ఏన్డీఏ కూటమి శాసన సభ పక్ష నేతగా చంద్రబాబు

అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సొంతం చేసుకున్న ఎన్డీయే కూటమి పక్ష నేతగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికయ్యారు. అమరావతిలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి శాసనసభాపక్ష సమావేశం మంగళవారం నిర్వహించారు.

  • Publish Date - June 11, 2024 / 02:10 PM IST

జనసేన శాసన సభ పక్ష నేతగా పవన్ కల్యాణ్‌
అమరావతి రాజధాని…ఆర్థిక రాజధానిగా విశాఖ
బుధవారం ప్రమాణ స్వీకారం

విధాత : అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సొంతం చేసుకున్న ఎన్డీయే కూటమి పక్ష నేతగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికయ్యారు. అమరావతిలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి శాసనసభాపక్ష సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబును శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. చంద్రబాబును సీఎం అభ్యర్థిగా జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ప్రతిపాదించగా మూడు పార్టీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. ఎన్డీయే శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.
ఏపీ చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని తీర్పును ప్రజలు ఇచ్చారన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును నిలబెట్టుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పారు. ఏపీని కాపాడుకోవడానికి ప్రజలు చొరవ చూపారని వెల్లడించారు. నూటికి నూరు శాతం మూడు పార్టీల నేతలు, కార్యకర్తలు సమష్టిగా పనిచేశారంటూ ధన్యవాదాలు తెలిపారు. ప్రజల తీర్పుతో ఏపీ ప్రతిష్ఠ, గౌరవం పెరిగాయన్నారు.
పవన్ కల్యాణ్ సమయస్ఫూర్తిని ఎప్పటికీ మరచిపోలేనని, నేను జైలులో ఉన్నప్పుడు ఆయన వచ్చి పరామర్శించడంతో పాటు పొత్తు ప్రకటన చేశారని గుర్తు చేసుకున్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని చెప్పారని, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పొత్తు పెట్టుకున్నామని, ఎలాంటి పొరపొచ్చాలు లేకుండా కలిసి పనిచేశామని తెలిపారు. కూటమి ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ, ఎన్డీయే నేతలు హాజరవుతున్నారని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తామని కేంద్ర నేతలు చెప్పారని పేర్కోన్నారు. 14 ఏళ్లుగా సీఎంగా, 15 ఏళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్నానని, ప్రతి సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకుని ముందుకెళ్లామన్నారు. ఏపీలో చాలా సమస్యలు ఉన్నాయని, రాష్ట్రం పూర్తిగా శిథిలమైందని, అన్ని వర్గాలు దెబ్బతిన్నాయన్నారు. రైతులు అప్పుల పాలయ్యారని, పదేళ్ల తర్వాత రాజధాని ఏదంటే చెప్పుకోలేని పరిస్థితి నెలకొందన్నారు. కక్షపూరిత రాజకీయాలు కాకుండా నిర్మాణాత్మకంగా ముందుకు వెళ్లాలని, మూడు రాజధానులంటూ ఆటలాడే పరిస్థితి ఉండదని, అమరావతి రాజధానిగా ఉంటుందని, విశాఖను ఆర్ధిక, ఆధునిక రాజధానిగా చేసుకుందామని చంద్రబాబు వెల్లడించారు.

గవర్నర్‌కు ఎన్డీఏ కూటమి తీర్మానం
చంద్రబాబును ఎన్డీఏ కూటమి నేతగా ఎన్నుకున్న తీర్మానాన్ని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌కు అందించారు. టీడీపీ నేత అచ్చంనాయుడు, జనసేన నాదేండ్ల మనోహర్‌, బీజేపీ నేత పురంధేశ్వరిలు గవర్నర్‌ను కలిసి ఎన్డీఏ 164మంది ఎమ్మెల్యేలు చంద్రబాబుకు మద్దతునిస్తూ చేసిన తీర్మానాన్ని ఆయనకు అందించారు. పిదప గవర్నర్ చంద్రబాబును ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం పలుకుతారు. బుధవారం ఉదయం 11.27 గంటలకు ముఖ్యమంత్రిమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అమరావతిలో జరుగనున్న ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరువుతారు.

జనసేన పక్ష నేతగా పవన్ కల్యాణ్‌
ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన అన్ని స్థానాల్లో జనసేన ఘన విజయం సాధించడంతో ఎన్డీఏ కూటమి ఏర్పాటు, విజయ సాధనలో కీలకంగా వ్యవహారించిన పవన్ కల్యాణ్‌ను ఆ పార్టీ శాసన సభ పక్ష నేతగా ఎన్నికయ్యారు. పార్టీ ఎమ్మెల్యేలు 21మంది మంగళవారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో సమాశం నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనసభా పక్షనేతగా పవన్‌కల్యాణ్ పేరును ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్‌ ప్రతిపాదించారు. దీనికి మిగిలిన ఎమ్మెల్యేలంగా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. కాగా బుధవారం కొలువుదీరనున్న టీడీపీ కూటమి ప్రభుత్వంలో జనసేన భాగం కానున్నది. పొత్తులో భాగంగా పవన్‌కల్యాణ్‌తో పాటు పలువురికి మంత్రిపదవులు వరించనున్నాయి.

Latest News