శ్రీశైలం : శ్రీశైలం వెళ్లే భక్తులకు, వాహనదారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక సూచన చేసింది. శ్రీశైలం – హైదరాబాద్, నాగార్జునసాగర్ – శ్రీశైలం, దోర్నాల – శ్రీశైలం రహదారుల గుండా వెళ్లే భక్తులు.. అటవీ ప్రాంతంలో ఎలాంటి ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ బాటిల్స్ వినియోగించరాదు. ప్లాస్టిక్ వినియోగిస్తే తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ దారుల్లో ఆహారం కూడా పడేయొద్దని ఆదేశించింది. శ్రీశైలం – హైదరాబాద్, నాగార్జునసాగర్ – శ్రీశైలం, దోర్నాల – శ్రీశైలం దారులపై కేవలం 30 కిలోమీటర్ల వేగంతో మాత్రమే ప్రయాణించాలని సూచించారు. అతివేగంగా ప్రయాణిస్తే వన్యప్రాణులకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుందన్నారు. వేగంగా ప్రయాణించే వాహనాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.