ఢిల్లీలోని ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. తెల్లారితే కీలకమైన బీహార్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో కనీసం 8 మంది చనిపోయినట్టు పోలీసులు చెబుతున్నారు. అనేక మంది గాయపడ్డారు. ఎర్రకోట మెట్రోస్టేషన్ గేట్ నంబర్ 1 వద్ద ఈ పేలుడు సంభవించింది. పేలుడుకు ఎవరు పాల్పడ్డారు? అనే విషయం ఇంకా నిర్ధారణ కాలేదు. భారతదేశంలో గతంలోనూ పేలుడు ఘటనలు చోటు చేసుకున్నాయి. వాటిలో ప్రధానమైన కొన్ని ఘటనలు పరిశీలిస్తే..
రామేశ్వరం కెఫె పేలుడు
బెంగళూరులోని రామేశ్వరం కెఫె పేలుడు దృశ్యం
మార్చి 1, 2024న బెంగళూరులోని బ్రూక్‌ఫీల్డ్‌లోని రామేశ్వరం కెఫెలో బాంబు పేలింది. ఈ ఘటనలో పది మంది గాయపడ్డారు. ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్‌ను పేల్చడం ద్వారా ఉగ్రవాదులు ఈ ఘటనకు పాల్పడ్డారని దర్యాప్తులో వెల్లడైంది.
భోపాల్–ఉజ్జయిని ప్యాసింజ్ రైలులో పేలుడు
2017 మార్చిలో భోపాల్–ఉజ్జయిని ప్యాసింజ్ రైలులో మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్ సమీపంలో పేలుడు సంభవించింది. భోపాల్‌కు సమీపంలోని జబ్డీ స్టేషన్ నుంచి ఉజ్జయిని వెళుతుండగా జనరల్ కోచ్‌లో ఉదయం 9.30 – 10 గంటల మధ్య ఈ పేలుడు చోటు చేసుకున్నది. పేలుడు తీవ్రతకు రైలు బోగీల అద్దాలు పగిలిపోయాయి. ఒక్కసారిగా పొగలు కమ్మేయడంతో ప్రయాణికులు బోగీల్లోని అతికష్టం మీద బయటపడ్డారు.
ఉజ్జయిని బ్లాస్
2013 బుద్ధ గయ బ్లాస్ట్
2013 జూలై ఏడో తేదీన ఉగ్రవాదులు బీహార్‌లోని పుణ్యస్థలం బుద్ధగయను టార్గెట్ చేసుకున్నారు. ప్రపంచ వారసత్వ ప్రదేశంగా యునెస్కో గుర్తించిన మహాబోధి ఆలయం వద్ద ఈ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు బౌద్ధ భిక్షువులు గాయపడ్డారు. పేలుడుకు కారణమైన ఐదుగురు ఉగ్రవాదులు ఇండియన్ ముజాహిదీన్ గ్రూప్‌నకు చెందినవారిగా గుర్తించారు.
మహాబోధి బ్లాస్ట్
2013 హైదరాబాద్ జంట పేలుళ్లు
2013 ఫిబ్రవరి 21వ తేదీ రాత్రి హైదరాబాద్‌లో జంట పేలుళ్లు సంభవించాయి. దిల్‌సుఖ్ నగర్ వద్ద జరిగిన ఈ రెండు పేలుళ్లలో 18 మంది చనిపోగా.. 131 మంది వరకూ గాయపడ్డారు. తొలుత బాంబు పేలిన ప్రాంతంలోనే కొద్ది క్షణాల వ్యవధిలో రెండో పేలుడు చోటు చేసుకున్నది. ఈ రెండు కేసుల విచారణ బాధ్యతలను అదే ఏడాది కేంద్ర హోం శాఖ ఎన్‌ఐఏకు అప్పగించింది.
హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్
2011 ముంబై ట్రిపుల్ బ్లాస్ట్స్
2011 జూలై 13వ తేదీన మూడు పేలుళ్లు ముంబై నగరాన్ని కకావికలం చేశాయి. దాదర్, జవేరీ బజార్, ఓపెరా హౌస్ వద్ద చోటు చేసుకున్న ఈ పేలుళ్లలో 27 మంది చనిపోగా, 100 మందికిపైగా గాయపడ్డారు. ఈ ఘటనలో బాధ్యులుగా 11 మందిపై దర్యాప్తు సంస్థలు కేసులు నమోదు చేశాయి. వీరిలో నిషేధిత ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదులు కూడా ఉన్నారు.
2011 ముంబై ట్రిపుల్ బ్లాస్ట్స్
2008 ఢిల్లీ వరుస పేలుళ్లు
2008 సెప్టెంబర్ 13న రాజధాని ఢిల్లీ నగరం బాంబు పేలుళ్లతో మారుమోగిపోయింది. కరోల్‌బాగ్, కన్నాట్ ప్లేస్, గ్రేటర్ కైలాశ్ ప్రాంతాల్లో జరిగిన పేలుళ్లలో 26 మంది చనిపోగా.. 135 మమడి వరకూ గాయపడ్డారు. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించింది. ఇదే రోజు పేలకుండా ఉన్న మరో మూడు బాంబులను బాంబు స్క్వాడ్ కనిపెట్టి.. వాటిని నిస్తేజం చేశాయి.
ఢిల్లీ సీరియల్ బ్లాస్ట్‌్
2006 ముంబై రైలు పేలుళ్లు
దేశంలో అత్యంత తీవ్రమైన పేలుళ్లు 2006లో ముంబైలో చోటు చేసుకున్నాయి. ముంబై లోకల్ రైళ్ల కోచ్‌లలో ఈ పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనల్లో 189 మంది చనిపోగా, 824 మంది గాయపడ్డారు. సాయంత్రం ఆరున్న సమయంలో రైళ్లు కిక్కిరిసి ఉండే సమయంలో ఈ పేలుళ్లు చోటు చేసుకోవడంతో మృతుల సంఖ్య భారీగా ఉన్నది. ప్రెషర్ కుక్కర్లలో ఈ బాంబులు అమర్చి పేల్చారు. ఈ కేసులలో మహారాష్ట్ర యాంటి టెర్రరిజం స్వ్కాడ్ (ఏటీఎస్) దర్యాప్తు చేస్తున్నది.
ముంబై లోకల్ ట్రైన్స్ బ్లాస్ట్
