Revanth Reddy Secretariat Absence | ముఖం చాటేస్తున్న ముఖ్యమంత్రి?

సీఎం నివాసం దగ్గర కూడా దేశ సరిహద్దు సమీపంలో ఉండే తరహాలో పోలీస్‌ అవుట్‌ పోస్టులు ఉంటున్నాయి. దీంతో సాధారణ ప్రజలు ముఖ్యమంత్రిని ఆయన నివాసం వద్ద కలిసేందుకు కూడా వీలు లేకుండా పోతున్నది. ఇక ముఖ్యమంత్రి తరచూ వెళ్లే కార్యాలయం.. పోలీస్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌. ఇక దీనిలోకి సాధారణ ప్రజల ప్రవేశం గురించి మాట్లాడుకునే అవకాశమే లేదని రాజకీయవర్గాలు చెబుతున్నాయి.

Revanth Reddy Secretariat Absence | హైద‌రాబాద్‌, జూలై 20 (విధాత‌): ఇది ఇందిరమ్మ పాలన.. మాది ప్రజా ప్రభుత్వం.. ప్రగతిభవన్‌ కంచెలు బద్దలు కొట్టాం.. పాలనను ప్రజల చెంతకు తెచ్చాం.. సచివాలయంలోకి వచ్చేందుకు ప్రజలకు అవకాశం కల్పించాం.. ఇదీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఆయన క్యాబినెట్‌ సహచరులు నిత్యం వల్లించే వచనాలు! కానీ.. వాస్తవ స్థితి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తున్నది. దానికి కారణాలు కూడా స్పష్టంగానే ఉన్నాయి. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చేనాటికే ఖజానా ఖాళీగా ఉన్నది. ఆ పరిస్థితిని కాంగ్రెస్‌ ముందుగా ఊహించలేదని భావించడానికీ లేదు. అయినా.. ఇబ్బడిముబ్బడిగా హామీలు గుప్పించేశారు. అన్నీ డబ్బులతో కూడుకున్నవే కావడంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితే కీలకంగా మారింది. రానురాను అది తలకు మించిన భారంగా పరిణమించింది. హామీలు ఇచ్చినా వాటిని అమలు చేసే పరిస్థితి కనిపించడం లేదు. ఆ విషయాన్ని ముఖ్యమంత్రే స్వయంగా చెబుతూ చేతులెత్తేశారు. ఎక్కడా అప్పు పుట్టడం లేదని చెప్పేశారు. మరి అప్పులు తేకుండా, రాష్ట్ర సొంత ఆర్థిక రాబడులు పెరగకుండా పాలన ఎలా సాగుతుంది? ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి సచివాలయానికి రాకుండా ముఖం చాటేస్తున్నారా? అన్న సందేహాలను రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. సీఎం మాత్రమే కాదు.. అధికారులు కూడా ప్రజలను నేరుగా కలిసేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నారన్న వాదనలు బలపడుతున్నాయి. బీఆరెస్‌ అధికారంలో ఉన్న కాలంలో నాటి సీఎం కేసీఆర్‌ ‘సచివాలయానికి రారు.. ప్రజలనే కాదు.. ప్రజాప్రతినిధులను కూడా కలవరు’ అనే అభిప్రాయం ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. అది కూడా బీఆరెస్‌ ఓటమిలో కీలక పాత్ర పోషించింది. నాడు గడీ ముఖ్యమంత్రి అన్న రేవంత్‌ రెడ్డి.. ఇప్పుడు ఇంటికి లేదంటే తన ఇంటికి సమీపంలోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు పరిమితమవుతున్నారే తప్పించి.. సచివాలయానికి మాత్రం రావడంలేదు. దీంతో నాటి సీఎంకు, నేటి సీఎంకూ తేడా ఏమీ లేదని తేలిపోయిందని ఒక సీనియర్‌ జర్నలిస్టు అభిప్రాయపడ్డారు.

క్యాబినెట్‌ సమావేశాలకే!

సీఎంగా బాధ్య‌త‌లు తీసుకున్న త‌రువాత కొంత కాలం క్ర‌మం త‌ప్ప‌కుండా స‌చివాల‌యానికి వ‌చ్చిన రేవంత్‌రెడ్డి.. ఆ తర్వాత రావటం తగ్గించేశారు. మంత్రి వ‌ర్గ స‌మావేశాలు లేదా ఏదైనా పథకం ప్రారంభోత్సవాలకు మాత్రం మొక్కుబడిగా హాజరవుతున్నారు. దీంతో మొద‌ట్లో ఈ సీఎం కు కూడా ఏమైనా వాస్తు భయాలు ఉన్నయాలు ఉన్నాయా? అందుకే రావడం లేదా? అన్న చర్చ జరిగింది. స‌చివాల‌యానికి వాస్తు పేరిట మార్పులు జరిగిన తర్వాత కూడా సీఎం ఎందుకు రావడం లేదన్న ప్రశ్న ఎదురవుతున్నది. సీఎం క్ర‌మం త‌ప్ప‌కుండా స‌చివాల‌యానికి వ‌స్తే వివిధ స‌మ‌స్య‌ల‌పై వ‌చ్చే ప్ర‌జ‌ల‌ను.. త‌మ నియోజ‌క‌వ‌ర్గాల‌కు చెందిన స‌మ‌స్య‌లు, అభివృద్ధి పనుల నిధుల కోసం వ‌చ్చే ప్ర‌జాప్ర‌తినిధులను కలవాల్సి వస్తుందని, వారికి సమాధానం చెప్పలేకే మొఖం చాటేస్తున్నార‌న్నచ‌ర్చ రాజకీయ వ‌ర్గాల‌లో వినవస్తున్నది. సీఎం రాకపోగా.. సీఎంవో అధికారులు సైతం ప్రజలను సీఎం కార్యాలయం ఉన్న ఆరో అంతస్తుకు రానీయడం లేదని తెలుస్తున్నది. ఇక్కడ భారీ స్థాయిలో పోలీస్‌ పహారా ఉంటున్నది. ఏ ఒక్కరినీ వారు ఆరో అంతస్తులోకి ప్రవేశించడానికి అంగీకరించడం లేదు. అపాయింట్‌మెంట్‌ ఉంటే తప్ప సీఎంవో అధికారులను కలవలేని పరిస్థితి ఉందని వివిధ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు చెబుతున్నారు. సీఎం నివాసం దగ్గర కూడా దేశ సరిహద్దు సమీపంలో ఉండే తరహాలో పోలీస్‌ అవుట్‌ పోస్టులు ఉంటున్నాయి. దీంతో సాధారణ ప్రజలు ముఖ్యమంత్రిని ఆయన నివాసం వద్ద కలిసేందుకు కూడా వీలు లేకుండా పోతున్నది. ఇక ముఖ్యమంత్రి తరచూ వెళ్లే కార్యాలయం.. పోలీస్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌. ఇక దీనిలోకి సాధారణ ప్రజల ప్రవేశం గురించి మాట్లాడుకునే అవకాశమే లేదని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. ‘య‌థా రాజా త‌థా ప్ర‌జ.. అన్న తీరులో అధికారులు సైతం ప్రజలను కలిసేందుకు సిద్ధపడటం లేదని సమాచారం. ఆర్థిక శాఖ కార్యాయ‌లం ముందు కూడా అద‌న‌పు పోలీస్ బందోబ‌స్తు ఏర్పాటు చేసుకున్నారు. పేరుకే విజిటింగ్‌ అవర్స్‌ అని చెబుతున్నా.. అవి సక్రమంగా అమలవుతున్న పరిస్థితి కనిపించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. సీఎం ప్ర‌జ‌లను క‌లువ‌డ‌న్న అభిప్రాయం సామాన్యుల నోళ్ల‌లో నానితే ప్ర‌భుత్వ ఉనికికే ప్ర‌మాద‌మని రాజకీయ ప‌రిశీల‌కులు హెచ్చరిస్తున్నారు.

ఆర్థిక స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌తం అవుతున్న స‌ర్కారు

ప్రభుత్వానికి అద‌న‌పు ఆదాయం వ‌చ్చే మార్గాలు క‌నిపించ‌డం లేదు. భూముల విక్ర‌యాల‌కు బీఆరెస్ అడ్డుక‌ట్ట వేయ‌డంతో వాటిని విక్ర‌యించ‌లేని స్థితి ఏర్ప‌డింది. మ‌రోవైపు ఎల్ ఆర్ ఎస్‌, బీపీఎస్‌ల ప‌రిస్థితీ అలాగే ఉంది. రియ‌ల్ ఎస్టేట్ రంగం నేల చూపులు చూస్తోంది. ఇలా స్వంత ఆదాయ వ‌న‌రులు త‌గ్గిపోతుండ‌టం రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని క‌లవ‌ర‌పెడుతున్న‌ది. ఆదాయ మార్గాల అన్వేష‌ణ కోసం ఏర్పాటైన క్యాబినెట్ స‌బ్ క‌మిటీ కూడా విప్ల‌వాత్మ‌క నిర్ణ‌యాలు తీసుకున్న‌ట్లు క‌నిపించ‌డం లేద‌న్న అభిప్రాయం ఆర్థిక రంగ నిపుణుల్లో వ్య‌క్తమవుతున్నది. ఆదాయం లేక ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీలు అమ‌లు చేయ‌లేక‌నే స‌ర్కారు స‌త‌మ‌తం అవుతున్న‌ద‌ని విశ్లేష‌కులు చెపుతున్నారు.