వైసీపీ మ్యానిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్‌

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వైసీపీ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టో-2024ను వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి శుక్రవారం విడుదల చేశారు.

  • Publish Date - April 27, 2024 / 03:57 PM IST

తొమ్మిది ముఖ్యాంశాలతో హామీలు
పాత పథకాల కొనసాగింపు..విస్తరణ

విధాత, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వైసీపీ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టో-2024ను వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి శుక్రవారం విడుదల చేశారు. తాడెపల్లిగూడెం వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో తొమ్మిది ప్రధానాంశాలతో రెండు పేజీలతో రూపొందించిన మ్యానిఫెస్టోను జగన్ విడుదల చేశారు.

ఈ సందర్భంగా గత అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసిన తీరుతెన్నులను వివరిస్తూ, ప్రతిపక్షాల ఎన్నికల హామీలపై విమర్శలు గుప్పించారు. తాను ప్రతిపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు మాదిరిగా ఆచరణ సాధ్యంకాని హామీలు ఇవ్వలేనని, రాజకీయ నాయకుడు మాట ఇస్తే నిలబెట్టుకోవాలన్న సిద్ధాంతం మేరకే వైసీపీ నూతన ఎన్నికల మ్యానిఫెస్టో రూపొందించామని తెలిపారు.

మ్యానిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్ భావించామని, ఏటా ప్రోగ్రెస్ రిపోర్టుతో ప్రజలకు వివరించామని, 58 నెలల్లో 99 శాతం హామీలు అమలు చేసిన తీరు చరిత్రలో నిలిచిపోతుందని, ప్రభుత్వ పథకాలు నేరుగా ఇంటికే చేరేలా చేశామని తెలిపారు. ఇచ్చినమాట నిలబెట్టుకుని హీరోగా ఉండాలనుకున్నా. చెప్పినవన్నీ అమలుచేసి హీరోగా ప్రజల్లోకి వెళ్తున్నా అని జగన్ చెప్పుకున్నారు.

గతంలో సాధ్యంకాని హామీలిచ్చి చంద్రబాబు చేసింది మోసం కాదా? విశ్వసనీయత లేనప్పుడు రాజకీయాలు చేయడం ఎందుకు?. రాజకీయ నాయకుడంటే.. తాను చనిపోయాక ప్రతీ ఇంట్లో తన ఫొటో, పేదవాడి గుండెల్లో మనం ఉండాలనే తాపత్రాయమని జగన్ అభివర్ణించారు. పాత పథకాల కొనసాగింపు..విస్తరణ ఉంటుందని తెలిపారు.

మ్యానిఫెస్టోలోని ముఖ్యాంశాలు

జననన్న అమ్మ ఒడి రూ.15వేల నుంచి రూ.17వేలకు పెంపు, వైఎస్సార్ చేయూత( 45 పై బడ్డ వయస్సు ఉన్న మహిళలకు ) 75 వేల నుండి లక్షా యాభై వేలకు పెంపు), వైఎస్సార్‌ కాపు నేస్తం 60 వేల నుండి 1లక్షా 20 వేలకు పెంపు, ఓబీసీ నేస్తం 1లక్షా 20 వేలకు పెంపు, మహిళలకు రూ. 3లక్షల వరకూ సున్నా వడ్డీ రుణాలు, సామాజిక పింఛన్లను రెండు విడతల్లో రూ.3500 పెంపు, కల్యాణమస్తు, షాదీతోఫా కొనసాగింపు, అర్హులందరికీ ఇళ్ల పథకం కొనసాగింపుతో గతంలో చేపట్టిన 22.5లక్షల ఇళ్లకు అదనంగా మరో 10లక్షల ఇళ్ల నిర్మాణం, రూ.2000 కోట్లతో పట్టణాల్లో ఎంఐజీ ఇళ్లు.

రైతుభరోసా సొమ్ము మూడు దఫాలుగా రూ.13,500 నుంచి రూ.16వేలకు పెంపు, వైఎస్సార్ ఆరోగ్య శ్రీ ద్వారా 25లక్షల వరకు ఉచిత వైద్య వసతి, చేనేత నేస్తం కొనసాగింపు, మత్స్య కార భరోసా, వాహన మిత్ర కొనసాగింపు, లా నేస్తం కొనసాగింపు, స్కిల్ హబ్ ల కొనసాగింపు, 4 పోర్టులు..ఫిషింగ్ హార్బర్ ల పూర్తి, విద్యారంగంలో జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, విదేశీ విద్యాదీవెన, మనబడి నాడునేడు కొనసాగింపు, 2025-35వరకు ఒకటి నుంచి పదో తరగతి వరకు ఐబీ విద్యావిధానం అమలు వంటి పథకాలను, హామీలను వైసీపీ మ్యానిఫెస్టోలో ప్రకటించారు.

Latest News