AP | ఏపీలో కూటమిదే అధికారమా?.. ఫ్యాన్ జోరుకు సైకిల్ బ్రేక్‌

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో సంక్షేమ పథకాలు..సామాజిక వర్గాల లెక్కల అండతో మరోసారి అధికారంలోకి వస్తామనుకుంటున్న వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్‌రెడ్డి ఆశ‌లు అడియాశ‌లేనా?

  • Publish Date - May 23, 2024 / 05:30 PM IST

మార్పు దిశ‌గానే అధిక పోలింగ్ అంటున్న విశ్లేష‌కులు
రెడ్డి సామాజిక‌వ‌ర్గం ఓట్ల‌లో చీలికే జ‌గ‌న్ కొంప ముంచుతుందా?

విధాత : ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో సంక్షేమ పథకాలు..సామాజిక వర్గాల లెక్కల అండతో మరోసారి అధికారంలోకి వస్తామనుకుంటున్న వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్‌రెడ్డి ఆశ‌లు అడియాశ‌లేనా? వైనాట్ 175 నుంచి ఒక్క సీటైనా ఎక్కువ తెచ్చుకుంటామ‌న్న వైసీపీ నేత‌ల మాట‌లు దేనికి సంకేతం? మ‌ధ్యాహ్నం 3 గంట‌ల త‌రువాత పోలింగ్ కేంద్రాల‌కు వ‌చ్చి అర్ధ‌రాత్రి వ‌ర‌కూ ఓట్లేసింది సంక్షేమ ప‌థ‌కాల ల‌బ్దిదారుల‌నే జ‌గ‌న్ అండ్‌కో ఆశ నేతి బీర‌కాయ‌లో నేయి త‌ర‌హానే అంటున్నారు విశ్లేష‌కులు. అందుకే జూన్ 4 కౌంటింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్ధి ఓటమి త‌ప్పేలా లేద‌న్న అంచ‌నాకు వ‌స్తున్నారు అధికార పార్టీ నేత‌లు. ఆ ప్ర‌స్టేష‌న్‌లోనే అనేక ప్రాంతాల్లో ప్ర‌త్య‌ర్థుల‌పై దాడుల‌కు తెగ‌బ‌డుతున్న‌ట్లు పోలీసు అధికారులే ఆఫ్ ద రికార్డ్ చెబుతున్నారు.

ఏపీ ఎన్నికల్లో గెలుపుపై అటు జగన్‌, ఇటు చంద్రబాబు కూట‌మి ధీమాగా ఉన్నారు. జ‌గ‌న్ అయితే ఏకంగా ఐ ప్యాక్ మీటింగులో 151 స్థానాల‌కు పైనే గెలుచుకుని దేశం నివ్వెర‌పోయేలా చేస్తామ‌ని ఢంకా భ‌జాయించి మ‌రీ చెప్పారు. కానీ గ్రౌండ్ రిపోర్టు మాత్రం ఏదో తేడా కొడుతోందంటూ సంకేతాలు ఇస్తోంది. కౌంటింగ్ దగ్గర పడుతున్నకొద్దీ పోలింగ్ సరళీపై స్పష్టత వస్తున్న‌ది. ఏపీ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 81.66 శాతం ఓటింగ్ నమోదు అయింది. పోలింగ్ వరకు వైసీపీ, టీడీపీ కూటమి మధ్య నువ్వానేనా అన్నట్లు సమరం సాగింది. అందుకు తగ్గట్లు గానే ఓటింగ్ సైతం జరిగింది. ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ఓటర్లు తరలి రావడం కూట‌మికి అనుకూలమనే ప్రచారం ప్రారంభమైంది. పోలింగ్ శాతం పెరగడంతో ప్రభుత్వం పని అయిపోయిందని విపక్ష నేత‌లు భావించారు.

దీంతో జగన్ సైతం అలెర్ట్ అయ్యారు. విజయంపై ధీమా వ్యక్తం చేస్తూ ఓటింగ్ సరళిపై సమీక్షించారు. అయితే సంక్షేమ పథకాల లబ్ధిదారులు అయిన మహిళలు, పింఛన్ లబ్ధిదారులైన వృద్ధులు పెద్ద ఎత్తున ఓటు వేసేందుకు ఆసక్తి చూపడంతో తమదే గెలుపు అనే ధీమా వైసీపీలో కనిపిస్తోంది. జగన్ పాలనలో ప్రత్యక్ష నగదు బదిలీ పథకాల్లో ఆంధ్రప్రదేశ్‌ కొత్త రికార్డు సృష్టించింది. ఐదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వ పథకాల ద్వారా ఏకంగా 8.35కోట్ల మందికి సంక్షేమాన్ని అందించిన‌ట్లు వైసీపీ చెప్పుకుంటోంది. ఒక్కొక్కరికి ఒకటికి మించి పథకాలను అందించడం ద్వారా రాష్ట్ర జనాభా కంటే రెట్టింపు సంఖ్యలో ప్రయోజనాలు అందించామ‌న్న‌ది వారి వాద‌న‌. ప్రత్యక్ష నగదు బదిలీ పథకాల ద్వారా 2019 జూన్ నుంచి 2024 ఫిబ్రవరి నాటికి మొత్తం 8,35,04,830 మందికి రూ.2,58,855.97 కోట్లను నేరుగా వారి వారి బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ చేశారు.

ఈ పథకాల్లో అమ్మఒడి, జ‌గ‌న్ అన్న వసతి దీవెన, విద్యాదీవెన, స్వయం సహాయక బృందాలకు సున్నా వడ్డీ, వైఎస్‌ఆర్ చేయూత, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, కళ్యాణ మస్తు, షాదీతోఫా వంటి పథకాల్లో కేవలం మహిళల్ని మాత్రమే లబ్దిదారులుగా గుర్తించారు. ఏపీలో 17 సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రులను ఏర్పాటు చేశామంటున్నారు. రాబోయే రోజుల్లో ఈ ఆస్పత్రులు మెరుగైన సేవలందిస్తాయని, మారుమూల గ్రామాల్లోనూ జగన్ ప్రభుత్వం వైద్య సేవలందిస్తుందని, దేశంలో ఉత్తమ వైద్య సేవలందిస్తున్న ఘనత వైసీపీ ప్రభుత్వానిదేనని వైసీపీ నేతలు ఊదరగొట్టారు. ఏపీలో ఇంగ్లీషు మీడియం చ‌దువులు అందిస్తూ గ్రామీణ విద్యార్థులకు సైతం మెరుగైన విద్యను అందిస్తున్నామని విస్తృత ప్రచారం చేశారు.

ఈ నేపథ్యంలో ఆయా పథకాల లబ్ధిదారులైన మహిళలు, యువత, వృద్ధులు పోలింగ్ రోజున క్యూలైన్లలో పెద్ద సంఖ్యలో కనిపించడంతో వైసీపీ సహజంగానే గెలుపుపై ధీమాగా ఉంది. సరిగ్గా ఇదే రీతిలో తెలంగాణలో జగన్ మిత్రుడైన కేసీఆర్ ప్రభుత్వం కూడా అసెంబ్లీ ఎన్నికల్లో తన సంక్షేమ పథకాలే తమ గెలుపుకు సోపానాలని అతి విశ్వాసం చూపింది. కానీ మార్పు కోరిన తెలంగాణ ఓటరు చైతన్యం ముందు బీఆరెస్ ధీమా పటాపంఛలైంది. ఇప్పుడు కేసీఆర్ పరిస్థితినే జగన్ ప్రభుత్వానికి కూడా ఎదురయ్యే అవకాశం లేకపోలేదంటున్నారు విశ్లేషకులు. లక్షల కోట్ల అప్పులతో సంక్షేమ పథకాలిచ్చిన జగన్‌ను సైతం తెలంగాణ ఫలితాలు భయపెడుతున్నాయి.

అసలు ట్విస్టు ఇక్కడేనా..?

ఏపీ ఎన్నికల ఫలితాలపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ కూటమికి రెండింటి ధీమాకు కారణం పెరిగిన పోలింగ్ శాతం. సర్వే సంస్థలు సైతం ఫలితాలపై స్పష్టమైన అంచనాలకు రాకుండా సవాల్ విసురుతున్న సమస్య పెరిగిన పోలింగ్ శాతం. సంక్షేమ పథకాల లబ్ధిదారులు పోలింగ్‌లో పోటెత్తినందునే వైసీపీ గెలుపు ధీమా అని ఆ పార్టీ వర్గాల వాదన. ప్రభుత్వంపై వ్యతిరేకతతోనే పోలింగ్ పెరిగిందని అందుకే గెలుపుపై మాకు నమ్మకముందని కూటమి లెక్కలు కడుతోంది. గత ఎన్నికల సమయంలో ప్రభుత్వ వ్యతిరేకతను ఓటింగ్ రూపంలో ఏపీ ప్రజలు తీర్పునిచ్చారని, ఈ సారి కూడా ఇదే రిపీట్ అవుతుందని కూటమి నేతలు పేర్కొంటున్నారు.

అయితే ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టుపై వ్యతిరేకత, జగన్ మ్యానిఫెస్టోలో కొత్త పథకాలు ప్రకటించకపోవడంతో కనీసం లక్ష రూపాయల రుణమాఫీ అయినా చేస్తారని భావించిన రైతాంగానికి నిరాశే ఎదురైంది. దీంతో రైతుల్లో ఎక్కువగా ఉండే రెడ్డి సామాజిక వర్గం ఓటర్లు 15 నుంచి 20 శాతం మంది జగన్‌కు వ్యతిరేకంగానే ఓటింగ్ చేశారన్న వాదన వినిపిస్తుంది. దీనికి తోడు జగన్ సంక్షేమ పథకాలతో పొలాల్లో పనిచేసేందుకు కూలీలకు డిమాండ్ పెరిగిపోవడంతో వ్యవసాయం భారమైందన్న అసంతృప్తి రైతుల్లో నెలకొంది. బీజేపీ, జనసేన పొత్తు నేపథ్యంలో ముస్లిం ఓటర్లు టీడీపీకి కొంత దూరమైనా ఆర్యవైశ్యులు, బ్రాహ్మణ సామాజిక వర్గాలు కూటమికి అనుకూలంగా వ్యవహారించాయని లెక్కలేస్తున్నారు.

ముఖ్యంగా 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ అభివృద్ధిని పక్కనపెట్టి.. ఓట్ల కోసమే అన్నట్లు రాష్ట్రం లోటుబడ్జెట్‌లో ఉన్నప్పటికీ ఉచిత పథకాలను ప్రవేశపెట్టారు. దీంతో ఏపీ లక్షల కోట్ల అప్పులమయమైంది. గ్రామాల్లో కనీసం రోడ్లు, మంచినీటి వసతి, విద్యుత్తు వసతులు వంటి కనీస మౌలిక వసతులు జగన్ ప్రభుత్వం కల్పించలేకపోయింది. ఇరిగేషన్, విద్యుత్తు ప్రాజెక్టుల విషయంలో కూడా జగన్ ప్రభుత్వం కొత్తగా సాధించిన పురోగతి లేకపోవడం మైనస్‌గా మారింది. పారిశ్రామిక రంగంలో జగన్ ప్రభుత్వం కొత్త పరిశ్రమలను, పెట్టుబడులను సాధించలేకపోవడంతో ఉద్యోగ, ఉపాధి కల్పన రంగంలో యువత ఆశలను నీరుగార్చిందని ఆయా కోణాల్లో ప్రభుత్వ వైఫల్యాలపై అసంతృప్తితో ఉన్న సంబంధిత ఓటర్లు వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారని పోలింగ్ సరళిని విశ్లేషిస్తున్న నిపుణులు భావిస్తున్నారు.

రాజధాని లేకపోవడంతో విదేశీ, స్వదేశీ పెట్టుబడుల సాధనలో జగన్ ప్రభుత్వ వైఫల్యం రాష్ట్రాభివృద్ధికి బ్రేక్‌లు వేసిందని భావించిన ఓటర్లు సైతం పోలింగ్‌లో ఫ్యాన్ స్పీడ్‌కు బ్రేక్‌లేశారని అంచనా వేస్తున్నారు. టీడీపీ కూటమి సూపర్‌సిక్స్‌ హామీల ప్రభావం కూడా వారికి కలిసొస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ సరళీలో మరో కీలకమైన పరిణామం..ఇతర ప్రాంతాల నుంచి, విదేశాల నుంచి వచ్చిన ఓటర్లు మెజార్టీ భాగం వైసీపీకి వ్యతిరేకంగానే ఓటింగ్ చేశారని విశ్లేషిస్తున్నారు. ఆ ఓటర్లకు తోడు పైన పేర్కోన్న ఆలోచనలతో ఉన్న ఓటర్లు కూటమివైపు మొగ్గు చూపారని, ఇదే సమయంలో జగన్ గెలుపు ఆశలకు కారణమైన సంక్షేమ పథకాల ఓటర్లలో కొన్ని వర్గాలు సైతం టీడీపీకి అనుకూలంగా ఓటింగ్ చేసినట్లుగా నిపుణులు తేలుస్తున్నారు. ఈ నేపథ్యంలో కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్లుగా రెండోసారి అధికారంలోకి రావాలన్న జగన్ ఆశలు ఈ దఫా నెరవేరే అవకాశం లేదన్న విశ్లేషణలు బలపడుతున్నాయి.

Latest News