చిన్నాన్నను చంపిన వారికి మద్దతు మంచిది కాదు

ఏపీ అసెంబ్లీ ఎన్నికల తరుణంలో సీఎం వైఎస్‌.జగన్‌కు దివంగత వైఎస్.వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ రాసిన లేఖ సంచలనంగా మారింది. ఆమె జగన్‌కు రాసిన లేఖ వివరాలు ఇలా ఉన్నాయి

  • Publish Date - April 25, 2024 / 02:45 PM IST

సీఎం జగన్‌కు వైఎస్ వివేకానంద సతీమణి సౌభాగ్యమ్మ లేఖ
నిజం..న్యాయం..ధర్మంవైపు నిలబడాని అభ్యర్థన

విధాత : ఏపీ అసెంబ్లీ ఎన్నికల తరుణంలో సీఎం వైఎస్‌.జగన్‌కు దివంగత వైఎస్.వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ రాసిన లేఖ సంచలనంగా మారింది. ఆమె జగన్‌కు రాసిన లేఖ వివరాలు ఇలా ఉన్నాయి. దివంగత వైఎస్‌. రాజశేఖర్ రెడ్డి కుమారుడిగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్న జగన్మోహన్ రెడ్డికి.. మీ చిన్నమ్మ సౌభాగ్యమ్మ ఆవేదనతో ఈ లేఖ రాస్తున్నానంటు ఆమె లేఖలో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. 2009న తండ్రిని కోల్పోయినప్పుడు నీవు ఎంత మనో వేదన అనుభవించావో 2019లో మీ చెల్లి సునిత కూడా అంతే ఆవేదన అనుభవించిందని లేఖలో పేర్కోన్నారు.

అప్పటినుంచి ఇంతవరకు జరిగిన పరిణామాల్లో మమ్మల్ని ఎక్కువగా బాధపెట్టిన విషయం.. మన కుటుంబంలోని వారే ఈ హత్యకు కారకులు కావడం.. హత్యకు కారకులైన వాళ్లకు నువ్వు రక్షణగా ఉండటం. నిన్ను సీఎంగా చూడాలని ఎంతో తపించిన చిన్నాన్నను ఈ విధంగా మీ పత్రికలు మీ సోషల్ మీడియా మీ పార్టీ వర్గాలు తీవ్ర రూపంలో మాటల్లో చెప్పలేనంత విధంగా హననం చేయడం.. చేయించడం ఇది మీకు తగునా అని ప్రశ్నించారు.

న్యాయం కోసం పోరాటం చేస్తున్న నీ చెల్లెలు సునితను హేళన చేస్తూ నిందలు మోపుతూ దాడులకు కూడా తెగబడే స్థాయికి కొంతమంది దిగజారుతుంటే నీకు ఏమాత్రం పట్టడం లేదా అని నిలదీశారు. సునితకు మద్దతుగా నిలిచి పోరాడుతున్న షర్మిలను కూడా టార్గెట్ చేస్తుంటే నీవు నిమ్మకు నిరెత్తినట్లు ఉండటం ఏమిటని.. కుటుంబ సభ్యునిగా కాకపోయినా రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయినా ఇదేనా నీ కర్తవ్యం అని ప్రశ్నించారు.

ఇంకా బాధించే విషయం హత్యకు కారకులైన వారికి మరల ఎంపికగా పోటీ చేసే అవకాశాన్ని నీవు కల్పించడం. ఇది సమంజసమా? ఇటువంటి దుశ్చర్యలు నీకు ఏమాత్రం మంచిది కాదు. ఇది నీకు తగినది కాదు అని నేను విన్నవించుకుంటున్నాను. హత్యకు కారకుడైన నిందితుడు నామినేషన్ దాఖలు చేసినందునా చివరి ప్రయత్నంగా న్యాయం ధర్మం గురించి ఆలోచన చేయమని నిన్ను అర్ధిస్తున్నాను. రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తానని ప్రమాణస్వీకారం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రిగా న్యాయం ధర్మం నిజాం వైపు నిలబడాలని నిన్ను వేడుకుంటున్నానని సౌభాగ్యమ్మ తన లేఖలో పేర్కోన్నారు.

Latest News