్తిడి చేయడం, సమీక్షలు నిర్వహించిన తరువాత దబాయింపులకు పాల్పడ్డంతో ఆందోళనకు గురైన రిజ్వి, హరికిరణ్.. నిర్ణయాలు తీసుకోకుండా నేరుగా సీఎం రేవంత్ పేషీకి ఫైళ్లు పంపించడం మొదలుపెట్టారని తెలుస్తున్నది. తెలంగాణ సచివాలయం బిజినెస్ రూల్స్ ప్రకారం మంత్రులకు చాలా అంశాల్లో నిబంధనలు సడలించే అధికారం లేదని అభ్యంతరం వ్యక్తం చేస్తూ పంపించేవారని సీనియర్ అధికారులు చెబుతున్నారు. దీంతో అవమానానికి గురైన మంత్రి జూపల్లి ఇద్దరి అధికారులపై వ్యక్తిగతంగా కక్ష పెంచుకుని లేని పోని దుష్ప్రచారం చేస్తున్నారని సచివాలయంలో ఐఏఎస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
కొత్త కంపెనీల అనుమతుల్లో రూ.5వేల కోట్ల కుంభకోణం
రాష్ట్రంలో గతేడాది బీరు సరఫరాను యూబీ కంపెనీ నిలిపివేయడంతో, ప్రభుత్వం సోమ్ సహా ఐదు బ్రూవరీలకు అనుమతులు ఇచ్చింది. అక్రమాలు జరిగాయని ఆరోపణలు రావడంతో వెంటనే రద్ధు చేసింది. రాష్ట్రంలో యూబీ, ఏబీ కంపెనీ బీర్లే ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. ఇందులో రూ.5వేల కోట్ల లిక్కర్ స్కామ్ జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. గత మూడు నెలలుగా బీర్లు లభించకపోవడం వెనకాల కుట్ర ఇదేనని, దీన్ని సాకుగా చూపుతూ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సోమ్ డిస్టిలరీ అండ్ బ్రూవరీ కి సర్కార్ రెడ్ కార్పెట్ వేసిందని విమర్శలొచ్చాయి. బిల్లుల బకాయిలు చెల్లించడం లేదని కింగ్ ఫిషర్ బీర్ సరఫరాను నిలిపివేసిన తరువాత, సోమ్ రంగప్రవేశం చేసిందంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం 2024 మే నెలలో 27న బీర్ బ్రాండ్ల సరఫరాకు అనుమతించి, ఫిర్యాదులు రావడం, విమర్శలు వెల్లువెత్తడంతో మరుసటి నెల జూన్ లో అనుమతులు ఉపసంహరించుకున్నది. అన్నీ అనుకున్నట్లు అయితే పవర్ 1000, బ్లాక్ ఫోర్ట్, హంట్, వుడ్ పీకర్ బీరు బ్రాండ్లు మార్కెట్ లోకి వచ్చేవి. అయితే సోమ్ డిస్టిలరీస్ ముంబైలోని నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ కు తెలంగాణ ప్రభుత్వం నుంచి తమ బీర్ బ్రాండ్ లను సరఫరా చేయడానికి అనుమతి పొందామని గతేడాది సమాచారం ఇచ్చింది. బీఆర్ఎస్ పార్టీ ఈ అనుమతులపై విచారణ జరపాలని డిమాండ్ చేసింది. కొత్త బ్రాండ్ల ప్రవేశం వెనకాల భారీ కుట్ర, వేల కోట్ల అవినీతి జరుగుతున్నదని ఆరోపణలు చేసింది. సోమ్ డిస్టిలరీ కంపెనీ ప్రభుత్వ సంస్థల నుంచి రుణాలు తీసుకుని ఎగవేయడం, కల్తీ మద్యం వ్యాపారం చేయడంలో ప్రఖ్యాతి గాంచిందని విమర్శించింది. నకిలీ మద్యం ప్రవేశపెట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోందని బీఆర్ఎస్ ఆరోపించింది. ఈ సంస్థ ఉత్పత్తులతో పలువురు మరణించడంతో మధ్యప్రదేశ్‌లో నిషేధించారని పేర్కొంది. ఈ కంపెనీ నుంచి మాజీ సీఎం దిగ్విజయ సింగ్ లంచాలు తీసుకున్నారనే ఆరోపణలపై కేసులు నడుస్తున్నాయన్నారు. 2019-2020 లో ఇండస్ ఇండ్ బ్యాంక్ ద్వారా సోమ్ డిస్టిలరీ రూ.1.30 కోట్లు కాంగ్రెస్ కు విరాళాలు ఇచ్చిందని పేర్కొన్నారు. కల్తీ మద్యం తాగి 24 మంది చనిపోవడంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం సోమ్ డిస్టిలరీస్ ను సీజ్ చేసిని విషయాన్ని ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం దాచివేస్తున్నదన్నారు. ఈ ఆరోపణలు చేసిన బీఆర్ఎస్ నాయకుడు క్రిశాంక్ పై మధ్యప్రదేశ్ లోని భోపాల్ కోర్టులో సోమ్ కంపెనీ నవంబర్ నెలలో కేసు వేసింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి సోమ్ సంస్థ రూ.575 కోట్లు పన్నులు చెల్లించకపోవడంతో బ్లాక్ లిస్టులో పెట్టారని, కల్తీ బీర్లు తాగి చాలా మంది చనిపోయారని అసెంబ్లీలో సైతం బీఆర్ఎస్ సభ్యులు లేవనెత్తారు. నిజాలు నిగ్గు తేల్చేందుకు హౌస్ కమిటీ వేయాలని గతేడాది జూలై నెలలో డిమాండ్ చేశారు. కల్తీ మద్యంతో పాటు చిన్న పిల్లలను పనిలో పెట్టుకున్నారని మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ ట్రేడ్ లైసెన్స్‌ను రద్ధు చేశారు. వివిధ మద్యం కంపెనీలపై అధికారులు దాడులు చేయగా ఈ విషయం వెలుగు చూసింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బీర్లు, మద్యం కంపెనీలకు రూ.1,500 కోట్లు బకాయిలు పడింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత తీసుకున్న స్టాక్‌కు డబ్బులు చెల్లిస్తున్నది కానీ, బీఆర్ఎస్ హయాంలో బకాయి పడిన రూ.1500 కోట్లు మాత్రం చెల్లించడం లేదు. రాష్ట్రంలో రోజుకు 20 లక్షలకు పైగా బీర్ల విక్రయాలు, డిమాండ్‌కు తగ్గ సప్లయి లేదు. తెలంగాణలో బడ్వైజర్, నాకౌట్, రాయల్ చాలెంజ్, కింగ్ ఫిషర్, కార్లస్ బెర్గ్, హైవార్డ్స్, టూబర్గ్, కరోనా వంటి బ్రాండ్లు ఎక్కువగా అమ్ముడవుతాయి.
రెండేళ్లలో వరుస బదిలీలతో మనస్తాపం
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రిజ్వీని వరుసగా బదిలీ చేస్తున్నారు. దీంతో ఆయన ఒకింత అవమానానికి గురవుతున్నారని ఐఏఎస్ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకునే నాటికి వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శిగా రిజ్వీ కొనసాగుతున్నారు. 2023 డిసెంబర్ 14న విద్యుత్ శాఖ కార్యదర్శి పదవితో పాటు టీజీ ట్రాన్స్ కో, టీజీ జెన్కో సీఎండీ గా బాధ్యతలు అప్పగించింది. మరుసటి సంవత్సరం 2024 జూన్ 24న వాణిజ్య పన్నుల శాఖ కార్యదర్శిగా బదిలీ చేసింది. ఆ తరువాత ఎక్సైజ్ శాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించింది. 2025 సెప్టెంబర్ నెలలో సాధారణ పరిపాలన విభాగం (జేఏడీ) పొలిటికల్ కార్యదర్శిగా నియమించింది.