Site icon vidhaatha

Nara Lokesh | తల్లికి వందనంపై వైసీపీ అసత్య ప్రచారం : నారా లోకేశ్

Nara Lokesh | తల్లికి వందనం పథకంలో లబ్ధిదారుల ఖాతాలో రూ.13వేలు..నా ఖాతాలో రూ.2వేలు పడ్డాయంటూ వైసీసీ నేతలు సాగిస్తున్న అసత్య ప్రచారంపై ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా మండిపడ్డారు. ఇలాంటి అసత్య ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవని నారా లోకేశ్‌ హెచ్చరించారు. రూ.2వేలు నా ఖాతాలో పడినట్టు రుజువు చేయాలి, లేకుంటే క్షమాపణ చెప్పి..అసత్య ప్రచార ప్రకటన ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. లేదంటే చట్టపరంగా ముందుకెళ్తానని లోకేశ్ స్పష్టం చేశారు. నిరాధార ఆరోపణలు చేసేవారు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. గతంలో మాదిరిగా అసత్య ఆరోపణలను సహించేది లేదన్నారు. వైసీపీ పాలనలో విద్యాశాఖను నాశనం చేశారని..గతంలో విద్యాశాఖ మంత్రి ఏం చేశారో ఎవరికి తెలియదని విమర్శించారు. ప్రభుత్వ బడుల్లో ఎంతమంది చదువుతున్నారో తెలుసుకునేందుకు వందరోజులు పట్టింది అని మంత్రి లోకేశ్‌ అన్నారు. రాష్ట్రంలోని 80శాతం మంది పాఠశాల విద్యార్థులకు పాఠశాలల ప్రారంభం రోజునే పుస్తకాలు, బ్యాగ్ లతో కూడిన కిట్‌లు అందించామని లోకేశ్‌ పేర్కొన్నారు. మిగిలిన 20శాతం మందికి ఈనెల 20వ తేదీ లోపు అందిస్తామన్నారు.

మధ్యాహ్న భోజనంలో సన్న బియ్యం

తల్లికి వందనం లబ్ధిదారుల్లో కొందరి ఖాతాలు యాక్టివ్‌ లేక నిధులు తిరిగి వచ్చాయని తెలిపారు. ఆయా ఖాతాలు యాక్టివ్‌ చేసుకోవాలని తల్లులను కోరుతున్నామని లోకేశ్ వెల్లడించారు. ఖాతాలు యాక్టివ్‌ అయ్యాక వారికి తల్లికి వందనం నగదు వేస్తామన్నారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామని స్పష్టం చేశారు. మధ్యాహ్న భోజనంలో సన్న బియ్యం ఇవ్వాలని నిర్ణయించామని. 9,600 పాఠశాలల్లో వన్‌ క్లాస్‌- వన్‌ టీచర్‌ మోడల్‌ తీసుకొచ్చామని.. ప్రభుత్వ బడుల్లో నాణ్యత పెంచాలనేదే మా లక్ష్యమన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఏపీ మోడల్‌ ఎడ్యుకేషన్‌ అంటే ఏంటో ఏడాదిలో చూపిస్తామని లోకేశ్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు అన్నింటికీ ఉచిత కరెంట్‌ ఇస్తున్నామని గుర్తు చేశారు. మెగా డీఎస్సీ నియామక ప్రక్రియ జరుగుతోందని..సోమవారం నాటికి ఉపాధ్యాయుల బదిలీలు పూర్తి చేస్తామని తెలిపారు. అంగన్వాడీ పిల్లలకు తల్లికి వందనం వర్తించబోదని తెలిపారు.

Exit mobile version