విధాత ప్రతినిధి, హైదరాబాద్:
Gopanpally Land Scam | రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపనపల్లిలో ఉన్నతాధికారులు స్వయంగా ఒక పెద్ద భూకుంభకోణానికి తెరతీశారు. రంగనాథనగర్ లే అవుట్‌లో ప్లాట్ల అమ్మకాలు రిజిస్ట్రేషన్లు నిలిపివేయడం ద్వారా పెద్ద ఎత్తున సెటిల్‌మెంట్ల బాగోతానికి రంగం సిద్ధం చేశారు. రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలంటే ఈ భూములకు సంబంధించి ఏదో ఒక ప్రభుత్వ జీవో ఇవ్వాలి. కానీ ఎటువంటి జీవో ఇవ్వకుండానే నోటిమాటతో జిల్లా కలెక్టర్ రిజిస్ట్రేషన్లు నిలిపివేశారు. రంగనాథనగర్ లేఅవుట్ భూమితోపాటు గోపనపల్లిలోని వందలాది ఎకరాల భూమిని త్వరలోనే ప్రభుత్వం సేకరించనుందని, అందువల్ల అక్కడ రిజిస్ట్రేన్లు నిలిపివేయాలని కలెక్టర్ చెబుతున్నట్టు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. నిజానికి రంగనాథనగర్ లేఅవుట్ భూమిని ఐటీ సెజ్‌కోసం స్వాధీనం చేసుకుంటామని 2005లోనే రాష్ట్ర ప్రభుత్వం ఒక ముసాయిదా గెజిట్ ప్రచురించింది. రకరకాల కారణాల చేత ప్రభుత్వం ఆ తర్వాత ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. ఆ గెజిట్‌కు అప్పుడే కాలం చెల్లిపోయింది.
అక్కడ భూమిని సేకరించే ఉద్దేశం లేదని ఆ తర్వాత రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా వచ్చిన రఘునందన్‌రావు ఒక వివరణ ఇచ్చారు. 2005లో ఇచ్చిన గెజిట్‌కు కాలం చెల్లిపోయిందని 2014 జూన్ 9న కలెక్టర్ ఒక ఎండార్సుమెంటు ఇచ్చారు. అంతేకాదు, గోపనపల్లి 127 నుంచి 173 వరకు, 263 నుంచి 286 వరకు సర్వే నంబర్లలో గల 439 ఎకరాల పట్టా భూమిని స్వాధీనం చేసుకునే ఉద్దేశం లేదని, భూముల విలువలు విపరీతంగా పెరిగిపోయాయని అంత ఖరీదుతో భూములను సేకరించే అవకాశం లేదని 2024 ఏప్రిల్ 18న ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి టీఎస్‌ఐఐసీ వైస్ చైర్మన్‌కు ఒక లేఖ కూడా రాశారు. అంతేగాక సేకరించ తలపెట్టిన భూముల్లో చాలా భవనాలు, నివాసాలు నిర్మాణమైన విషయాన్ని కూడా ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి తన లేఖలో ప్రస్తావించారు.
ఏ స్వాధీన పత్రమైనా రెండేళ్ల తర్వాత చెల్లదని, భూమిని స్వాధీనం చేసుకోవాలంటే తిరిగి కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చి స్వాధీన ప్రక్రియను చేపట్టాలని ఉన్నత న్యాయస్థానాలు గతంలోనే చెప్పాయి. కానీ దేశంలోనే ఎక్కడా లేని విధంగా రంగారెడ్డి జిల్లాలో జరుగుతున్నది. ఏ ప్రభుత్వ జీవో లేకుండా రిజిస్ట్రేషన్లు ఎలా ఆపాలో తెలియక సబ్ రిజిస్ట్రార్లు తలలు పట్టుకుంటున్నారు. జిల్లా కలెక్టరు మాత్రం నోటిమాటగా రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని కోరుతున్నారు. స్వాధీనం చేసుకునే ఉద్దేశం లేనప్పుడు రిజిస్ట్రేషన్లు ఎందుకు నిలిపివేస్తున్నట్టు. మొత్తం 439 ఎకరాల భూమిలో సగానికిపైగా విల్లాలు, ఇతర నిర్మాణాలు వెలిశాయి. అటువంటప్పుడు ఆ భూమినంతా స్వాధీనం చేసుకోబోతున్నామని జిల్లా కలెక్టరు ఎలా చెబుతున్నారని గోపనపల్లి స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఎవరికో భూమి సెటిల్మెంట్లకు అవకాశం కల్పించడంకోసమే కలెక్టర్ ఇలా వ్యవహరిస్తున్నారని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆరోపించారు. ఇది కచ్చితంగా పెద్ద భూ కుంభకోణమని ఆయన విమర్శించారు.
Read Also |
Congress Internal Conflicts | చేతులు కాలాక.. ఆకులు పట్టకున్నట్టు రేవంత్ తీరు!
Vastu Tips | ‘రూపాయి’తో రాత్రిళ్లు అలా చేశారంటే.. అప్పులన్నీ మాయమైపోతాయట..!
Python Attack Zoo Keeper : జూ కీపర్ పై కొండ చిలువ దాడి.. వీడియో వైరల్
