వారానికి ఐదు రోజుల విధానం, ఏపీలో ఏడాది పాటు పొడిగింపు ఆమోదం తెలిపిన : సీఎం చంద్రబాబు

వారానికి ఐదు రోజుల పని విధానం మరి కొంత కాలం పాటు కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘం ఒక ప్రకటనలో తెలిపింది

  • Publish Date - June 27, 2024 / 04:03 PM IST

సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం

అమరావతి: వారానికి ఐదు రోజుల పని విధానం మరి కొంత కాలం పాటు కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘం ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్ర విభజన జరిగిన తరువాత ఏపీ సచివాలయాన్ని అమరావతికి తరలించిన సందర్భంగా ఏపీ సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల ఉద్యోగులు వారాంతంలో హైదరాబాద్ కు వచ్చి పోయేందుకు వీలుగా తీసుకు వచ్చిన వారానికి ఐదు రోజుల పనివిధానం ఈ నెల 27వ తేదీతో ముగుస్తుంది. అయితే ఏపీ రాజధాని నిర్మాణం పూర్తికాకపోవడం, గత ప్రభుత్వం రాజధాని విషయంలో తీసుకున్న నిర్ణయం వల్ల ఉద్యోగులు అమరావతిలో శాశ్వత నివాసాన్ని ఏర్పాటు చేసుకోలేక పోయారు.

దీంతో వారానికి ఐదు రోజుల పనివిధానాన్ని మరికొంత కాలం పొడిగించాలని ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. మా విజ్ఞప్తిని పరిశీలించి మరొక సంవత్సరం పాటు వారానికి ఐదు రోజుల పనిని కొనసాగించే ప్రతిపాదనకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపినట్లు సంఘం ఒక ప్రకటన విడుదల చేసింది. దీనిపై ఈరోజు లేదా రేపు ఉత్తర్వులు వెలబడతాయని తెలిపింది. వారానికి ఐదు రోజుల పని విధానాన్ని పొడిగించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని పేర్కొన్నది.

Latest News