Shree Charani | క్రికెటర్ శ్రీ చరణికి రూ.2.5కోట్ల నగదు..గ్రూప్ 1 ఉద్యోగం : చంద్రబాబు

ఉమెన్స్ వరల్డ్‌కప్ విజేత టీమిండియా క్రికెటర్ శ్రీ చరణి మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్‌తో కలిసి ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా చంద్రబాబు, శ్రీచరణికి రూ.2.5 కోట్ల నగదు పురస్కారం, గ్రూప్-1 ఉద్యోగం, కడపలో ఇంటి స్థలాన్ని ప్రోత్సాహకంగా ప్రకటించారు.

అమరావతి: ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ విజేత టీమిండియా క్రికెటర్ శ్రీ చరణి శుక్రవారం మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ తో కలిసి ఏపీ సీఎం చంద్రబాబును, మంత్రి నారా లోకేశ్ ను కలిశారు. సీఎం క్యాంపు కార్యాలయంలో చంద్రబాబును కలిసిన శ్రీచరణి, మిథాలీ రాజ్ లు ప్రపంచ్ కప్ గెలుచుకున్న అనుభూతులను పంచుకున్నారు. ప్రపంచ కప్ గెలవడం ద్వారా మహిళా క్రికెటర్లు దేశానికి, మహిళలకు స్ఫూర్తిదాయకంగా నిలిచారని చంద్రబాబు అభినందించారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తరుఫునా శ్రీచరణికి ప్రోత్సాహకంగా రూ.2.5 కోట్ల నగదు పురస్కారం ప్రకటించారు. దీంతో పాటు గ్రూప్‌-1 ఉద్యోగం, కడపలో ఇంటి స్థలాన్ని ఇవ్వనున్నట్లు వెల్లడించారు .

అంతకుముందు శ్రీచరణి, మిథాలీ రాజ్ లకు గన్నవరం విమానాశ్రయంలో మంత్రులు అనిత, సవిత, సంధ్యారాణి, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేశినేని చిన్ని, కార్యదర్శి సానా సతీష్, శాప్ ఛైర్మన్ రవినాయుడు ఘన స్వాగతం పలికారు.