ఓటమి కారణాలపై పోస్టుమార్టమ్
విధాత: వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గురువారం పార్టీ ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. తన నివాసంలో పార్టీ ముఖ్యనేతలతో భేటీయైన జగన్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమికి గల కారణాలను విశ్లేషిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం 63 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు సామాజిక భద్రత పింఛను పంపిణీ చేసిందని, రైతు భరోసా పథకం కింద దాదాపు 54 లక్షల మంది రైతులు లబ్ధి పొందారని, అమ్మ ఒడి పథకం కింద దాదాపు 53 లక్షల మంది మహిళలకు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివేందుకు డబ్బులు అందజేశామని వారందరి ఓట్లు ఎటు పోయాయని ఓటమి అనంతరం జగన్ మాట్లాడారు.
వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ మత్స్యకార భరోసా తదితర అనేక సంక్షేమ పథకాల లబ్ధిదారులకు ప్రభుత్వం 2.70 లక్షల కోట్లకు పైగా పంపిణీ చేసిందని ఆయా పథకాల ద్వారా లబ్ధి పొందిన మహిళలు, అమ్మమ్మలు, తాతలు, నేత కార్మికులు, మత్స్యకారులు, టైలర్లు, బార్బర్‌లు, చాకలి, ఆటో డ్రైవర్ల ప్రేమ, ఆప్యాయత ఓట్ల రూపంలోకి ఎందుకు మారలేదని జగన్ వాపోయారు.
గ్రామ వాలంటీర్ వ్యవస్థ విజయంతమైందని, వైసీపీ తన మ్యానిఫెస్టోను పవిత్ర గ్రంథంగా పరిగణించి 99 శాతం హామీలను ప్రభుత్వం నెరవేర్చిందని ప్రజలకు తెలుసని, ఐనప్పటికి ఎన్నికల్లో దారుణంగా ఎందుకు ఓడిపోయామో తెలియడం లేదన్న జగన్ ఇప్పుడు పార్టీ ముఖ్య నేతల సమావేశంలో తన సందేహాలకు సమాధానాలు వెతుకుతున్నారు. సంక్షేమం పథకాల కంటే టీడీపీ సూపర్ సిక్స్ జనాన్ని ఎక్కువ ఆకర్షించాయా లేక మూడు రాజధానులు, ల్యాండ్ టైటిల్ వంటి వివాదం వైసీపీకి ప్రతికూలంగా మారాయా అన్న అంశాలపై జగన్ పార్టీ నేతలను ఆరా తీస్తున్నారు. సిద్ధం సభలకు, బస్సు యాత్రకు భారీగా హాజరైన జనం ఓట్లను ఎందుకు వేయలేదన్న దానిపై సమీక్ష చేస్తున్నారు.