Tirupati laddus row । తిరుపతి లడ్డూ విషయంలో సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సోమవారం ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు.. కనీసం దేవుళ్లనైనా రాజకీయాలకు దూరంగా ఉంచాలని అభిప్రాయపడింది. లడ్డూకు ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగిన విషయంపై ఎఫ్‌ఐఆర్ దాఖలుచేయడానికి ముందే మీడియా వద్దకు ఎందుకు వెళ్లారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడును ప్రశ్నించింది. కల్తీ నెయ్యిని లడ్డూలో వాడారనేందుకు ఆధారాలేంటని జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రశ్నించింది.
తిరుపతి లడ్డూలలో కల్తీ నెయ్యి వాడారనేందుకు ఆధారాలేంటని నిలదీసింది. ఈ విషయంలో ముఖ్యమంత్రి సెప్టెంబర్ 18న ప్రకటన చేస్తే.. సెప్టెంబర్ 25న ఎఫ్‌ఐఆర్ దాఖలైందని, సెప్టెంబర్ 26వ తేదీన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారని సుప్రీంకోర్టు పేర్కొన్నది. కోట్ల మంది ప్రజల మనోభావాలను ప్రభావితం చేసే అంశంలో బహిరంగ ప్రకటన చేయడం అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్నవారికి తగదని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. లాబ్‌లో పరీక్షించిన నెయ్యి నమూనా తిరస్కరించిన స్టాక్ నుంచి తీసుకున్న విషయాన్ని కోర్టు ఏపీ ప్రభుత్వ న్యాయవాది దృష్టికి తెచ్చింది. ప్రమాణాలకు అనుగుణంగా లేదని తేలిన నెయ్యిని లడ్డూ తయారీలో వాడారా? అని సీనియర్ అడ్వొకేట్ సిద్ధార్థ లూత్రాను జస్టిస్ ప్రశ్నించారు. ఆ విషయం దర్యాప్తులో ఉన్నదని లూథ్రా బదులిచ్చారు. ‘మరైతే వెంటనే మీడియా సమావేశంలో చెప్పాల్సిన అవసరమేంటి? మతపరమైన మనోభావాలను గౌరవించాలి కదా!’ అని జస్టిస్ గవాయి ప్రశ్నించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) సరిపోతుందా లేక స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించాలా? అన్న విషయంలో నిర్ణయం తీసుకునేందుకు సుప్రీంకోర్టుకు సహకరించాలని అదనపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ధర్మాసనం కోరింది. తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారనేందుకు ఆధారాలు చూపాలని కోర్టు కోరింది. తదుపరి విచారణను అక్టోబర్ 3వ తేదీకి వాయిదా వేసింది.
కల్తీ చేసిన నెయ్యిని లడ్డూలో ఉపయోగించి ఉంటే అది విశ్వాసానికి సంబంధించిన అంశమని, ఆమోద యోగ్యం కాదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చెప్పారు. తిరుపతి లడ్డూ తయారీలో జంతు కొవ్వు కలిసిన నెయ్యిని ఉపయోగించారన్న అంశంలో దాఖలైన వివిధ పిటిషన్లపై కోర్టు విచారణ జరుపుతున్నది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో లడ్డూ తయారీకి జంతు కొవ్వు కలిసిన నెయ్యిని వాడారని ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించిన విషయం సంచలనం రేపింది. రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు నీచమైన విమర్శలు చేస్తున్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు.