Site icon vidhaatha

మేం ఇచ్చిన దానికంటే ఎక్కువ ఆశించారేమో.. అందుకే ఓడిపోయాం: బొత్స

మేం చేయలేని వాటిని వారు చేస్తే స్వాగతిస్తాం
ప్రాంతీయ పార్టీలు ఓడితే పార్టీ పెద్ద ఓడినట్లు చెప్పడం సరికాదు
మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ

విధాత : ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమిని అంగీకరిస్తున్నామని, మేము ప్రజలను నమ్మామని.. మా విధానాలను విశ్వసించామని.. వారు ఇంతకంటే మెరుగైనవి కోరుకున్నారేమోనని, మేం ఇచ్చిన దానికంటే ఎక్కువ ఆశించి ఉంటారేమోనని అందుకే మా పార్టీ ఓడిపోయి ఉండవచ్చని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో వైసీపీ శ్రేణులు చాల కష్టపడ్డాయని, ప్రభుత్వం ఐదేళ్లలో ప్రజలకు చేయాల్సిన మంచి చేసిందన్నారు. గ్రామ సచివాలయాలు తెచ్చామని, ఊర్లలోనే రైతులకు విత్తనాలు ఇచ్చామని, 2.70లక్షల కోట్లతో సంక్షేమం, ఇటు అభివృద్ధి చేసుకొచ్చామని, తలసరి ఆదాయాన్ని పెంచామని, అయితే మరి కొన్ని మిగిలి ఉన్నాయని, వాటిని నూతన ప్రభుత్వం కొనసాగించాలని కోరారు. మెడికల్ కాలేజీలూ, రోడ్లు, ఇంటింటికీ తాగునీరు, ఆంగ్ల మాధ్యమ బోధనన ఇలా అన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారని ఆశిస్తున్నామన్నారు. ఎలాంటి అవినీతి లేని పాలన అందించామని.. దానిని కొనసాగించాలని ఆకాంక్షించారు. ఐదేళ్లు సేవ చేసే అవకాశాన్ని ఇచ్చిన ప్రజానీకానికి ధన్యవాదాలు తెలిపారు. మేము ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటామన్నారు. ప్రజలకు మేలు జరగాలని.. జీవనం మెరుగుపడాలనే కోరుకుంటున్నామని, ఏదేమైనా ఓటు వేసి తీర్పు ఇచ్చిన వారు ప్రజలేనని లాభనష్టాలు వారికే చెందుతాయని బొత్స తెలిపారు.

మేం మా జిల్లాలో సెంట్రల్ యూనివర్సిటీ తీసుకొచ్చామని, పార్వతీపురంలో పెట్టాలనుకున్నామని.. మరి వారు ఇంతకంటే ఎక్కువ తీసుకొస్తారేమో చూడాలన్నారు. ఇప్పుడే విమర్శలు అవసరం లేదని, కొన్ని రోజులు చూద్దామని చెప్పారు. మేము సరిగ్గా చేయకపోతే వాళ్లు అధికారంలోకి వచ్చారు కదా వాటిని సరి చెయ్యాలన్నారు. ప్రాంతీయ పార్టీలు గెలిచిన ఓడినా పార్టీ పెద్ద ఓడారని, జగన్ ఓడిపోయాడని అనకూడదని స్పష్టం చేశారు. మెగా డీఎస్సీ ఇరవై వేల ఉద్యోగాలతో మెగా డీఎస్సీ అన్నారని ప్రకటిస్తే మంచిదేనని బొత్స వ్యాఖ్యానించారు. ఓపీఎస్ ఇస్తామన్నారని ఇవ్వమనండి తప్పేమి లేదన్నారు. సచివాలయాలు, రైతులకు ఊర్లలోనే విత్తనాలను ఇచ్చామని బొత్స సత్యనారాయణ వెల్లడించారు.

Exit mobile version