- కాంగ్రెస్ పాలనలో మూడు పంట సీజన్లు
- ఒక సీజన్‌కే భరోసా.. ఒక యాసంగి సున్నా
- అందులోనూ సుమారు 5వేల కోట్ల బకాయి
- బకాయిల కోసం 18 లక్షలమంది వెయిటింగ్
- ఈ ఏడాది మార్చికల్లా చెల్లిస్తామన్న మంత్రులు
- తేదీలు దాటిపోతున్నా ఆచరణలో శూన్యం
- రాష్ట్రవ్యాప్తంగా సాగులో కోటీ 58 ఎకరాలు
- వాటిపై 74 లక్షల మంది పట్టాదారులు
- 15వేలు ఇస్తామంటూ ఎన్నికల్లో ప్రచారం
- ఇప్పుడు 12వేలకే రైతు భరోసా పరిమితం
Rythu Bharosa |
హైదరాబాద్, (విధాత): రైతుబంధు పేరు మారింది కానీ రైతులకు భరోసా కల్పించేలా కాంగ్రెస్ ప్రభుత్వం తీరు లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత తాజాది కలుపుకొని మూడు పంట సీజన్లకు (కారు) రైతు భరోసా చెల్లించాల్సి ఉన్నది. కానీ.. ఒక్క కారు పంటకే ఇచ్చారు. ఈ యాసంగి పంటకు ఇప్పటి వరకు సగమే అనగా రూ.4,166 కోట్ల వరకు ఇచ్చారు. ఇంకా రూ.4,834 కోట్ల వరకు ఇవ్వాల్సి ఉంది. ఇవి కూడా ఇస్తారా? లేదా ఎగ్గొడతారా? అనే భయం రైతుల్లో కనిపిస్తున్నది.
కాంగ్రెస్ ప్రభుత్వం 2023 డిసెంబర్‌లో కొలువుదీరింది. అప్పటికే యాసంగి పంటకు చెల్లించేందుకు ఖజానాలో రైతు భరోసా నిధులు ఉండగా, వాటిని కాంట్రాక్టర్లకు మళ్లించారనే ఆరోపణలు ఉన్నాయి. ఆలస్యంగానైనా యాసంగి పంటలకు రూ.5వేల చొప్పున ఒక ఎకరాకు మొత్తం రూ.7వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేశారు. వాస్తవానికి తెలంగాణ వ్యవసాయ శాఖ 72 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు వేయాల్సి ఉండగా కేవలం 39 లక్షల మంది రైతుల ఖాతాల్లోకే నిధులు జమ అయ్యాయి.
పోరంబోకు భూములకు, భూ సేకరణ చేసిన స్థలాలకు, విక్రయించిన భూములకు, కొండలు, గుట్టలు, దొంగ పాస్ బుక్స్ ఉన్నవారికి రైతు బంధు వేశారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మొదలుకొని ముఖ్యమంత్రి వరకూ గతేడాది వానకాలంలో గత ప్రభుత్వాన్ని బదనాం చేశారు. సుమారు ఆరు నెలల పాటు మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావును తిట్టి పోశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏడాదిలో రెండు కార్ల పంటలకు ఒక్క ఎకరాకు రూ.10 వేలు ఇవ్వగా, తాము అధికారంలోకి వచ్చిన తరువాత రూ.15వేలు ఇస్తామంటూ ఎన్నికల్లో ప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీ.. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత నాలుక మడతేసింది. రైతు భరోసాను రూ.12వేలకే పరిమితం చేసింది. వాస్తవానికి ఒక్క ఎకరాకు ఒక్క పంటకు రూ.7500 చొప్పున రైతుల ఖాతాల్లో వేయాలి. కాని రూ.6వేలు చొప్పున మాత్రమే వేస్తున్నది. ఒక ఎకరానికి రూ.1500 చొప్పున కోత పెట్టింది. అయితే.. సన్నాలకు బోనస్ వంటివాటిని చూపి సమర్థించుకునే ప్రయత్నం చేసింది.
ఈ యాసంగిలో (2025 జనవరి నుంచి ఏప్రిల్) 70 లక్షల మంది రైతులకు గాను 52 లక్షల మంది రైతులకు రూ.4,166 కోట్లు వారి ఖాతాల్లో వేశారు. నాలుగు ఎకరాల వరకు ఈ మొత్తాన్ని వేశారు. ఇంకా 18 లక్షల మంది రైతులకు రూ.4,834 కోట్లు వ్యవసాయ శాఖ బకాయి పడింది. మార్చి 31వ తేదీ, 2025 నాటికి పూర్తిగా చెల్లిస్తామని మంత్రులు పలు వేదికలపై గతంలో ప్రకటించినా ఆచరణ సాధ్యం కాలేదు. సోమవారం నాడు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన రైతు మహోత్సవంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు మాట్లాడుతూ, త్వరలో రైతుల ఖాతాల్లో పెండింగ్ రైతు భరోసా డబ్బులు వేస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల విస్తీర్ణం వారికి ఎంత మొత్తం వేశారు? ఎంత మందకి వేశారు? ఇంకా ఎంత మందికి ఇవ్వాల్సి ఉన్నది? అనే వివరాలు చెప్పలేదు. ఎన్ని ఎకరాల వరకు ఇస్తున్నామనేది కూడా వ్యవసాయ శాఖ మంత్రితో పాటు మిగతా మంత్రులు కూడా బహిరంగంగా చెప్పడం లేదు.
రాష్ట్రవ్యాప్తంగా పలు గ్రామాలలో ఆస్తి పన్నులు చెల్లిస్తున్న వారికి, పది ఎకరాలకు పైగా భూములు ఉన్న రైతులకు భరోసా డబ్బులు వేయడం లేదు. మా సంగతేంటని వీళ్లందరూ మండల వ్యవసాయ అధికారి, స్థానిక ఎమ్మెల్యే కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మాకు కూడా ఏమీ తెలియదు అంటూ దాటవేస్తూ అధికారులు కూడా వారిని తిప్పి పంపిస్తున్నారు. రైతు భరోసా విధి విధానాలపై ఏర్పాటు అయిన మంత్రివర్గ ఉప సంఘం రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి, రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించింది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన రైతు భరోసాపై మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేశారు. ఈ ఉప సంఘంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, ఐటీ శాఖ మంత్రి డీ శ్రీధర్ బాబు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సభ్యులుగా ఉన్నారు. ఉప సంఘం ఇచ్చిన నివేదిక ప్రకారం రాష్ట్రంలో 74 లక్షల మంది పట్టాదారులు ఉండగా 1 కోటి 58 లక్షల ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. సుమారు ఐదు లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయడం లేదని తేల్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆరు సంవత్సరాల వ్యవధిలో 12 సార్లు రైతు బంధు కింద ఖాతాల్లోకి 12 విడతలు డబ్బులు జమ చేశారు. మొత్తం రూ.80,453 కోట్లు చెల్లించగా, ఇందులో వ్యవసాయ యోగ్యం కాని భూములకు రూ.25,672 కోట్లు చెల్లించారని మంత్రివర్గ ఉప సంఘం లెక్కలు తేల్చింది.
ఖాళీగా రైతు భరోసా చైర్మన్ పదవి
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయి ఏడాదిన్నర అవుతున్నా ఇంతవరకూ రైతు భరోసా సమితి చైర్మన్ పదవిని, సభ్యులను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి నియమించలేదు. చైర్మన్, సభ్యులు లేకపోవడంతో వ్యవసాయ శాఖ అధికారులు ఇష్టారీతిన ప్రవర్తిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పదవులను భర్తీ చేస్తారా? లేదా? అనేది కూడా ప్రభుత్వం స్పష్టతనివ్వడం లేదు. గన్ ఫౌండ్రీ లోని రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో రైతు భరోసా కార్యాలయం కొనసాగుతున్నది. వ్యవసాయ శాఖ మంత్రి ఇతర కార్యక్రమాల్లో బీజీగా గడపడంతో రైతు భరోసాపై సమీక్షించేవారు లేకుండా పోయారని అంటున్నారు. బీఆర్ఎస్ హయాంలో ప్రస్తుత శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి రైతు బంధు తొలి చైర్మన్‌గా పనిచేశారు. ఆ తరువాత ప్రస్తుత ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఆ తరువాత స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పనిచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచీ ఎవరినీ నియమించకుండా ఖాళీగా పెట్టారు.