Telangana Language Debate | విధాత ప్రత్యేక ప్రతినిధి: సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ సంస్కృతి, యాస, భాషలను వలసవాదులు అగౌరవపరిచారనేది ఈ ప్రాంత ప్రజల ప్రధానమైన ఆక్షేపణ. ప్రత్యే క తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి ఊపిరిపోసిన ప్రధాన అంశాల్లో ఇదొకటి. తెలంగాణ అస్తిత్వ రక్షణ, పురోగతి పైన జరుగాల్సిన చర్చ ఒక వైపు ఉన్నప్పటికీ ఇప్పుడు ‘భాష’ ప్రధాన సమస్యగా మారింది. భాష అంటే తెలంగాణ యాస అనుకునేరు! అనర్గళంగా ఆంగ్లాన్ని మాట్లాడడమే. ఈ అంశం సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల పలు సందర్బాల్లో పదేపదే లేవనెత్తుతున్నారు. ఇప్పటికే పలు సభలో ఈ ఇంగ్లీష్ భాషా ప్రావీణ్యత పైన మాట్లాడారు. దీనిపై ఆయన తనదైన శైలిలో సెటైర్లు వేస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం క్రెడాయ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఈ భాష సమస్యను లెవనెత్తారు. ఒకింత ఘాటుగానే స్పందించారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఆయన విదేశీపర్యటనల్లో, ఇతర వ్యాపార, వాణిజ్య, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట్లాడుతున్న ‘ఇంగ్లిష్ భాష’ పై ప్రత్యర్ధి ప్రతిపక్షపార్టీ ట్రోలింగ్ చేసిన విషయం తెలిసిందే. దీన్ని జీర్ణించుకోలేని సీఎం తన ఆత్మగౌరవానికి ఇంగ్లీష్ భాష పై పట్టుండడమే ప్రధానం కాదని పదేపదే చెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలో ప్రతిపక్షపార్టీకి చెందిన సదరు నాయకుడు కేటీఆర్‌ను ఉద్దేశించే పరోక్షంగా విమర్శలు, సెటైర్లు వేస్తున్నారు. ఈ సందర్భంలో సీఎం భాషకున్న పరిమితులు, ప్రాధాన్యతను స్పష్టం చేయడం గమనార్హం.
ఉద్యమానికి ‘తెలంగాణ’ గుండెకాయ
తెలంగాణ ప్రజల సుదీర్ఘపోరాటం, అమరవీరుల త్యాగఫలితంగా ప్రత్యేక రాష్ట్రం సిద్ధించింది. ఈ ఫలితం వెనుక తెలంగాణ యాస, భాష, అస్తిత్వం కీలక భూమిక పోషించాయి. ఉద్యమకాలంలో ఉవ్వెత్తున ఎగిసిన తెలంగాణ ఆటా, పాట, కవిత, గేయం, సంస్కృతి, సంప్రదాయం, ఒక్కటేమిటి.. తెలంగాణ తన హృదయాన్ని ప్రజల ముందు ఆవిష్కరించుకున్నది. తన మనోగతాన్ని బహిరంగ పరుచుకున్నందునే అందరూ ఉపయోగించే ‘సెంటిమెంటు’ పంటపండి ప్రత్యేక రాష్ట్రం ఫలించింది.
రాష్ట్రం దశాబ్దకాలం పూర్తి
రాష్ట్రం ఏర్పడి దశాబ్దకాలం పూర్తవుతోంది. ఈ దశాబ్దకాలంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ తెలంగాణ సంస్కృతి, యాస, భాష, సంస్కృతి పరిరక్షణకు ఏ మేరకు ప్రాధాన్యం ఇచ్చారనేది చర్చనీయాంశం. అంతా మన కళ్ళముందే ఉన్నది. దీనిపై వివిధ వర్గాల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. ప్రస్తుతం బీఆర్ఎస్ స్థానంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు కూడా తెలంగాణ సంస్కృతి, యాస, భాష ప్రత్యేకతలను సంరక్షించుకుంటూ వాటి గొప్పదనాన్ని ఉన్నతీకరించేందుకు ఈ ప్రభుత్వం. ఏం చేస్తుందనేది అత్యంతముఖ్యమైంది. కానీ ,దీనికి విరుద్ధమైన అంశాలపై చర్చలు సాగడం పట్ల తెలంగాణ వాదులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
బీఆర్ఎస్ పైన విమర్శలు
తెలంగాణ ఉద్యమ నాయకుడే సీఎం అయ్యారని, మన సంస్కృతి, యాస, భాషకు ఎక్కడలేని గౌరవం, ప్రాధాన్యం ఇస్తారని అంతా భావించినప్పటికీ బీఆర్ఎస్ అధికారంలో ఉన్న దశాబ్దకాలంలో అధినేత ప్రజలను ఆకట్టుకునేందుకు మాత్రమే తన రాజకీయ ఉపన్యాసంలో తెలంగాణ యాస, భాషను వినియోగించారని, ఎంతైతే తెలంగాణ ప్రజల్లో గూడుకట్టుకున్న అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలో అంత ఇవ్వలేదనే విమర్శ ఉంది. ఈ కారణంగానే తెలంగాణ అస్తిత్వ పార్టీగా ఆవిర్భవించిన టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చడాన్ని చాలా మంది జీర్ణించుకోలేకపోయారు. ఇప్పటికీ ఈ సమస్య పై భిన్నాభిప్రాయాలు ఆ పార్టీలో ఒక పాయగా సాగుతూనే ఉన్నాయి. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఇవ్వాల్సిన గుర్తింపు ఇచ్చిఉంటే ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ పైన, ప్రభుత్వం పైన ఒత్తిడి ఉండేది. కానీ, దీనికి భిన్నమైన పరిస్థితిని బీఆర్ఎస్ ఎదుర్కొంటోంది. ఇప్పుడు తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడడంతోపాటు అభివృద్ధి చేసే గురుతర బాధ్యత కాంగ్రెస్ సర్కారు పై ఉందంటున్నారు.
భాష కంటే కామన్ సెన్సు ముఖ్యం: రేవంత్
సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే పలు ప్రధాన సమావేశాల్లో భాష ప్రాధాన్యం వివరించారు. ఇందులో ఇంగ్లిష్ భాష రావడం పైన తనదైన పద్ధతిలో స్పందించారు. తాజాగా ఆయన దీనిపై మాట్లాడుతూ భాష ముఖ్యమే కానీ దీనికంటే కామన్ సెన్సు ముఖ్యమంటూ వివరించారు. మన మాతృభాషకున్న గౌరవాన్ని గతంలోనే వివరించారు. మాతృభాషతో పాటు మరో భాష రావడం వల్ల అదనపు ప్రయోజనం ఉంటుందే తప్ప అదే ముఖ్యమని భావిస్తే తప్పన్నారు. ఇంగ్లిష్ రావడమే గొప్పయితే అమెరికాలో అందరూ ఆ భాషే మాట్లాడుతారని, అది వారి మదర్ టంగ్ అంటూ వివరించారు. రెస్టారెంట్‌లో వెయిటర్లు సైతం అద్భుతంగా ఇంగ్లిష్ మాట్లాడుతారని కేటీఆర్‌నుద్దేశించి సెటైర్లు వేశారు. అభివృద్ధి చెందిన దేశాలైన చైనా, జపాన్, జర్మనీలో పెద్దగా ఇంగ్లీస్ వినియోగించరని అంత మాత్రాన వాళ్ళేం తక్కవకాదంటూ వివరించే ప్రయత్నం చేశారు. నేను పెద్ద చదువులు చదువుకోకపోయినా నాకు కామన్ సెన్సు ఉందన్నారు. ఒక భాష వస్తే నాలెడ్జ్ ఉన్నట్లు కాదని అది కమ్యూనికేషన్ కోసం మాత్రమే ఉపయోగపడుతుందనే అన్నారు. తెలివితేటలకు, భాషకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ఏదీ ఏమైనా సీఎం ఇటీవల తన భాష పట్టును పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంగ్లీష్ భాష పరిజ్క్షానం ఉంటే తప్పుకాదుగానీ, తెలంగాణ యాస,భాష, సంస్కృతి పరిరక్షించుకోకుంటే అస్తిత్వానికే ప్రమాదమని తెలంగాణవాదులు గుర్తుచేస్తున్నారు. ఇప్పటికే నష్టం జరిగిందని, దాన్ని పూడ్చేందుకు ప్రయత్నం చేయాలని కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి..
Modi RSS praise Red Fort Controversy | మోదీ నోట ఆరెస్సెస్ మాట వెనుక!
Robot Olympics China : మనుషులకంటే మేమేం తక్కువా?..రోబోలకు ఒలంపిక్స్ పోటీలు!
ఇక మూడు ఫార్మాట్లకు ఒకే కెప్టెన్? – బిసిసిఐ మదిలో గిల్!