రేపు సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ

సుప్రీంకోర్టులో  గురువారం ఓటుకు నోటు కేసు విచారణకు రానుంది. జస్టిస్ సుందరేశ్‌, జస్టిస్ ఎస్‌వీఎన్‌ భట్టిల ధర్మాసనం ఈ కేసు విచారణ జరుపనుంది. ఈ కేసు విచారిస్తున్న తెలంగాణ ఏసీబీ సరిగా విచారణ

  • Publish Date - April 17, 2024 / 08:40 PM IST

విధాత : సుప్రీంకోర్టులో  గురువారం ఓటుకు నోటు కేసు విచారణకు రానుంది. జస్టిస్ సుందరేశ్‌, జస్టిస్ ఎస్‌వీఎన్‌ భట్టిల ధర్మాసనం ఈ కేసు విచారణ జరుపనుంది. ఈ కేసు విచారిస్తున్న తెలంగాణ ఏసీబీ సరిగా విచారణ చేయడం లేదని..ఈ కేసును సీబీఐకి బదిలీ చేయాలని, ఈ కేసులో చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో 2017లో రెండు పిటిషన్లు దాఖలు చేశారు. ఇవే కాకుండా ఇదే కేసులో మరో మూడు పిటిషన్లు ఈ కేసులో సుప్రీం కోర్టు ముందున్నాయి. వాటిలో జెరుసలం మత్తయ్యను తెలంగాణ హైకోర్టు ఈ కేసు నుంచి తప్పిస్తే అలా తప్పించడానికి వీల్లేదని తెలంగాణ ఏసీబీ వేసిన పిటిషన్‌తో పాటు ఇదే అంశంపై సెబాస్టియన్ వేసిన మరో పిటిషన్, మాజీ మంత్రులు జి. జగదీశ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌, మహమ్మద్ అలీ, ఎమ్మెల్సీ సంజయ్‌లు ఓటుకు నోటు కేసును తెలంగాణ హైకోర్టులో విచారణ చేయరాదని, మధ్యప్రదేశ్ భోపాల్‌ కోర్టుకు బదిలీ చేయాలని వేసిన పిటిషన్ కూడా ఈ కేసులో విచారణకు సుప్రీం ముందున్నాయి. గతంలో మాజీ మంత్రుల పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి, ఇతర ప్రతివాదులకు నోటీసులు ఇచ్చింది. గత విచారణ సందర్భంగా వాయిదా మేరకు నేడు సుప్రీం కోర్టులో ఓటుకు నోటు కేసు పిటిషన్ల విచారణ జరగనుంది.

2015లో టీడీపీ అధినేత, అప్పటి ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబునాయుడు సూచనలతో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గెలుపుకు అవసరమైన ఇద్దరు ఎమ్మెల్యేల మద్ధతు కూడగట్టే క్రమంలో ప్రస్తుత తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించే నేపథ్యంలో నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టిఫెన్ సన్‌కు డబ్బు ఎరగా చూపారన్న అభియోగాలతో ఈ కేసు నమోదైంది. 2015లో జరిగిన ఈ కేసును సీబీఐకి అప్పగించాలని, చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలని ఆళ్ల రామకృష్ణారెడ్డి 2017లో సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. అప్పటి నుంచి చంద్రబాబు న్యాయవాదులు వాయిదాలు తీసుకుంటు వస్తుండటంతో నేడు కూడా విచారణ వాయిదా పడవచ్చని భావిస్తున్నారు. ఏపీ అసెంబ్లీ సహా పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్న సమయంలో సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణకు రానుండటం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపింది.

Latest News